
శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మాట్లాడుతున్న టీటీడీ ఇన్ చార్జీ ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి
శాస్త్రం, సంప్రదాయలకు సాంకేతిక వ్యవస్థతోనే రక్షణ..
సనాతన ధర్మాన్నినవతరానికి అందించాలన్న టీటీడీ ఇన్ చార్జి ఈఓ వెంకయ్య..
వారసత్వ సంపద కాపాడుకునేందుకు శాస్ర్తం, సంప్రదాయాల రక్షణకు సాంకేతిక జోడించాలని టీటీడీ ఇంచార్జ్ ఈఓ సిహెచ్. వెంకయ్యచౌదరి సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే అందుబాటులోని వసరులు సద్వినియోగం చేసుకుంటే చరిత్ర మూలాలు పదిలంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం నిర్వహించిన అర్చక, పరిచారిక, వేద పారాయణదారుల శిక్షణను ప్రారంభించారు. నవ తరానికి సనాతన ధర్మాన్ని అందించడానికి ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆయన సూచించారు.
టీటీడీలోని వివిధ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న 35 మంది అర్చకులు, పరిచారకులు, 15 మంది వేదపారాయణదారులకు మూడు రోజులపాటు పునఃశ్చరణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
"ఈ శిక్షణ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త అంశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఇవి దోహదం చేస్తాయి" అని వెంకయ్య చౌదరి గుర్తు చేశారు.
"శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీమధ్వాచార్యలు వంటి మహనీయులు కాపాడుతూ వచ్చిన సనాతన సంప్రదాయాన్ని భక్తులకు, సమాజానికి చేరవేయడంలో ఈ శిక్షణా తరగతులు కీలక పాత్ర పోషిస్తాయని" ఆయన వెంకయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.
తిరుమల ఆలయ తరహాలో టిటిడిలోని 61 ఆలయాల్లో కైంకర్యాల నిర్వహణకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని కూడా ఆయన చెప్పారు.
మాడ్యూల్స్ తయారీకి..
టీటీడీలో విధులు నిర్వహించే అర్చకులు, పరిచారకులు, వేదపారాయణదారుల కోసం మాడ్యూల్స్ తయారీకి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి గుర్తు చేశారు. శిక్షణ అనంతరం శిక్షణ తీసుకున్న వారు నేర్చుకున్న విషయాలు, ఇంకా శిక్షణకు అవసరమైన అంశాలపై అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా మాడ్యూల్స్ రూపొందించాలని సూచించారు.
శిక్షణలో కీలకం..
"ఆగమ పరిచయం, ఆగమాలు, వైఖాసనం, నిత్య పూజ విధానం, పంచసూక్తాలు, సంధ్యావందనం, గోత్రప్రవరలు, అగ్ని ప్రతిష్టాపన, నవ్యశేషాంశములు, అష్టోత్తర, ఆశీర్వచన మంత్రాలు, ఉచ్ఛారణ సంస్కృత పరిజ్ఞానం, కల్యాణోత్సవంలో లాజహోమ ప్రధాన హోమాలు, తిరుమల శ్రీవారి ఆలయ ఉత్సవాలు, సంప్రదాయాలు, బ్రహ్మోత్సవం, అర్చకుల లక్షణాలు, విధులు, పవిత్రోత్సవం ప్రాముఖ్యత, గృహ అర్చన, బింబ ప్రతిష్ట, వైశిష్ట్యం, జ్యోతిష్య శాస్త్రం, నిత్యార్చన, శిక్షణ నిర్ధారణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
అర్చకులు, పరిచారకులు, వేద పండితులకు శిక్షణ కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ కావాలని వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి సూచించారు.
"కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభించడమే కాకుండా, భిన్నమైన అభిప్రాయాల పరస్పర మార్పిడి ద్వారా నూతన ఆలోచనలు వెలుగులోకి వస్తాయి" అని వివరించారు.
టిటిడి శ్రీవైఖానస ఆగమ సలహాదారు డాక్టర్ భావనారాయణ చార్యులు, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పోకల భాస్కరుడు, శ్వేత ఇంచార్జ్ డైరెక్టర్ సువర్ణమ్మ, డిప్యూటీ ఈఓ (జనరల్ ) ఏ. శివప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో శ్రీవైఖానస భగవచ్ఛాస్త్రోక్త బ్రహ్మోత్సవానుక్రమణికా పుస్తకాన్ని టిటిడి ఇంఛార్జ్ ఈఓ వెంకయ్య చౌదరి ఆవిష్కరించారు. అనంతరం మానవ నిత్య జీవితంలో వేదాల విశిష్టతను, యోగా ప్రాముఖ్యత తెల్పేలా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించారు.
Next Story

