తమిళనాడులో రోడ్డు ప్రమాదం..  పీలేరులో విషాదం
x

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. పీలేరులో విషాదం

టిప్పర్ ను ఢీకొన్న కారు. మాజీ సర్పంచ్, తమ్ముడు మృతి.


అనారోగ్యంతో ఉన్న మాజీ సర్పంచ్ కు చెన్నైలో చికిత్స చేయించడానికి తమ్ముడు, కొడుకు కారులో బయలుదేరారు. వారిని మృత్యువు వెంటాడింది. ఆగి ఉన్న టిప్పర్ ను కారు ఢీకొనడంతో మాజీ సర్పంచ్, ఆయన తమ్ముడు మరణించారు. కారు నడుపుతున్న ఆయన కొడుకు తీవ్ర గాయాలతో తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

పీలేరు మాజీ సర్పంచ్ హుమాయూన్

తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో విషాదం నింపింది. ఆ వివరాల్లోకి వెళితే..

పీలేరు మాజీ సర్పంచ్ హుమాయూన్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రతి పది రోజులకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
పీలేరు నుంచి హుమాయూన్ ను తీసుకుని ఆయన తమ్ముడు షాజహాన్ సోమవారం వేకువజామాను కారులో బయలుదేరారు. ఈ కారును హుమాయూన్ కొడుకు హబీబ్ నడుపుతున్నాడు. చిత్తూరు, పుత్తూరు మీదుగా రోడ్డు బాగుండడం వల్ల ఈ మార్గంలో వారు ప్రయాణిస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని తిరుత్తణి వద్ద ప్రయాణిస్తుండగా, ఎదురుగా ఉన్న టిప్పర్ ను ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది. కారు ముందు సీటులో ఉన్న హుమాయూన్, వెనుక సీటులో ఉన్న ఆయన తమ్ముడు షాజహాన్ అక్కడికక్కడే మరణించారు. కారు నడుపుతున్న హుమాయూన్ కొడుకు హబీబ్ తీవ్రంగా గాయపడ్డాడు.

తమిళనాడుకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో సమీపంలో ఉన్న వారు అప్రమత్తం అయ్యారు. వాహనదారులు కూడా వెంటనే కారు వద్దకు చేరుకుని, లోపల చిక్కుకున్న వారిని బయటికి తీయడానికి శ్రమించారని తెలిసింది.
ఈ సమాచారం అందుకున్న తిరుత్తణి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను తిరుత్తణి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు సమాచారం అందింది. తీవ్రంగా గాయపడిన హుమాయూన్ కొడుకు హబీబ్ ను హైవే పెట్రోలింగ్ పోలీసులు, స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హబీబ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.
"చెన్నైకి వెళ్లడానికి ఈ మార్గం బాగుంది. అందువల్లే ఈ మార్గంలో ప్రయాణిస్తూ, మృత్యువాత పడ్డారు" అని హుమాయూన్ కు వరుసకు తమ్ముడైన మల్లెల జాకీర్ చెప్పారు.
పీలేరులో విషాదం
తమిళనాడులోని తిరుత్తణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పీలేరు మాజీ సర్పంచ్ హుమాయూన్ వద్ద లభించిన ఆధారాలతో అక్కడి పోలీసులు కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో పట్టణంలో తీవ్ర విషాదం అలుముకుంది.
పీలేరు పట్టణంలో ముస్లింల జానాభా ఎక్కువ. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే హుమాయూన్ 2001 నుంచి 2006 వరకు పట్టణ సర్పంచ్ గా పనిచేశారు. మళ్లీ 2013 నుంచి 2018 వరకు కూడా ఆయన సర్పంచ్ గా విజయం సాధించారు.
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా ఆయన ముస్లిం వర్గాల నేతగా కీలకంగా పనిచేశారు. మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి అండగా నిలవడం తోపాటు ఆయన విజయంలో కూడా కీలకంగా వ్యవహరించారు.
ఆ తరువాత కూడా ఆయన టీడీపీలో వచ్చినా, మైనారిటీ వర్గాల్లో మంచి పట్టు ఉన్న నేతగా సమర్థతను చాటుకున్నారు. నేతలు ఆయన వద్దకు రావడం మినహా, ఆయన వారి వద్దకు వెళ్లే రకం కాదనే గుర్తింపు సాధించిన నేతగా హుమాయూన్ కు పీలేరు పట్టణంలో గుర్తింపు ఉంది.
ఆయన మరణంతో ముస్లిం వర్గాల్లోనే కాకుండా, పట్టణంలో రాజకీయంగా మంచి పట్టు ఉన్న నేత అకాల మరణానికి గురికావడంతో అన్ని వర్గాల్లో విషాదం నింపింది.
Read More
Next Story