రాజకీయ యవనికపై..  రాయచోటిచ్చారు..
x

రాజకీయ యవనికపై.. రాయ'చోటిచ్చారు.."

తాజా ఎన్నికల్లో అది కూడా ఓ అసెంబ్లీ స్థానమే. రాజకీయంగా ఆ కేంద్రం రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. మరుగున ఉన్న అనేక రాజకీయ చారిత్రక అంశాలను తెరపైకి తెచ్చింది. ఏమా కథ? ఏమా చరిత్ర??


రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రాయలసీమలోని కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ స్ధానం కూడా ఒకటి. 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కొందరు రాష్ట్ర స్ధాయిలో గుర్తింపు పొందరు. ఇంకొందరు అధినేతల మెప్పు కూడా పొందారు. ఆ రోజుల్లో సాధ్యం కానిది.. సీఎం ఎన్. చంద్రబాబు వల్ల రాయచోటికి మొదటిసారి మంత్రి పదవి దక్కింది. దీంతో రాజకీయ చరిత్ర పుటల్లో నియోజకవర్గంలో ప్రాధాన్యత కలిగిన అంశాలు తెరపైకి వచ్చాయి.

కడప జిల్లాలో అంతర్భాగమైన రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇక్కడి అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్టే కాదు. గెలిచిన ఆయనకు ఊహించని విధంగా మంత్రి పదవి దక్కింది. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాదరెడ్డికి అవకాశం ఇవ్వడం ద్వారా రాయచోటిని చరిత్రపుటపై మరో సంతకం చేయించారు. అంతేకాకుండా, 20 ఏళ్ల తరువాత రాయచోటిలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం.
చరిత్ర పేజీల్లో రాయచోటి...

1952లో ఏర్పడిన రాయచోటి స్ధానంలో రెండు ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోనే అత్యధిక ముస్లిం ఓటర్లు ఉన్న ఈ అసెంబ్లీ స్దానంలో ఒకసారి మాత్రమే ముస్లిం అభ్యర్థి విజయం సాధించారు. జిల్లాలోనే మొదటిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మహిళ షవరున్నీసా, టీడీపీ నుంచి పోటీ చేసిన షేక్ దాదాసాహెబ్ ఓటమి చెందారు. ఇద్దరు ముస్లిమేతరులు స్వతంత్ర అభ్యర్థులుగా సత్తా చాటారు.

1952: రాయచోటి అసెంబ్లీ స్థానానికి జరిగిన మొదట ఎన్నికల్లో వై. ఆది:నారాయణరెడ్డి మొదటి ఎమ్మెల్యే.

1955: కాంగ్రెస్ అభ్యర్థిగా వై. ఆదినారాయణరెడ్డి విజయం
1962 :యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు
1967 :ఎమ్మెల్యేగా ఎన్నికైన సైనికాధికారి మిన్నంరెడ్డి కృష్ణారెడ్డి
1972 :కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి ముస్లిం అభ్యర్థి హబీబుల్లా విజయం
1978 :జనతా పార్టీ నుంచి సుగవాసి పాలకొండరాయుడు
1983 :స్వతంత్ర అభ్యర్థిగా సుగవాసి పాలకొండ రాయుడు
1985 :మండిపల్లి నాగారెడ్డి (కాంగ్రెస్)
1990 :మండిపల్లి నాగిరెడ్డి (కాంగ్రెస్)
1992 :మండిపల్లి నారాయణరెడ్డి (కాంగ్రెస్)
1994 :మండిపల్లి నారాయణరెడ్డి (కాంగ్రెస్)
1999 : సుగవాసి పాలకొండరాయుడు (టీడీపీ
2004 :సుగవాసి పాలకొండరాయుడు (టీడీపీ)
2009 :గడికోట శ్రీకాంత్ రెడ్డి (కాంగ్రెస్)
2012 :గడికోట శ్రీకాంత్ రెడ్డి (వైఎస్ఆర్ సీపీ)
2014 :గడికోట శ్రీకాంత్ రెడ్డి (వైఎస్ఆర్ సీపీ)
2019 :గడికోట శ్రీకాంత్ రెడ్డి (వైఎస్ఆర్ సీపీ)
2024 :మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (టీడీపీ)

