శేషాచలం కొండల్లో తుంబురుడి దర్శనానికి  సాగిన సాహసయాత్ర..
x
శేషాచలం కొండల్లో తుంబురిడిని ప్రార్థిస్తున్న యాత్రికురాలు

శేషాచలం కొండల్లో తుంబురుడి దర్శనానికి సాగిన సాహసయాత్ర..

వేడుకగా తుంబురతీర్థ ముక్కోటి. చిత్రాలు చెప్పే విశేషాలు ఇవీ..


తిరుమల శేషాచలం కొండల్లో తుంబురతీర్థం వద్దకు యాత్రికులు దడి కట్టారు. తుంబురతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని టీటీడీ బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది. తిరుమల గిరుల్లోని పుణ్య తీర్థాల్లో సంవత్సరానికి ఒకసారి కొన్ని పుణ్యఘడియలు ప్రవేశిస్తాయి. ఈ సందర్భంగా ఆయా తీర్థాల్లో ముక్కోటి ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.

శ్రీవారి ఆలయ అర్చకులు తుంబురతీర్థంలో కొలువైన తుంబురుడి చెంతకు కొండలు, కోనలు, నీటి సెలయేర్లను దాటుకుంటూ సాహసోపోతంగా యాత్ర సాగింది.


శేషాచలం కొండల్లో ఉన్న తీర్థాల్లో తుంబురతీర్థం కూడా ఒకటి. ఏడాదికి ఒకసారి ఈ అడవిలోని దేవతామూర్తులకు పూజలు అందించడం ఆనవాయితీ. తిరుమల శ్రీవారి ఆలయానికి 12 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి వాహనాల్లో యాత్రికులు పాపవినాశనం వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి తుంబురతీర్థానికి అడవి మార్గంలో కాలిబాటన యాత్రికులు చేరుకున్నారు. ఈ కార్యక్రమం కోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

శేషాచలం కొండకోనల్లో..


శేషాచలం అడవుల్లోని తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినానాన్ని టీటీడీ ప్రత్యేక ఉత్సవంగా నిర్వహిస్తుంది. తిరుమల నుంచి ఉత్సవమూర్తులను మేళతాళాలతో మాడ వీధులలో ఊరేగించారు. అనంతరం ఊరేగింపుగా తుంబుర తీర్థానికి తీసుకుని వెళ్లారు. అక్కడ వైఖానస ఆగమ పద్ధతిలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.

తిరుమల నుంచి అంతకుముందే ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల లోపు యాత్రికులు వాహనాల్లో పాపవినాశనం వరకు చేరుకున్నారు. అక్కడ యాత్రికులకు మజ్జిగ, అన్నప్రసాదాలు, మంచి నీటి సదుపాయం, ఆరోగ్య శాఖ సిబ్బందిని ఏర్పాటు చేశారు. శ్రీవారి సేవకుల ద్వారా యాత్రికులకు అన్నప్రసాదాల పాకెట్లు పంపిణీ చేశారు. మార్గమధ్యలోని అటవీమార్గంలో టీటీడీ ఫారెస్టు, పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రదేశాల్లోనే యాత్రికులకు అత్యవసరమైతే వైద్య సేవలు అందించడానికి ప్రాథమిక చికిత్స చేయడానికి సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు.

పురాణ కథనం..

తిరుమలకు సమీపంలోని శేషాచల అడవుల్లో ఉన్న తుంబుర తీర్ధంలో ముక్కోటి పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి కలుగుతుందని పురాణ గాధలు చెబుతున్నాయి. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిచే యాత్రికులు భారీగా తరలివచ్చారు. గోన తీర్థంగా పిలిచే తుంబుర తీర్థం వద్ద తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తుంది.

నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో అలిగిన తుంబురుడు వెనక్కి తగ్గి ఈ తీర్థంలోనే కూర్చుండి పోతారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్వయంగా వేంకటేశ్వర స్వామి వెళ్లి తుంబురుడిని బుజ్జగించారని, అందుకే ఆ ప్రాంతానికి తుంబుర తీర్థంగా పేరు స్థిరపడిందనేది స్థల పురాణం. శ్రీవారి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలోనే స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి.
Read More
Next Story