
తిరుమల శేషాచలం అడువుల్లోని రామకృష్ణతీర్థ ముక్కోటితీర్థానికి హాజరైన యాత్రికలకు మహాహారతి.
తిరుమల: వేడుకగా ముగిసిన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి
అడవుల్లో ప్రయాణించిన 5000 వేల మంది యాత్రికులు
తిరుమల శేషాచలం అడవుల్లోని శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. సాయంత్రానికి ఈ కార్యక్రమం ముగిసింది. ఈతీర్థయాత్రలో సుమారు ఐదు వేల మంది యాత్రికులు పాల్గొన్నారని టీటీడీ వెల్లడించింది.
తిరుమల నుంచి ఉదయం ఏడు గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్లారు. శేషాచలం అడవుల్లోని శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి ఒకటి. ఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణ కథనాల నేపథ్యం.
యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు
దట్టమైన అడవుల్లోని శ్రీరామకృష్ణ తీర్థానికి చేరడానికి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడన సాహసయాత్ర కావడం వల్ల టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యాత్రికులకు అత్యవసర సేవలు అవరమైతే ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు ఈ మార్గంలో రెండు అంబులెన్సుల తోపాటు నాలుగు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది.
శ్రీరామకృష్ణ తీర్థానికి వెళ్లడానికి ఆదివారం ఉదయం వచ్చిన యాత్రికులకు పాపవినాశనం వద్ద మెడికల్ స్క్రీనింగ్ చేశారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించిన తరువాతే తీర్థం వైపు నడకసాగిండానికి అనుమతించారు. ఇక్కడికి యాత్రికులను తరలించడానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 40 బస్సులు నడిపింది.
పాపవినాశనం వద్ద యాత్రికులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ, పాలు, కాఫీ, పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత యాత్రికులను అడవిమార్గంలోకి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
శ్రీరామకృష్ణ ముక్కోటి తీర్ధానికి యాత్రికులు చేరుకున్నారు. అక్కడ ప్రవహిస్తున్న జలాపాతాలు, సెలయేటిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అదే సమయంలో శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన శ్రీవారి ఆలయ వేదపండితులు నైవేద్యం సమర్పించారు. అశేషంగా తరలివచ్చిన యాత్రికులకు హారతి అందించారు.
మధ్యాహ్నం తరువాత యాత్రికులు కాలినడకన పాపవినాశనం నుంచి తిరుమలకు చేరుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు ఏర్పాట్ల చేశారు.
Next Story

