చక్కెర ధరకు ఎందుకు రెక్కలు వచ్చాయి..?
70 శాతం తగ్గిన చెరుకు సాగు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల మళ్లడంపై వీడియో కథనం...
పండుగల వేళ ఇళ్లలో తీపి పిండివంటలు తయారు చేసుకుందామంటే చక్కెర, బెల్లం ధరలు సామాన్యుడికి గుండెతరుక్కుపోయేలా చేస్తున్నాయి. నెలకు క్రితం వరకు కిలో ₹42 నుండి ₹44 మధ్య ఉన్న చక్కెర ధర, ప్రస్తుతం ఏకంగా ₹60 నుండి ₹65 దాటేసింది. అంటే దాదాపు 50 శాతానికి పైగా పెరుగుదల! బెల్లం ధర కూడా కిలోకు ₹75కు చేరింది.
ఒకవైపు ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు దేశంలో చక్కెర కొరతే లేదని చెబుతుంటే... మార్కెట్లో మాత్రం ధరలు ఎందుకు ఆకాశాన్నంటుతున్నాయి? ఏపీలో చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి? రైతులకు రావాల్సిన బకాయిలు ఎంత? అనే పూర్తి వివరాలు ఈ రోజు కథనంలో వివరంగా తెలుసుకుందాం!"
చక్కెర ధర పెరుగుదలకు కారణాలేంటి?
మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, ఉత్తర ప్రదేశ్లో చెరకు పంటకు 'రెడ్ రాట్' శిలీంధ్ర వ్యాధి సోకడం వల్ల చెరకు దిగుబడి తగ్గింది.
దీనికి తోడు ఉత్పత్తి అయిన చెరకును ఇంధన రంగం (ఇథనాల్) వైపు మళ్లించడం కూడా చక్కెర లభ్యతపై ప్రభావం చూపింది. దీనివల్ల పండుగల సీజన్ కావడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు నిల్వలు పెంచడం కూడా ధరల మంటకు కారణమైంది.
ఇది తాత్కాలిక సవాలు మాత్రమే. కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభం కావడం, దిగుమతుల నియంత్రణలో సడలింపు వల్ల రాబోయే రోజుల్లో ధరలు కొంత తగ్గే అవకాశముంది.
ఏపీలో ఒకప్పుడు సహకార (Cooperative), ప్రైవేట్ రంగాలు కలిపి సుమారు 29 కంటే ఎక్కువ చక్కెర కర్మాగారాలు ఉండేవి. ఇందులో 10కి పైగా సహకార రంగంలోనివే.
అందులో ఉమ్మడి విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ కర్మాగారాలు విస్తరించి ఉండేవి.
ఓ ఉదాహరణ చూద్దాం..
చిత్తూరు జిల్లాలో ఉమ్మడిగా మూడు ప్రధాన సహకార చక్కెర కర్మాగారాలు చిత్తూరు, నగరికి సమీపంలోని నిండ్ర, పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేవి. కానీ సరైన నిర్వహణ లేక, నష్టాలు రావడం వల్ల ప్రస్తుతం చిత్తూరులో సహకార చక్కెర కర్మాగారాల పనితీరు దాదాపు స్తంభించిపోయింది. రాష్ట్రంలో మెజారిటీ సహకార ఫ్యాక్టరీలు మూతపడటంతో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ప్రైవేట్ రంగానికి చెందిన కొన్ని మిల్లులు మాత్రమే పరిమితంగా పనిచేస్తున్నాయి.
ఈ పరిశ్రమలన్నీ పూర్తిస్థాయిలో నడిచే సమయంలో రాష్ట్రంలో దాదాపు 5.5 నుంచి 6 లక్షల ఎకరాలు అంటే సుమారు 2.2 నుంచి 2.4 లక్షల హెక్టార్లు) విస్తీర్ణంలో చెరుకు సాగు జరిగేది.
కర్మాగారాల మూత, చెరుకు బకాయిలు నిలిచిపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల ఏపీలో చెరుకు సాగు విస్తీర్ణం 70% పైగా పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 38 వేల నుంచి 50 వేల విస్తీర్ణంలో మాత్రమే చెరుకు సాగు జరుగుతోంది. రైతులు చెరుకు పంటను వదిలేసి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, సరుగుడు, కొబ్బరి ఇతర లాభదాయక పంటల వైపు మళ్లుతున్నారు. రాష్ట్రంలో వినియోగానికి సరిపడ ఉత్పత్తి లేక మహారాష్ట్ర, కర్ణాటక , ఉత్తరప్రదేశ్ నుంచి చక్కెర రవాణా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Next Story

