
తిరుమల ఆలయ మర్యాదలతో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులను సాగనంపుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, అధికారులు
సేవలకు సెలవు:5 నెలలకే టీటీడీ ఈఓ సింఘాల్ బదిలీ..
తిరుమల ఆలయ మర్యాదలతో వీడ్కోలు పలికిన అధిాకారులు...
టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఐదు నెలలు కూడా పూర్తి కాకుండానే బదిలీ అయ్యారు. ఆదివారం సాయంత్రం ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ బాధ్యతలు అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరికి సింఘాల్ అప్పగించారు. అంతకుముందు ఆయన సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు వీడ్కోలు పలికారు. తిరుమల, తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, , రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా సమన్వయం సాధించారు.
శ్రీవారి దర్శనం..
టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులను టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, అదనపు ఈఓ ఆలయంలోకి పిలుచుకుని వెళ్లారు. ధ్వజస్తంభం వద్ద మెుక్కిన అనంతరం సింఘాల్ దంపతులకు శ్రీవారి దర్శనం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన జీవో నెం.191 ఉత్తర్వుల మేరకు బదిలీపై వెళ్తున్న అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు అప్పగించారు.అనంతరం
తిరుమల శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శ్రీవారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బదిలీకి కారణం ఇది..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారు. ఈ కొనుగోలులో వైసీపీ ప్రభుత్వంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు, నిబంధనలు మార్పు చేయడంపై ఈఓగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ సకాలంలో స్పందించలేదు అనేది కల్తీ నెయ్యి పరిణామాలపై సీబీఐ సారధ్యంలోని సిట్ అధికారులు తేల్చారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో కూడా చార్జిషీట్ దాఖలు చేశారు. టీటీడీ నిధులు దుర్వినియోగం కావడంలో అప్పటి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కారణం అంటే క్రమశిక్షణా చర్యలకు సీబీఐ అధికారులు సిఫారసు చేశారు. దీంతో రోజుల వ్యవధిలోనే అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
శ్యామలరావు స్థానంలోకి..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ ఈఓగా జే. శ్యామలరావు నియమితులయ్యారు. ఈయన కాలంలో కూడా తిరుమలలో అన్నదానసత్రంలో అన్నప్రసాదాల తయారీలో నాణ్యత పెంపుదలకు శ్రద్ధ తీసుకున్నారు. నెయ్యి కొనుగోలులో కూడా పారదర్శక విధానాలు అమలు చేశారు.
తిరుమలలో గత ఏడాది జనవరిలో వైకుంఠ ద్వార దర్శానాల టోకెన్లు జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. దీంతో స్వయంగా పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుతో శ్యామలరావు వాగ్వాదానికి దిగారనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత కూడా వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోమార్గంలేని స్థితిలో శ్యామలరావును బదిలీ చేశారనే మాటలు బలంగా వినిపించాయి.
2025 సెప్టెంబర్ 10వ తేదీ మళ్లీ టీటీడీ ఈఓగా సింఘాల్ ను టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించింది. ఆయన టీడీపీ, వైసీపీ ప్రభుత్వంలో కూడా టీటీడీ ఈఓగా పనిచేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోలు వ్యవహారంలో జరిగిన తప్పిదాల వల్ల పాలక మండలి తీసుకున్న నిర్ఱయాలకు అడ్డుకట్ట వేయలేకపోవడం మళ్లీ బదిలీకి ఆస్కారం కల్పించినట్లు కనిపిస్తోంది.
టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల, తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో సమర్థవంతంగా వ్యవహరించారు. ఆ అనుభవం నేర్పన పాఠాలతో రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో కూడా టీటీడీ ఉద్యోగులు, సిబ్బందితో పోలీసు యంత్రాంగాన్ని సమన్వయం చేయడంలో సఫలం అయ్యారు.
Next Story

