యూ ట్యూబ్ నేర్పిన పాఠం.. ఇల్లే ఓ మద్యం ఫ్యాక్టరీ..
x
తిరుపతి సమీపంలోని ఓ ఇంట్లో బయటపడిన నకిలీ మద్యం పరిశ్రమ

యూ ట్యూబ్ నేర్పిన పాఠం.. ఇల్లే ఓ మద్యం ఫ్యాక్టరీ..

ఏడాదిలో తిరుపతి వద్ద రెండోసారి వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ.


నకిలీ మద్యం తయారీకి ఓ వ్యక్తి కుటీర పరిశ్రమగా మార్చుకున్నాడు. యూ ట్యూబ్ లో మద్యం తయారీ విధానాన్ని పరిశీలించాడు. ల్యాబ్ టెక్నీషియన్ గా తనకున్న అనుభవాన్ని రంగరించాడు. ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేయడం, ఫుల్ బాటిళ్లలో నింపడం ద్వారా దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు తిరుపతి జిల్లా పోలీసుల కార్డెన్ సెర్చ్ తో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఏకకాలంలో ఆపరేషన్ వజ్రప్రహార్ (Operation Vajra Prahar) పేరిట కార్డెన్ సెర్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. నకిలీమద్యం తయారీని గమనించిన పోలేసులే నివ్వెరపోయారు. ఏడాది వ్యవధిలో తిరుచానూరు సమీపంలో రెండోసారి నకిలీ మద్యం వ్యవహారం వెలుగు చూసింది.
తిరుపతి రూరల్ పరిధిలో డిఎస్పి బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, పదిమంది ఎస్ఐలు, భారీ సంఖ్యలో సిబ్బంది ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాడిపేట వద్ద ఉన్న శేషాద్రినగర్ వద్ద ఓ ఇంట్లో భారీగా నకిలీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తిరుపతిలోని ఆ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న నాగేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతి జిల్లా,తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాడిపేట పంచాయతీ, శేషాద్రి నగర్ ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న నాగేష్ రెడ్డిని అరెస్టు చేశామని సీఐ టీవి. సుధాకర్ తెలిపారు. అతని నుంచి అక్రమ మద్యం, తయారీ సామగ్రి, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సుధాకర్ ఆదివారం వెల్లడించారు.

తంబళ్లపల్లెలో మొదట..

ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం లో నకిలీ మద్యం వ్యవహారంలో రాజకీయ ప్రకంపన సృష్టించాయి. వైసిపి, టిడిపి నాయకుల మధ్య మాటల యుద్ధం జరగడమే కాదు. వైసిపి నాయకుల్లో మాజీమంత్రి జోగి రమేష్, ఆయన తమ్ముడు కూడా జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఇంచార్జి దాసర్లపల్లి జై చంద్ర రెడ్డి కూడా ఈ వ్యవహారంలో పార్టీ నుంచి బహిష్కరణ గురయ్యారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది .

తిరుచానూరు వద్ద ఏమి జరిగింది?

మాదకద్రవ్యాల విక్రయాలను కట్టడి చేయాలనే లక్ష్యంగా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగానే తిరుపతి డిఎస్పి బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఏకకాలంలో రూరల్ పరిధిలోని శేషాద్రినగర్ వద్ద ఉన్న పాడిపేట ఇందిరమ్మ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఓ ఇంటిలో అనుమానాస్పద వాతావరణ కనిపించడంతో లోనికి వెళ్ళిన పోలీసులు అవాక్కయ్యారు.

బయటపడిన నకిలీ మద్యం

శేషాద్రినగర్ లో తనిఖీ చేస్తున్న పోలీసులకు నాగేష్ రెడ్డి ఇంట్లో భారీగానే నకిలీ మద్యం సీసాలు, మద్యం తయారీకి వాడే ముడిసరుకు కనిపించింది. 40కి పైగా నకిలీ మద్యం ఫుల్ బాటిళ్లు, నకిలీ మద్యం తయారీకి వినియోగిస్తున్న ముడి సరుకులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం ప్రాంతంలోని గోపాలపట్నం ప్రాంతానికి చెందిన చింతగుంట రామస్వామి నగేష్ రెడ్డి (39) గా గుర్తించారు. ప్రస్తుతం శేషాద్రి నగర్ లోని ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇతను గతంలో డబ్బు కోసం చెన్నై, బెంగళూరులోని (Azidus, Sitec, Norwich, Micro Labs, Biocon) ప్రముఖ ఫార్మాస్యూటికల్ ల్యాబ్ లో డ్రగ్ రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నట్లు విచారణలో తేలిందని సీఐ సుధాకర్ వెల్లడించారు.
"కెమికల్ అనాలిసిస్ నివేదిక ప్రకారం, ఈ ఇంట్లో తయారుచేసిన మద్యంలో ఆల్కహాల్ శాతం 8.12% నుంచి 8.25% వరకు ఉన్నట్లు తేలింది. సాధారణ మద్యంలో ఇది 42% ఉంటుంది. ఈ ఆల్కహాల్ శాతం సాధారణంగా సహజ పులియబెట్టడం (fermentation) వల్ల వస్తుంది" అని సీఐ సుధాకర్ చెప్పారు.

