
సచివాలయం వద్ద నిరీక్షిస్తున్న కోరంగి గ్రామానికి చెందిన తల్లీకూతురు
కల్యాణ్ సార్ ఆదుకోండి.. ఊరు వదలకుంటే చంపేస్తారంట..
ఏడు రోజులుగా సచివాలయం వద్ద కోరంగి గ్రామ మహిళల నిరీక్షణ
ఊర్లో ఉండొద్దు. గ్రామం విడిచి వెళ్లాలని వేధిస్తున్నారు. ఈ బాధలు భరించలేకున్నాం. మా ఊరిలో మేము ప్రశాంతంగా జీవించేందుకు రక్షణ కల్పించాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ తల్లీ,కూతురు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అర్ధిస్తున్నారు.
"మీరు జోక్యం చేసుకుంటూనే మాకు న్యాయం జరుగుతుంది" అని తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన తల్లి కూతురు అభ్యర్థిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తమ బాధ చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన వాసంశెట్టి వెంకటలక్ష్మి తన కూతురుతో కలిసి సచివాలయం వద్ద వారం రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు.
శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సచివాలయానికి వెలుపల వాహనాలను నిలిపే ప్రదేశంలో తల్లి కూతుర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు.
సచివాలయం లోకి వీఐపీల వాహనాలు వెళ్లే సమయం, వెలుపలికి వచ్చే సమయంలో సందర్శకులు ఎవరిని ప్రధాన ద్వారం తో పాటు ఆ మార్గంలో దరిదాపులకు కూడా సామాన్యులను పోలీసులు రానివ్వరు. దీంతో కోరంగి గ్రామానికి చెందిన వాసంశెట్టి వెంకటలక్ష్మి తన కూతురుతో కలిసి సందర్శకులకు పాసులు జారీ చేసే ప్రాంతంలోనే నిరీక్షిస్తూ రోజు కనిపిస్తున్నారు.
బాధితుల వేదన ఇదీ..
మీడియా ప్రతినిధులు కొందరు వారిని పలకరించినప్పుడు వెంకటలక్ష్మి తమ కన్నీటి గాధను వివరించారు.
"మాది కోరంగి గ్రామం. గ్రామంలో ఉన్న కొందరు మాపై దాడి చేస్తున్నారు. గ్రామం వదిలి వెళ్లాలని. లేదంటే చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు" అనే తమ ఆవేదన వ్యక్తం చేశారు.
మా కష్టంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్పందన లేదు అని వెంకటలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీతోపాటు డీజీపీని కూడా కలిసి తమ సమస్య విన్నవించామని ఆమె వివరించారు. ఆ తర్వాత కూడా మాకు న్యాయం జరగని పరిస్థితులు భయంగా జీవిస్తున్నామని, ఈ పరిస్థితుల్లో మా పిల్లలు ఎలా కాపాడుకోవాలని కూడా వెంకటలక్ష్మి ఆమె కూతురు ఆందోళన వ్యక్తం చేశారు.
"మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కూడా కలిసాం. అది మన నియోజకవర్గ కాదని చెప్పారు" అని వెంకట్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మరో మార్గం కనిపించని స్థితిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మా బాధ చెప్పుకుంటే పరిష్కారం అవుతుందనే ఆశతో వారం నుంచి సచివాలయం వెలుపల నిరీక్షిస్తున్నామని వారు చెప్పారు.
Next Story

