నంద్యాలలో విషాదం:  కలుషిత ఆహారంతో 80 మందికి అస్వస్థత
x

నంద్యాలలో విషాదం: కలుషిత ఆహారంతో 80 మందికి అస్వస్థత

శుభ కార్యక్రమంలో మిగిలిన ఆహార పదార్థాలు తెచ్చిన ఇక్కట్లు.


ఓ శుభ కార్యక్రమంలో మిగిలిన ఆహార పదార్ధాలు తినిన నంద్యాలలోని వైఎస్. నగర్ బుడగ జంగాల కాలనీ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి పదుల సంఖ్యలో ఆస్పత్రికి చేరిన బాధితులు, మంగళవారం నాటికి ఆ సంఖ్య 80 మందికి పైగానే చేరింది.

పెళ్లిలో వండిన ఆహారపదార్థాలు భోజనం చేసిన ఓ కాలనీ మొత్తం ఆస్పత్రి పాలైంది. ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 80 మందికి పైగానే తీవ్ర అస్వస్థత గురయ్యారు. నంద్యాల నగరంలోని ప్రభుత్వాస్పత్రి తోపాటు, ప్రయివేటు ఆస్పత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి.

"ఫుడ్ పాయిజన్ జరిగినట్లు సందేహంగా ఉంది. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం" అని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ చెప్పారు.
కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితి‌ మెరుగుపరచడంతోపాటు, మంచినీటిని సరఫరా చేయడానికి మరింత జాగ్రత్తలు తీసుకున్నట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న చెబుతున్నారు.
నంద్యాల పట్టణం 38వ వార్డులోని పులిమద్ది ప్రాంతానికి వెళ్లే రోడ్డులో ఉన్న బేడ బుడగ జంగాల కాలనీలోని పెద్దలు పిల్లలు 80 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారంతా నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, కొన్ని ప్రైవేటు ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకుంటున్నారు.

పెళ్లిలో భోజనాలు మిగిలాయంట. సోమవారం రాత్రి ఆటోలో ఆహార పదార్థాలు తీసుకుని వచ్చారు. పప్పు, చారు, చిత్రాన్నం , తెల్ల అన్నం, పద్యాలు పంపిణీ చేశారని ఓ మహిళ చెప్పారు. గంట తర్వాత నుంచి కొంతమంది కడుపు నొప్పితో బాధపడ్డారు. ఇంట్లో సొంతంగా మందులు తీసుకుంటూ నయమవుతుందని అనుకున్నారు. సోమవారం సగం రాత్రికి చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆ మహిళ వివరించారు.

ఇంతకీ నంద్యాల ఏం జరిగింది..?


నంద్యాల పట్టణంలో సోమవారం ఓ శుభకార్యం జరిగింది. అతిథులందరికీ రుచికరమైన వంటకాలు వడ్డించారు. మిగిలిన ఆహార పదార్థాలను వృధా కానివ్వకూడదని ఆ శుభకార్యం నిర్వాహకులు భావించారు. మిగిలిన ఆహార పదార్థాలను పేదలకు పంచడానికి కోసం సోమవారం రాత్రి పులిమద్ది రోడ్డులో ఉన్న బేడ, బుడగ జంగాల కాలనీలోని పేదలకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఇందులో శుభకార్యం జరిగిన ఇంటిలోని వారి ఆశయం మంచిదే. ఇందులో సందేహం లేదు. వారు అందించిన ఆహార పదార్థాలను ఆనందంగా బేడ, బుడగ జంగాల కాలనీ పేద ప్రజలు స్వీకరించారు.

20 మందికి అస్వస్థత..

నంద్యాల పట్టణంలోని 38వ వార్డులో ఉన్న బేడ, బుడగ జంగాల కాలనీలోని ప్రజలు దాతలు అందించిన ఆహార పదార్థాలు తీసుకున్నారు. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత వారిలో కొంతమంది కడుపునొప్పి తో బాధపడుతూ, వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు వాంతులు విరేచనాలకు గురికావడంతో వెంటనే, సుమారు 20 మంది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చి మంగళవారం నాటికి ఆ సంఖ్య 80 మందికి చేరుకున్నట్లు నంద్యాల నుంచి మీడియా వర్గాలు అందించిన సమాచారం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలుషిత ఆహారం తీసుకున్న బాధితుల సంఖ్య పెరిగింది.

అధికారులు అప్రమత్తం


నంద్యాల పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో ప్రజలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని సమాచారం తెలిసిన వెంటనే నంద్యాల జిల్లా డిఎంహెచ్వో వెంకటరమణ స్పందించారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కూడా సిబ్బందితో రంగం లోకి దిగారు.
"నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బాధితులను డిఎంహెచ్వో పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకున్నాం" అని డిఎంహెచ్వో వెంకటరమణా చెప్పారు.
నంద్యాల పట్టణం 38వ వార్డులో పారిశుద్ధ్య పనులు చేయించడానికి సిబ్బందిని రంగంలోకి దించమని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న చెప్పారు. ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థకు గురైన బాధితులతో ప్రభుత్వాసుపత్రి కిటకటలాడుతోంది. ఇళ్ల వద్ద కాస్త నలతగా ఉన్న వారిని కూడా అధికారులు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.
"ఫుట్ పాయిజన్ జరగడానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ చేస్తున్నాం" అని డి ఎం అండ్ హెచ్ ఓ వెంకటరమణ చెప్పారు.
Read More
Next Story