x

రాయచోటి మున్సిపాలిటీ ఏకగ్రీవంపై మంత్రి మండిపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

తొలి బోణీ కొట్టిన టీడీపీ? ఇది మరో చీకటి రోజుగా అభివర్ణించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్. ఇంతకీ మంత్రి మండిపల్లి ఏమన్నారు? వీడియో కథనం.


కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకే జమ కాబోతోంది. మున్సిపల్ యంత్రాంగం ఈ విషయం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇది ప్రజలు ఇచ్చిన విజయం అని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివర్ణించారు. వాస్తవానికి ఇది రాయచోటిలో నమోదైన మరో చీకటి రోజుగా వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తిప్పికొట్టారు.

రాయచోటి మున్సిపాలిటీలో 44 వార్డులకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఆ పత్రాల పరిశీలన సోమవారం మధ్యాహ్నానికి పూర్తయింది. ఇందులో వైసీపీ నుంచి నామినేషన్లు దాఖలు చేయలేని స్థితిలో రాయచోటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థితో పాటు, 44 మంది కౌన్సిలర్లను ఏకగ్రీవంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ విషయం స్పష్టం కావడంతో రాయచోటి టీడీపీలో ఉత్సాహం సంతరించుకుంది.
రాయోచోటిలో నామినేషన్ల పరిశీలన తరువాత అందిన సమాచారంతో మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి టీడీపీ కార్యాలయలో సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థితో పాటు కౌన్సిలర్లుగా బాధ్యతలు చేపట్టనున్న వారికి స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆసక్తికరమైన విషయాలు కూడా ఆయన వెల్లడించారు.
ఏమిటా విశేషాలు ఇక్కడ వినండి

"వైసీపీ పాలన టీడీపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?" అని మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తమ పాలనకు ప్రజలు అందించిన విజయమే రాయచోటి మున్సిపాలిటీ విజయాల పరంపరకు కొనసాగింపని ఆయన అభివర్ణించారు.
రాయచోటి జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు కూడా వేయించనివ్వకుండా అడ్డుపడ్డారని ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు.
వైసీపీ అధికారంలో ఉండగా వెనుకబడిన ప్రాంతం రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశామని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు.
"టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు తరలించి, చీకటి కోణానికి తెరతీసింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా, ఏకగ్రీవం చేసుకుని మరో చీకటి అధ్యాయాన్ని సృష్టించారు" అని గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయచోటి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం అనేది లాంఛనంగానే కనిపిస్తోంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రకటించడమే తరువాయి.
Read More
Next Story