
తిరుపతి:తెప్పలపై శ్రీకోదండరాముడి విహారం...
శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమైన వార్షిక తెప్పోత్సవాలు
తిరుపతిలోని శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నుంచి తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి.
తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణిలో శ్రీకోదండరామస్వామి వారి తెప్పోత్సవాలను టీటీడీ అధికారులు వైభవంగా ప్రారంభించారు. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారిని ఆశీనులను చేశారు. రామచంద్రపుష్కరిణిలో తెప్పపై ఐదు చుట్లు తిరుగిన స్వామివారు యాత్రికులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నగర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, కర్పూరనీరాజనాలు అందించారు.
శ్రీకోదండరామాలయంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి 9.30 గంటల వరకు శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
రాత్రి ఊరేగింపు
తెప్పత్సవాల కోసం రామచంద్రపుష్కరిణిని నీటితో నింపారు. పుష్కరిణితో పాటు సమీప ప్రాంతాలను విద్ద్యుదీపకాంతులతో అలంకరించారు. శ్రీకోదండరామస్వామి వారి ఆలయం నుంచి శ్రీసీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు.