నిందితుడి వద్ద నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) మరియు అక్రమ మద్యం లభించడంతో Cr. No. 56/2026 U/s 34(e), 35 AP Excise Act కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించామని సీఐ సుధాకర్ వివరించారు.

యూట్యూబ్ చూసి..

సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన నాగేష్ రెడ్డి నకిలీ మద్యం తయారీకి వైపు మొగ్గు చూపినట్లు పోలీసులు సందేహిస్తున్నారు. నకిలీ మద్యం ఎలా తయారు చేయాలి అనే విషయాలపై అవగాహనకు యూట్యూబ్లో చూసినట్లు నాగేష్ రెడ్డి పోలీసులకు చెప్పారని తెలిసింది. ద్రాక్ష, చక్కెర, ఇంకొన్ని ద్రవాల మిశ్రమంతో కొంతకాలంగా ఇంట్లోనే మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మద్యం తయారీ విధానం: మద్యం వ్యసనానికి బానిసైన నగేష్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే మద్యం (వైన్) తయారు చేయడం నేర్చుకున్నాడు. నల్ల ద్రాక్ష, చక్కెర, గోధుమలు, ఈస్ట్, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సోంపు, జాజి పువ్వు, బిర్యానీ ఆకులు వంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం, ఒక డ్రమ్ములో పులియబెట్టి మద్యం తయారు చేస్తున్నాడు. పాత సీసాలలో నింపి తెలిసిన వారికి రూ.300 లకు విక్రయిస్తూ, తానూ సేవిస్తున్నాడని సీఐ సుధాకర్ వివరించారు.

ఏడాది కిందట కూడా..

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద గత ఏడాది కూడా ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు చేశారు. ప్రముఖ నకిలీ బ్రాండ్ల లేబుళ్లను అతికించి, మద్యం తయారు చేస్తున్నట్లు గత ఏడాది జనవరిలో గుర్తించారు. ఆ సమయంలో ప్రధాన బ్రాండ్ల పేర్లతో ఉన్న 591 నకిలీ మద్యం సాసాలు, 6,600 కాళీ మద్యం సీసాలు, మూతలు, 85 లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. రాయల్ క్యాన్ విస్కీ, హనీ బీ బ్రాందీ, కేరళ స్మార్ట్ విస్కీ, మంజీరా నైసీ హార్స్, సెలబ్రిటీ ఛాయిస్ వంటి కంపెనీల నకిలీ లేబుళ్లు అతికించడం ద్వారా మద్యం యథేచ్చగా విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు అప్పట్లో గుర్తించారు.
తిరుపతి పరిసరాలతో పాటు రైల్వే కోడూరు ప్రాంతాల్లో బెల్ట్ దుకాణాల ద్వారా నకిలీ మద్యం విక్రయాలు సాగించినట్లు కూడా ఎక్సైజ్ పోలీసులు అప్పట్లో గుర్తించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని టీ. సుండుపల్లి మండలం పింఛా గ్రామానికి చెందిన వెంకటరమణగా గుర్తించినట్లు అప్పట్లో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెప్పారు.
తిరుపతి రూరల్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు లేకపోవడం వల్ల ఒకే ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలుగా మార్చుకున్నట్లు మరోసారి స్పష్టమైంది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ సందర్భంగా నకిలీ మద్యం తయారీ వ్యవహారం వెలుగు చూసింది.

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాడిపేట పంచాయతీ శేషాద్రి నగర్ ఇందిరమ్మ కాలనీలో మద్యం తయారు చేస్తున్న నాగేష్ రెడ్డి నుంచి స్వాధనం చేసుకున్న ముడిసరుకు వివరాలు సీఐ సుధాకర్ వెల్లడించారు.

1.1000 ml సామర్థ్యం ఉన్న నాలుగు బాటిళ్ల NDPL లిక్కర్.

2. 750 ml సామర్థ్యం ఉన్న 33 బాటిళ్ల నాటు మద్యం.

3. హాలులో ఉన్న బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్ములో ఉన్న 6 లీటర్ల పులియబెట్టిన మద్యం.

మొత్తంగా సుమారు 34.750 లీటర్ల అక్రమ మద్యం, NDPL లిక్కర్.

- 4. మద్యం తయారీకి ఉపయోగించిన సుగంధ ద్రవ్యాల ప్యాకెట్లు. స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయని సీఐ సుధాకర్ వివరించారు.

Read More
Next Story