వారిద్దరే బాస్ లు..
2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి, అంతకుముందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టీ. రామారావు, ఆ తరువాత ఎన్. చంద్రబాబు నాయుడుకు "ఎస్.. బాస్" అనే వారే కనిపించారు. 985 నుంచి ఈ నియోజకవర్గంపై దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రభావం ఎక్కువ ఉండేది. ఆయన కనుసన్నల్లోనే అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు ఉండేది. కాగా,
అది వైఎస్.. చంద్రబాబు ఎన్నికే
ప్రస్తుత రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మండిపల్లి కుంటుంబానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన తండ్రి మండిపల్లి నాగిరెడ్డి సమితి అధ్యక్షుడిగా గంట గుర్తుపై గెలిచారు. ఆయన గంట నాగిరెడ్డిగా అందరికీ పరిచితుడు. ఆయన 1985, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన 1992లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో 1993లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయనకు వరుసకు సోదరుడైన మండిపల్లి నారాయణరెడ్డికి టికెట్ ఇప్పించడంతో పాటు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ రాయచోటిలోనే మకాం వేశారు. మరోపక్క టీడీపీ నేతగా ఎన్. చంద్రబాబునాయుడు తిష్టివేయడంతో ఎన్నిక హోరాహోరీగా జరిగింది. ఈ ఎన్నికల్లో నారాయణరెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత 1994 సార్వత్రిక ఎన్నికల్లో కూడా నారాయణరెడ్డి విజయం సాధించారు.
2003 సార్వత్రిక ఎన్నికల నాటికి రాజకీయ రంగ ప్రవేశం చేసిన మండపల్లి రాంప్రసాదరెడ్డి 2009లో కాంగ్రెస్ టికెట్ ఆశించి, భంగపడ్డారు. ఆ తరువాత మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేశారు. ఆయనపై అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందారు.
2014లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యంలో జైసమైక్యాంధ్ర నుంచి పోటీ చేసిన ఆయన తరువాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీలోకి వచ్చి, శ్రీకాంత్ రెడ్డి విజయానికి పనిచేశారు. మళ్ళీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన మండిపల్లి టికెట్ కోసం తీవ్ర పోటీ ఉన్నప్పటికీ సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి కూడా అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ సీపీలో సీనియర్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జెఎన్పీ నుంచి 1978 ఆ తరువాత 1983లో స్వతంత్రుడిగా, ఎంపీగా టీడీపీ నుంచి, 1999, 2004లో ఎమెల్యేగా విజయం సాధించిన సుగవాసి పాలకొండ్రాయుడుకు దక్కని అవకాశం రాయచోటి నియోజకవర్గం నుంచి మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి దక్కడం ప్రస్తావనార్హం.
అధినేతల దృష్టిని ఆకర్షించి...
ఆయన దూకుడు స్వభావమే కలిసి వచ్చిన అంశంగా భావిస్తారు. గత అధికార పార్టీ నుంచి రెండున్నరేళ్లకు ముందే టీడీపీలోకి వచ్చిన ఆయన సొంత మండలం చిన్నమండెంలో టీడీపీ కార్యకర్తపై కేసు నమోదు చేసిన విషయంలో పోలీస్ స్టేషన్ ను ముట్టడించడం, గత ఏడాది ఆగష్టులో అంగళ్లు, పుంగనూరు వద్ద టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి, దాడి ఘటనల విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో రాంప్రసాదరెడ్డి చొరవతో అధినేతల దృష్టిలో పడ్డారని ఆయన అనుయాయులు చెప్పే మాట.


ఎందరో సీనియర్లు ఉండగా..
ఉమ్మడి కడప జిల్లా లేదా విభజిత అన్నమయ్య జిల్లాల్లో సీనియర్లను కాదని మొదటిసారి గెలిచిన మండిపల్లి రాంప్రసాద రెడ్డికి మంత్రి ఇవ్వడం వెనుక బలమైన కారణం ఉందని భావిస్తున్నారు. టీడీపీ శ్రేణులపై దాడుల నేపథ్యంలో దూకుడుగా వ్యవహరించిన ఆయన సీఎం ఎన్. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ దృష్టిలో పడ్డారని భావిస్తున్నారు. అందుకే, ఉమ్మడి జిల్లాలోని సీనియర్లలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎన్. వరదరాజులరెడ్డి మినహా మైదుకూరులో పుట్టా సుధాకరయాదవ్, కడపలో మాధవీరెడ్డి , కమలాపురంలో పుత్తా చైతన్య రెడ్డి, రైల్వే కోడూరులో జనసేన నుంచి అరవ శ్రీధర్ మొదటిసారి గెలిచిన వారే.
విభజిత అన్నమయ్య జిల్లా పరిధిలోని పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మొదటిసారి విజయం సాధించారు. మదనపల్లె ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా రెండోసారి విజయం సాధించారు. రెండుసార్లు ఆయన ఓటమి చెందారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాను పరిగణలోకి తీసుకుంటే సీనియర్, మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డికి అవకాశం ఇవ్వాలి. ఇలా చేస్తే పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫీల్ అవుతారు. అందుకే మధ్యే మార్గంగా మండపల్లికి అవకాశం కల్పించారనే చర్చ జరుగుతోంది. అంతకంటే ప్రధానంగా...
ఇద్దరికి చెక్ పెట్టాలనే...
ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడపలో కూడా చక్రం తిప్పిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడకోట శ్రీకాంత్ రెడ్డికి చెక్ పెట్టాలని మండిపల్లి రాంప్రసాద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి.. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు, పుంగనూరు వద్ద గత ఏడాది ఆగష్టు నెలలో టీడీపీ చీఫ్ హోదాలో పర్యటనకు వచ్చిన ఎన్. చంద్రబాబు నాయుడు ర్యాలీపై రాళ్లు రువ్వడం, విధ్వంసకాండ తెలిసిన విషయమే. ఈ ఘటనల నేపథ్యంలో అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీతో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దూకుడుగా వ్యవహరించిన సందర్భాలను పరిగణలోకి తీసుకున్న సీఎం ఎన్. చంద్రబాబు ముందస్తు ఆలోచనతోనే మంత్రి పదవికి ఎంపిక చేయడానికి పరిణామాలు దారితీశాయని భావిస్తున్నారు.
Read More
Next Story