అంతరిక్ష పరిశోధన రంగానికి 'స్టార్టప్' క్రాంతి..!
ISRO అస్థిత్వానికి పొంచి ఉన్న ముప్పు ఎలా ఉంది? అగ్నిబాణ్ రీయూజబుల్ సాంకేతికతపై ఆసక్తికర చర్చపై వీడియో కథనం
భారత అంతరిక్ష పరిశోధనలో సరికొత్త విప్లవానికి అడుగులు పడ్డాయి. స్టార్టప్ కంపెనీల వల్ల ఇస్రో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనివల్ల ఇస్రో అస్థిత్వానికి ముప్పు ఏర్పడుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థ 'ఇస్రో' (ISRO)లో ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు బయటికి వెళ్లడంమే దీనికి కారణంగా చర్చ జరుగుతోంది.
తమిళనాడులోని అగ్నిబాణ్ స్టార్టప్ సంస్థ కొత్త అడుగులు వేస్తోంది. స్పైస్ఎక్స్ (SpaceX) తరహాలో రాకెట్ ప్రయోగానికి వినియెగించిన విడిభాగాలు సేకరించి, మళ్లీ వాటిని అధునాతనంగా మార్చడం వల్ల తిరిగి ప్రయోగించే దిశగా పరిశోధనలు చేస్తున్నాట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ తరహా పద్ధతి వల్ల రాకెట్ ప్రయోగంలో దాదాపు 80 శాతం వ్యయం తగ్గుతుందనేది ఓ అంచనా! ఆ దిశగా ఇస్రో ఎందుకు సమాలోచనలు సాగించడం లేదనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది.
శాస్త్రవేత్తలు ఇస్రోను ఎందుకు వీడుతున్నారు?
రెండు నెలల కిందటే సుమారు వంద మందికి పైగానే యువశాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన వారిలో కొందరు వీఆర్ఎస్ తీసుకుంటే, చాలా మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ పరిణామాలు ఇస్రో ప్రయివేటు చేతుల్లోకి వెళుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. గగన్‌యాన్ (Gaganyaan), భారతీ అంతరిక్ష స్టేషన్ (BAS) వంటి కీలక ప్రాజెక్టులలో పనిచేస్తున్న నిపుణులు బయటకు రావడంపై దేశంలో కొత్త చర్చ ప్రారంభమైంది. ఈ అంశంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ స్పందించారు.
"దేశ అంతరిక్ష అవసరాలను ఇస్రో ఒక్కటే పూరించలేదు" అ నారాయణన్ స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి తలుపులు తీయడం వల్ల ఇస్రో బలహీనపడదు. దేశీయ అంతరిక్ష వ్యవస్థ మరింత బలోపేతమవుతుందనేది ఆయన చెప్పిన మాట. ప్రైవేట్ కంపెనీలు వాణిజ్య ప్రయోగాలు చూసుకుంటే, ఇస్రో తన దృష్టిని అధునాతన పరిశోధనలు (Deep Space Exploration) పై నిలుపుతుందని తెలిపారు.
ఇస్రోలో 10 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్న యంగ్ సైంటిస్టులు బయటకు రావడానికి ప్రధాన కారణం ప్రైవేట్ స్పేస్ రంగానికి పెరుగుతున్న క్రేజ్ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఇస్రో తో పోలిస్తే ప్రయివేటు రంగంలో వేతన వ్యత్యాసం వల్ల శాస్ర్తవేత్తలుకు ఆఫర్లు పెరిగాయి.
స్టార్టప్ కంపెనీలతో సవాళ్లు..?
హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ (Skyroot Aerospace), చెన్నైలోని అగ్నికుళ్ (Agnikul Cosmos), పిక్సెల్ (Pixxel) వంటి స్టార్టప్‌లు పెట్టుబడులు సమీకరించి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్రోలో శాస్త్రవేత్తల జీతాలు పరిమితంగా ఉంటాయి.అదే ప్రైవేట్ స్టార్టప్‌లు ఇస్రో ఇచ్చే వేతనాల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ జీతాలు, కంపెనీ షేర్లు (ESOPs), మెరుగైన ఆఫర్లు , వేగవంతమైన నిర్ణయాధికారాన్ని అందిస్తున్నాయి.
