
తిరుపతి:మరో పెద్ద పండగ... గంగమ్మ జాతరకు ముహూర్తం..
వారం రోజుల జాతరకు మే ఐదో తేదీ చాటింపు. పోస్టర్లు విడుదల.
బూతులే దీవెనలుగా భావించే తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరకు ముహూర్తం ఖరారైంది. మే ఐదో తేదీ చాటింపుతో జాతరకు నాంది పలుకుతారు. 13వ తేదీ అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. గంగమ్మ జాతర పోస్టర్లను తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ తో కలిసి టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి ఆదివారం పోస్టర్లను ఆవిష్కరించారు.
చిత్తూరు జిల్లాలో మదనపల్లెకు సమీపంలోని సీటీఎం వద్ద ఉన్న నలవీరగంగాభవానీ జాతరతో తిరునాళ్లు ప్రారంభం అవుతాయి. తిరుపతి గంగమ్మ జాతరతో జిల్లాలో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద ఆదివారం జాతర పోస్టర్లను ఆవిష్కరించిన తరువాత టీటీడీ బోర్డు సభ్యరాలు పనబాక లక్ష్మి మాట్లాడారు.
"గంగమ్మ జాతరకు తిరుపతి ప్రాంతంలో అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. జాతర అనేది స్థానిక సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యత మరింత బలపడుతుంది" అని పనబాక లక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు
ఐదో తేదీ చాటింపు
తిరుపతి నగరంలో పురుషులు మహిళల వేషంలో కనిపించడమే గంగజాతర ప్రత్యేకత. మే ఐదో తేదీ జాతర నిర్వహణకు చాటింపు వేస్తారు. 13వ తేదీ అమ్మవారి విశ్వరూపదర్శనంతో జాతర ముగుస్తుంది. గ్రామీణ వాతావరణానికి ఏమాత్రం తీసిపోకుండా జాతరలో కూడా బీసీలు, దళితులు కీలకంగా వ్యవహరిస్తారు.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నగరానికి పెద్దపండుగ. పురుషులు మహిళల వేషాలు. పిల్లలు, పెద్దలు బండవేషంలో బూతులు తిట్టడం అనేది ఇక్కడ సంప్రదాయం. ఇలా చేయకపోవడం పాపం అనేది విశ్వాసం. వాటిని ఆశీస్సులుగా భావిస్తారు. తమిళ సంప్రదాయంలో ప్రతి సంవత్సరం చిత్రి నెలలో (మే నెల)లో నిర్వహించే ఈ జాతరకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
రాష్ట్ర పండుగగా..
తిరుపతి గంగమ్మ జాతరను 2013 నుంచి రాష్ట్ర పండుగగా గుర్తించింది. తిరుపతి జాతరలో కైకాల వంశం, కమ్మరి, కుమ్మరి, తోటివాళ్లు, చాకలి, మంగలి కులస్తులదే ప్రధాన పాత్ర.దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి గ్రామదేవత జాతరలో ఈ ప్రాంత వ్యవహారాలు, జీవనవిధానం, అనాదిగా వస్తున్న సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా యాత్రికులు వస్తుంటారు. తిరుమల శ్రీవారి చెల్లెలుగా భావించే తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అనంతాళ్వార్ నిర్మించారనేది చరిత్ర. రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీఓలో ఈ విషయం ప్రస్తావించింది.
Next Story

