
టీటీడీ చైర్మన్ ను తప్పించండి.. దేవతలకు వైసీపీ మొర
వైసీపీ టార్గెట్ టీటీడీ చైర్మన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు..?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నుంచి రాజకీయ తుఫాను చెలరేగింది. టీడీపీ కూటమిని ఇరకాటంలో పెట్టడానికి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడును టార్గెట్ చేసింది.
"శ్రీవారి సేవకుడిగా నాయుడు ఉండాల్సిన వ్యక్తి, అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఆయన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే, ప్రభుత్వమే తప్పించాలి" అని శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆలయాల్లో పూజలతో వైసీపీ (YCP) వినూత్న కార్యక్రమాలు సాగించింది.
"దేవతలారా మీరైనా ప్రభుత్వం మనుసు మారేలా చేయండి" అని వైసీపీ నాయకులు, శ్రీవారికి చెల్లెలు అయిన తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి సారధ్యంలో పూజలు చేశారు. రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఎత్తుగడ అమలు చేశారు.
రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు పదవికి రాజీనామా చేసినా, ప్రభుత్వం ఆయనను తప్పించినా, టీడీపీ కూటమికి డ్యామేజ్ అవుతుంది. ఇది కాస్తా వైసీపీకి నైతిక విజయంగా మారుతుంది. దీంతో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రదర్శించే చతురత ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
చైర్మన్ వల్ల టీటీడీకి అప్రతిష్ట
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఓ మహిళతో సఖ్యతగా ఉన్న వీడియోలు గత నెలలో వైసీపీ తెరమీదకు తెచ్చింది. ఆ మహిళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి రాసిన లేఖను కూడా తిరుపతిలో వైసీపీ ముఖ్య అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాకు విడుదల చేశారు. ఈ వ్యవహారంతో చైర్మన్ వల్ల టీటీడీకి అప్రతిష్ట కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
"మా కుటుంబానికి, ఆమె కుటుంబానికి సమస్య లేదు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంది" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు కౌంటర్ ఇచ్చారు. మా వల్ల పౌరసజామానికి, లేదంటే ఏ సంస్థకు అయినా, కష్టం కలిగిందా? ఇది మా వ్యక్తి జీవితం అని కూడా నాయుడు ప్రస్తావించారు.
రగిలిన వివాదం..
దీంతో తిరుపతి నుంచి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి, చైర్మన్ బీఆర్. నాయుడు మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో నాయుడును పదవి నుంచి తప్పించండి. లేదంటే ఆయనే రాజీనామా చేయాలంటూ వైసీపీ నిరసనలకు పిలుపు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
తిరుపతి జిల్లాలో నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదంటూ పోలీస్ యాక్టు 30 అమలులోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో తిరుపతిలో ఆలయాల్లో మాత్రమే నిర్వహించాలని వైసీపీ నిర్ణయించిన కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతిలో మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి సారధ్యంలో వైసీపీ శ్రేణలు తాతమ్మగుంట గంగమ్మ ఆలయం వద్దకు చేరుకున్నాయి. వారి దగ్గరకు వెళ్లనివ్వకుండా పోలీసులు మీడియాను దూరంగా పంపడానికి విఫలయత్నం చేశారు. చివరికి గంగమ్మ ఆలయంలో అర్చనలు చేయించారు.
"టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడును ఆ పదవి నుంచి తప్పించు తల్లీ" అని భూమన అభినయరెడ్డి పూజలు చేశారు. తిరుమల పవిత్రను కాపాడాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి రాయచోటిలో వ్యాఖ్యానించారు.
తిరుమలేశుని పవిత్ర సన్నిధిలో రాసలీలతో అపవిత్రం చేసిన బిఆర్ నాయుడు ను వెంటనే చైర్మన్ పదవి నుంచి తప్పించాలని రామాపురం మండలం యర్రంగివాండ్లపల్లెలో శ్రీప్రసన్న లక్ష్మీవెంటకేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ కుమార్ రెడ్డి తో కలిసి ఆయన పూజలు చేశారు.
రాయదుర్గంలో...
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
"తిరుమల పవిత్రతను కాపాడేందుకు బిఆర్.నాయుడుని టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి" అని డిమాండ్ రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి పూజలతో పాటు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఆలయాల్లో పూజలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నం చేశారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాప్తాడు మండలం చిన్మయనగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
బాబు చతురతే.. సమాధానం..
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు పదవీకాలం మరో ఆరు నెలల్లో ముగుస్తుంది. అంతవరకు ఆయనను కొనసాగించడానికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సముఖంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఒత్తిడికి లొంగితే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. టీటీడీ చైర్మన్ పదవి నుంచి నాయుడును తొలగించినా వైసీపీకి అస్త్రంగా మారడమే కాకుండా, నైతికబలం పెరగడానికి కూడా ఆస్కారం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి రాజనీతి ప్రదర్శిస్తారనేది రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది.
Next Story

