
మదనపల్లె ఫైల్ దగ్ధం కేసు: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్
ఇద్దరు ప్రధాన అనుచరుల అరెస్టు.
మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో రెవిన్యూ రికార్డులు దగ్ధమైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి ప్రధానంగా పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సిఐడి పోలీసులు షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎ తుకారం, మదనపల్లి పట్టణంలో ప్రధాన అనుచరుడు వి. మాధవరెడ్డిని బుధవారం మధ్యాహ్నం చంద్రగిరి వద్ద సిఐడి విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రగిరి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద టీ తాగడానికి వచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి పీఏగా పనిచేసిన తుకారంతోపాటు మాధవరెడ్డిని సిఐడి డి.ఎస్.పి వేణుగోపాల్ సారధ్యంలోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఫైలు దగ్ధం కావడం వెనక తమకు ఎలాంటి సంబంధం లేదు. మమ్మల్ని అనవసరంగా నిందితులుగా చేర్చారు" అని పెద్దిరెడ్డి కి పీఏగా పనిచేసిన తుకారం, మాధవరెడ్డి వ్యాఖ్యానించారు. తమను అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పుకొచ్చిన వారిద్దరూ
"టిడిపి కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు మూల్యం తెలుసుకునే రోజు వస్తుంది"అని కూడా హెచ్చరించారు.
ఘటన నేపథ్యం ఇది.
మదనపల్లి అన్నమయ్య జిల్లాగా ఏర్పడక ముందు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆర్ కార్యాలయం లో రెవెన్యూ రికార్డులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన 2024 జూలై 21వ తేదీ జరిగింది. ఆదివారం వేకువజాము న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని స్ట్రాంగ్లంలో ఉన్న ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన లో కీలకమైన రెవెన్యూ ఫైళ్లలో ప్రధానంగా అసైన్డ్ భూములు, 22 ఏ జాబితాలోని భూములు, భూముల మ్యుటేషన్ సంబంధించిన రికార్డులు కాలిపోయాయి. ఈ కేసులో మదనపల్లి ఆర్డీవో గా ఉన్న హరిప్రసాద్ తోపాటు, పూర్వ ఆర్డిఓ మురళి, వన్ టౌన్ సీఐ వలి, కార్యాలయ సూపర్డెంట్ తేజను మొదట సస్పెండ్ చేశారు
ప్రభుత్వం సీరియస్
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ రికార్డులు దగ్ధం అయిన సంఘటనపై టిడిపి కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘటన జరిగిన మలసటిరోజే ప్రత్యేక దర్యాప్తు బృందం (special investigate you team Sit) ఏర్పాటు చేయడంతో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్ పి సిసోడియ, అప్పటి డిజిపి ద్వారకా తిరుమలరావును మదనపల్లెకు పంపించారు.
దర్యాప్తులో.
మదనపల్లి రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఫైలు దగ్ధమైన కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అధికారులు డివిజన్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులను పిలిచి విచారించారు. "గత ప్రభుత్వ హయాంలో మదనపల్లి పరిసరాల్లో వేల ఎకరాల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. విక్రయాల సాగించడం. ఆ ఆధారాలు చెరిపివేయడానికే ఫైళ్ళ దహనానికి పాల్పడ్డారు" అని సిబిఐ అ సారధ్యంలోని సీట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
రెవెన్యూ రికార్డులు దగ్ధమైన కేసులో మదనపల్లి ఆర్డీవో హరిప్రసాద్ తో పాటు అంతకుముందు అదే స్థానంలో ఉంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న పూర్వ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ మురళిని కూడా సస్పెండ్ చేశారు" ఘటన జరిగిన రోజు వేకువజామున సమాచారం తెలియగానే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని మదనపల్లి వన్టౌన్ సీఐ వలిని కూడా సస్పెండ్ చేశారు.
మాధవరెడ్డి కీలకం..
ఈ వ్యవహారంలో పుంగనూరు ఎమ్మెల్యే, వైసిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఆయనకు విధేయులుగా పనిచేసిన నాయకులు, రెవిన్యూ సిబ్బంది, అధికారులు పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, ఇంకొందరు కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు కొందరిని విధుల నుంచి తొలగించారు. రెవెన్యూ రికార్డులు దగ్ధం కావడం వెనక వెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధానుచరుడైన మదనపల్లికి చెందిన మాధవరెడ్డిని కీలక నిందితుడిగా సిఐడి అధికారులు గుర్తించారు. మొదట్లో ఆయన పోలీసుల మంచి తప్పించుకుని తిరిగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి విధేయులుగా ఉన్న అనేక మందిలో మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా తో పాటు నాయకులను కూడా విచారణ చేయడంతో పాటు వారి నివాసాల్లో కూడా తనిఖీలు చేశారు.
మదనపల్లె రెవిన్యూ రికార్డుల దగ్ధం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుగా ఉన్న తుకారం, మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్టు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. వీరిని దర్యాప్తు చేస్తే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనది కూడా ఆసక్తికరంగా మారింది.

