కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబును టీటీడీ అధికారులు ఆహ్వానించారు. కోదండరాముడి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి గురువారం ముఖ్యమంత్రికి అందించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కూడా టీటీడీ వేదపండితులు కొదండరాముడి కల్యాణానికి ఆహ్వానించారు. ఆయనకు శ్రీవారి వస్త్రంతో సత్కరించి, ప్రసాదాలు కూడా అందించాారు.
ఏప్రిల్ ఒకటో తేదీ ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే శ్రీకోదండరామస్వామివారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరుకానున్నారు.
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 26వ తేదీ అంకురార్పణ జరుగుతుంది. 27వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ శ్రీకోదండరామస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీనికోసం టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర విభజన తరువాత 2015 ఏప్రిల్ 30వ తేదీ ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాద్రిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయం ప్రకటించారు. 2016 నుంచి ఈ ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకున్న టీటీడీ ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయం వద్ద రాష్ట్ర పండుగగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సీతారాములు కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
కల్యాణోత్సవానికి రండి..
టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి తిరుమల, ఒంటిమిట్ట ఆలయాల అధికారును వెంట తీసుకుని గురువారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి శేషవస్త్రం సమర్పించడంతో పాటు వేదాశీర్వచనం అందించారు. ఆ తరువాత శ్రీవారి లడ్డూ ప్రసాదాల తోపాటు పంచాంగం, కంకణాలు కూడా వేదపండితులు అందించారు.
ఒంటిమిట్టలో నిర్వహించే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి పత్రిక అందించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట వద్ద టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలతో పాటు నిరంతరాయంగా అన్నప్రసాదాలు వడ్డించడానికి చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి వివరించినిట్టు సమాచారం. కల్యాణోత్సవం వేళ కూడా యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు, వసతులు కల్పించడానికి కూడా టీటీడీ యంత్రాంగం కడప జిల్లా అధికారులను సమన్వయం చేసుకుని పనులు చేస్తున్నట్లు కూడా వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రి నారా చంద్రాబాబుకు వివరించారు.