2024 మే నెలలో అగ్నికుళ్ జరిపిన 'అగ్నిబాణ్ SOrTeD' ప్రయోగం ఒక సబ్‌ఆర్బిటాల్ (లేదా టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్) మిషన్. ఈ తొలి ప్రయోగంలో పడిపోయిన రాకెట్ విడిభాగాలను రికవరీ చేసి (సముద్రం లేదా నేల నుంచి వెలికితీసి) మళ్లీ ఉపయోగించలేదు.
అగ్నికుళ్ తమ రాకెట్ ఇంజన్‌ను ప్రపంచంలోనే తొలిసారిగా సింగిల్-పీస్ 3D ప్రింటింగ్ సాంకేతికతతో కేవలం 7 రోజుల్లోనే పూర్తిస్థాయిలో తయారు చేయగలదు. అందువల్ల సరికొత్త ఇంజన్‌ను అతి తక్కువ వ్యయంతో, వేగంగా తయారు చేయడం వారికి సులువవుతోంది.
అగ్నికుళ్ ఉపయోగిస్తున్న సెమీ-క్రయోజెనిక్ (LOX + ATF) లిక్విడ్ ఇంజన్లు మళ్లీ మళ్లీ రీస్టార్ట్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల రాకెట్ నింగిలోకి వెళ్లడమే కాకుండా తిరిగి కిందకు దిగేటప్పుడు (Ascent & Descent) ఉపయోగపడుతుంది.రాబోయే మిషన్లు (Mission-02): రాబోయే మిషన్లలో రాకెట్ బూస్టర్ రికవరీ, భాగాలు మళ్లీ వాడేలా (Reusability) సాంకేతికతను పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.
షార్ లో ప్రయివేటు ప్రయోగాలు.. ఎవరికి లాభం?
అంతరిక్ష పరిశోధనలో కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకుని వచ్చిన ఇండియన్ స్పేస్ పాలసీ ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం అందిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాల్లో IN-SPACe ఏర్పాటు: ప్రైవేట్ సంస్థలకు అనుమతులు, పర్యవేక్షణ, మద్దతు ఇచ్చేందుకు ప్రత్యేక అథారిటీ. రూ. 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్: స్పేస్ స్టార్టప్‌ల కోసం కేంద్రం ప్రత్యేక నిధులను కేటాయించింది.
వనరుల షేరింగ్: శ్రీహరికోటలోని లాంచ్ ప్యాడ్లు, ప్రయోగ కేంద్రాలు, ల్యాబ్‌లను తక్కువ రుసుంతో ప్రైవేట్ సంస్థలు వాడుకునే వెసులుబాటు కల్పించింది.
దీనికోసం FDI సడలింపులు ఇచ్చింది. ప్రైవేట్ రంగానికి విదేశీ పెట్టుబడులు సులభంగా వచ్చేలా నిబంధనలు మార్చింది.
దీనిపై కేంద్ర స్పేస్, సైన్స్ శాఖ మంత్రి డాక్టర జితేంద్రసింగ్ ఏమంటారంటే..
"దేశంలో మరో 450 స్టార్టప్ కంపెనీలు ప్రారంభం అవుతాయి. ఇస్రో నుంచి శాస్త్రవేత్తలు వెళ్లడం సాధారణ పరిపాలనా ప్రక్రియ" అని తేలిగ్గా తీసివేశారు. దీనివల్ల ఇస్రో సాంకేతిక సామర్థ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పారు. నాలుగేళ్ల క్రితం కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలో ఉన్న స్పేస్ స్టార్టప్‌లు నేడు 200 నుంచి 440 వరకు పెరిగాయని ఆక్షన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇస్రోను వదిలి వెళ్లిన నిపుణులు కూడా భారత అంతరిక్ష రంగాన్నే బలోపేతం చేస్తున్నారని, ఇది దేశీయ స్పేస్ వ్యవస్థ ఎదగడానికి శుభపరిణామమని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ప్రయోగించిన రాకెట్ విడిభాగాలను అగ్నిబాణ్ మళ్లీ వాడలేదు, భవిష్యత్తులో స్పైస్ఎక్స్ (SpaceX) తరహాలో రాకెట్ భాగాలను రికవరీ చేసి మళ్లీ వాడుకునేలా సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. దీనివల్ల 80 శాతం ఖర్చు కలిసివస్తుందనే అంచనా వేస్తోంది. ఇస్రో ఆ దిశగా అడుగులు ఎప్పుడు అడుగులు వేస్తుందనే విషయానికి నిరీక్షణ తప్పదు.
Next Story

