
శ్రీవారికి వేడుకగా ప్రారంభమైన సాలకట్ల వసంత్సవాలు..
రేపు బంగారు రథంపై మలయప్ప విహారం. ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే.
ఏడాది పొడవునా ఉత్సవాలతో తిరుమల శ్రీవారు యాత్రికులకు దర్శనం ఇస్తుంటారు. వాటిలో వార్షిక ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. సోమవారం రాత్రి మూడు రోజుల (మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు) సాలకట్ల వసంతోత్సవాలకు టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది.
వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
ఎప్పటి నుంచి ఈ ఆనవాయితీ..
తిరుమల శ్రీవారికి ఏటా చైత్రమాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. విజయనగర చక్రవర్తి అచ్యుతరాయల కాలం నుంచి క్రీస్తుశకం 1460 నుంచి వసంతోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ చరిత్ర చెబుతోంది. వసంతరుతువు రాకను పురస్కరించుకుని ఈ సత్సవాలను ప్రవేశపెట్టారనేది చారిత్రక నేపథ్య కథనం. ప్రతి సంవత్సరం పౌర్ణమి నాటికి ఉత్సవాలు ముగిసే విధంగా కార్యక్రమాల నిర్వహణకు ముహూర్తం నిర్ణయాస్తారు.
ఎంతతీవ్రత నుంచి ఉభయ దేవేరులతో పాటు శ్రీమలయప్ప స్వామి వారికి ఉపశమనం కలిగించడానికి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించడం కూడా ఓ ప్రత్యేకత ఉందనేది పండితులు చెబుతున్నా మాట. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.
తిరుమలలో వసంతోత్సవాలు నిర్వహించడానికి గతంలో పురాతన మండపం ఉండేది. 2006లో శ్రీవారి ఆలయ మాడవీధుల విస్తరణలో భాగంగా పాత మండపం తొలగించారు. దీంతో ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందున్న వైభవోత్సవ మండపంలో వసంతోత్సావాలు నిర్వహిస్తున్నారు.
రేపు బంగారురథంపై ఊరేగింపు
మార్చి 31న శ్రీ భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఉదయం ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
చివరిరోజు ఏప్రిల్ ఒకటో తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
రోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచినాలుగు గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
Next Story

