తిరుమల:19 రోజుల భాష్యకారుల ఉత్సవాలకు శ్రీకారం..
x
తిరుమలలో రామాన్యజాచార్యులవారి విగ్రహం ఊరేగింపు

తిరుమల:19 రోజుల భాష్యకారుల ఉత్సవాలకు శ్రీకారం..

శ్రీవారితోె శ్రీభాష్యకార్లకు అనుబంధం ఏమిటి?


తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తిరుమలలో 19 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ఏప్రిల్ 22న శ్రీభాష్యకార్ల సాత్తుమొరతో పరిసమాప్తి అవుతాయి.

శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరు వచ్చినట్లు నేది చరిత్ర.


భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య అధికారులు పాల్గొన్నారు.


ఈ ఉత్సవాల నేపథ్యం ఇదీ..

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం విశిష్టాద్వైత సిద్ధాంతకర్త శ్రీ భగవద్ రామానుజాచార్యుల గౌరవార్థం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం వెనుక ప్రధాన కారణాలతో పాటు విశేషాలు కూడా ఉన్నాయి. శ్రీ రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రాతిపదికన "శ్రీభాష్యం" అనే అద్భుతమైన వ్యాఖ్యానాన్ని (భాష్యం) అందించారు. ఈ గ్రంథం ద్వారా ఆయన వేదాంత తత్వాన్ని సామాన్యులకు సైతం చేరువ చేశారు. అందుకే ఆయనకు "భాష్యకారులు" అనే పేరు స్థిరపడింది.


తిరుమల శ్రీవారి ఆలయంలో రామానుజాచార్యులవారికి విడదీయని బంధం ఉందనేది చరిత్ర . తిరుమల ఆలయ సంప్రదాయాలు, పూజా కైంకర్యాలను రామానుజాచార్యలే క్రమబద్ధీరించారు. శ్రీవారి చేతిలో శంఖు చక్రాలను ప్రతిష్ఠించింది కూడా ఆయనేనని భక్తుల నమ్మకం. ఆయనకు గౌరవ సూచికంగా శ్రీవారి ఆలయంలోనే ఆయనకు ఒక సన్నిధి (భాష్యకార్ల సన్నిధి) ఉంది. ఉత్సవ సమయంలో శ్రీ రామానుజుల వారి విగ్రహాన్ని బంగారు తిరుచ్చిపై ఉంచి, ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. తిరుమల జీయ్యంగార్లు ఈ సందర్భంగా దివ్యప్రబంధ గోష్టి (తమిళ వేద పఠనం) నిర్వహిస్తారు. సాధారణంగా ఏ ఉత్సవంలోనైనా దేవుడు ముందు, భక్తులు (గోష్టి) వెనుక వెళ్తారు. కానీ, ఈ ఉత్సవంలో రామానుజుల వారు స్వయంగా భగవంతునికే ఆచార్యులు కాబట్టి, శ్రీవారి సన్నిధిలో ఆయనకు అత్యున్నత గౌరవం లభిస్తుంది.

Read More
Next Story