
శ్రీవారి క్షేత్రాన్ని దేవలోకంగా మార్చిన పువ్వులు...
27వ తేదీ శ్రీరామ పట్టాభిషేకం. రామాయణం, యుగాల పురాణ కథలు వివరిస్తున్న ప్రదర్శన
తిరుమల కలియుగ వైకుంఠం. వరుస విశేష పర్వదినాలతో శ్రీవారి క్షేత్రం దేవలోకంగా మారింది. ఫల, పుష్పాలతో రామాయణ ఘట్టాలు ఆవిష్కరించారు. ఈ ప్రదర్శన యాత్రికులను రామాయణ కాలం నాటి చరిత్రను కథలుగా చెబుతోంది. ప్రకృతిలోని పువ్వుల తోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు శ్రీవారి ఆలయం ఎదుట మరో లోకాన్ని ఆవిష్కరించాయి. సీతారాముల వారి చరిత్రను కళ్లముందు ఆవిష్కరించడంలో టీటీడీ ఉద్యానశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
27వ తేదీ శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయం లోపల పుష్పాలంకరణ మధుర వాసనలు విరజిమ్ముతోంది. ఆలయం వెలుపల కూడా రామాయణ ఘట్టాలను వివరించే చిన్నికృష్ణుడు, రాముడు, మాహా విష్ణువును పోలిన విగ్రహాలు యుగాల నాటి చరిత్రను కథలుగా చెబుతున్నాయి. మూడు యుగాలకు (కృత, త్రేత, ద్వాపర) చెందిన ఇతివృత్తాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తిరుమలలో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువయ్యారనేది చారిత్రక కథనం. తిరుమలలో ఉగాది పండుగతో ఈ ఏడాది ఉత్సవాలకు నాంది పలికారు. ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి వేడుక నేపథ్యంలో శ్రీవారి క్షేత్రంలో ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీరామ పట్టాభిషేకం కూడా శ్రీవారి సన్నిధిలో అదే రోజు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక సందర్భాల నేపథ్యంలో ఆలయం వెలుపల గొల్లమండపం సమీపంలో రామాయణ ఘట్టాలను వివరిస్తూ, ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన యాత్రికులను ఆకట్టుకుంటోంది.
ఎన్ని రూపాలో...
కృష్ణుడి లీలలు: గోవుల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం ఆకర్షణగా నిలిచింది.
మామిడి చెట్టు కింద బాలకృష్ణుల ఆటపాటలు, అల్లరిని గుర్తు చేస్తున్నాయి.

