శేషాచలం అడవులు పర్యావరణానికి నెలవు. ఇదే ప్రాంతంలో పర్యాటక, ఆధ్యాత్మికతను పంచే తీర్థాలకు కొదవ లేదు ఈ నెల 31వ తేదీ, ఏప్రిల్ ఒకటో తేదీల్లో తిరుమల తుంబురుతీర్థ ముక్కోటి నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల నుంచి పాపవినాశనం మీదుగా తుంబురతీర్థం 12 కిలోమీటర్ల దూరం వరకు దట్టమైన అడవిలోని సాహసయాత్రలా సాగుతుంది.
శేషాచలం పర్వతసానువులు జంతుకోటికి ఆలవాలం. జలపాతాలకు సోయగాలతో మరింత అందం తెస్తుంటుంది. తిరుమల గిరుల్లో ఏకంగా 3.50 కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నట్లు బ్రహ్మ, స్కంధపురాణాలు పేర్కొంటున్నాయి. ఈ తీర్థాల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం. తిరుమల గిరుల్లోని పుణ్య తీర్థాల్లో సంవత్సరానికి ఒకసారి కొన్ని పుణ్యఘడియలు ప్రవేశిస్తాయి. ఈ సందర్భంగా ఆయా తీర్థాల్లో ముక్కోటి ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.
తిరుమల పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి యాత్రికులకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఇవీ..
1) యాత్రికుల భద్రత కోసం తుంబురుతీర్థానికి మార్చి 31న, ఏప్రిల్ ఒకటో తేదీల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.
2) పాపవినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీటిని 100 మంది శ్రీవారి సేవకులు ద్వారా పంపిణీ చేస్తారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.
3) తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో వృద్దులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకు, దీర్ఘవ్యాధిగ్రస్తులకు, గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.
4) భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సూచించారు.
5) పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
6) తీర్థానికి వెళ్లే మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు.
కనువిందు చేసే దృశ్యాలు..
తుంబుర తీర్ధంలో ముక్కోటి పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి కలుగుతుందని పురాణ వైశిష్ట్యం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. తుంబుర తీర్థానికి మరొక పేరు కూడా ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తుంది.
నేపథ్యం ఇదీ..
నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో అలిగిన తుంబురుడు వెనక్కి తగ్గి ఈ తీర్థంలోనే కూర్చుండి పోతారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్వయంగా వేంకటేశ్వర స్వామి వెళ్లి తుంబురుడిని బుజ్జగించారని, అందుకే ఆ ప్రాంతానికి తుంబుర తీర్థంగా పేరు గాంచిందని స్థల పురాణం. శ్రీవారి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలోనే స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి. తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినాన తిరుమల నుంచి ఉత్సవమూర్తులను మేళతాళాలతో మాడవీధులలో ఊరేగించి అనంతరం ఊరేగింపుగా తుంబుర తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడ వైఖానస ఆగమ పద్ధతిలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణి చేస్తారు.