పాత కడపలో రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు..
x

పాత కడపలో రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు..

మూడు క్రేత్రాలకు గడప లాంటి దేవుడి కడప ప్రత్యేకతలు ఏమిటంటే..


తిరుమల శ్రీవారి క్షేత్రం తరహాలోనే దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు టిటిడి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 19వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 27వ తేదీ చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఉత్సవాల్లో 24వ తేదీ ఉదయం 10.30 గం.లకు స్వామి వారి కల్యాణం జరుగుతుంది. 25వ తేదీ రథోత్సవం నిర్వహిస్తారు.
కడపలో అధికారులతో టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం ప్రత్యేకంగా సమీక్షించారు. తిరుమలలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఏమాత్రం తీసుకొని విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కడప నగరానికి సమీపంలో ఉన్న దేవుని కడప హనుమక్షేత్రంగా ప్రసిద్ధి చెందడం వెనుక ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
మూడు క్షేత్రాలకు గడప..
దేవుని కడప తిరుమలకు తొలి గడపగా గుర్తింపు పొందింది. హైదరాబాద్, కర్నూలు నుంచి చెన్నైకి రావడానికి హైవేలో ఉన్న కడప నగరానికి సమీపంలోని పాత కడప ఉంది. "తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం తో పాటు దేవుని కడప రాజగోపురం కూడా ఒకేసారి నిర్మించారు. అని కడప కైఫీయత్తులు స్పష్నం చేస్తున్నాయి.
తిరుమలతో పాటు మూడు క్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు దేవుని కడప తొలి గడపగా దేవుని కడప గుర్తింపు పొందింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీకి వెళ్లడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లడానికి, తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కాలిబాటలో వెళ్లే వారికి కడప ప్రధాన మార్గం. ఈ మూడు ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా మొదట దేవుని గడపవద్ద ఉన్న శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని, సోమేశ్వరస్వామిని దర్శించుకుని ఆ తర్వాత ఇతర ఆలయాలకు వెళ్లేవారు. దీనివల్లే ఇది మూడు క్షేత్రాల తొలి గడపగా గుర్తింపు పొందింది.
ఆలయ నేపథ్యం

దేవుని కడపలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నీ కృపాచార్యులు ప్రతిష్టించారని చరిత్ర చెబుతున్న కథనం. ఈ పట్టణానికి కృపా పరమని పేరు కూడా వచ్చింది. అది కాస్త కడపగా మారిందని చెబుతారు. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య పతలు, నంద్యాల రాజులు అభివృద్ధి చేశారనేది చారిత్రక కథనం. దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి వారిని కీర్తిస్తూ తాళ్లపాక అన్నమాచార్యులు 12 కీర్తనలు రచించినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి.
దేవుని కడప హనుమ క్షేత్రం..
తిరుమల వరాహ స్వామి క్షేత్రంగా భావిస్తారు. వరాహ ప్రాణం లో ఈ కథనం చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయం హనుమ క్షేత్రంగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రసన్న వెంకటేశ్వర గుడిలో ఒక మందిరంలో ఉంటే ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపిస్తుంది. స్వామివారి విగ్రహానికి వెనకవైపు క్షేత్రపాలకుడుగా ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే సాధారణంగా వినాయకుడికి అడ్డ నామాలు ఉంటాయి దీనికి భిన్నంగా ఇక్కడి నృత్య గణపతికి నిలువు నామాలు ఉండడం ప్రత్యేకత.
టీటీడీ ఆధీనంలో ఉత్సవాలు
దేవుని కడప ఆలయాన్ని టీటీడీ 20 ఏళ్ల కిందట స్వాధీనం చేసుకున్నది. అప్పటినుంచి తిరుమల తరహాలోనే ఇక్కడ బ్రహ్మోత్సవాలు, ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

"ఈ సంవత్సరం కూడా దేవుని కడపలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేసాం" అని టిటిడి జెఈఓ వీరబ్రహ్మం చెప్పారు. వాహన సేవలు సవ్యంగా నిర్వహించడానికి, బారికేడింగ్ పనులు టీటీడీ ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం ఏర్పాట్లు చేశారు. వాహన సేవలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రద్దీ నియంత్రణ కోసం టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉంటారని వీజీవో గిరిధర్ చెప్పారు. దేవుని కడప ఆలయంలో స్వామివారికి నిత్య కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలను సవ్యంగా నిర్వహించడానికి పర్యవేక్షిస్తున్నట్లు టిటిడి డిప్యూటీ ఈఓ ప్రశాంతి తెలిపారు.
టీటీడీ జేఈవో నిర్వహించిన సమీక్షలో ఆలయ అర్చకులు మయూరం కృష్ణస్వామి తో పాటు ఇంకొందరు, టిటిడి అధికారులు, కడప పోలీసులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి వీలుగా టిటిడి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.
బ్రహ్మోత్సవాలు ఇలా..
19 వతేదీ ఉదయం మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి – చంద్రప్రభ వాహనం
20వతేదీ ఉద‌యం సూర్యప్రభవాహనం , రాత్రి – పెద్దశేష వాహనం
21వతేదీ ఉద‌యం – చిన్నశేష వాహనం, రాత్రి – సింహ వాహనం
22వతేదీ ఉద‌యం – కల్పవృక్ష వాహనం, రాత్రి – హనుమంత వాహనం
23వతేదీ ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం , రాత్రి – గరుడ వాహనం
24వతేదీ ఉద‌యం – కల్యాణోత్సవం, రాత్రి – గజ వాహనం
25వతేదీ ఉద‌యం – రథోత్సవం,రాత్రి – ధూళి ఉత్సవం
26వతేదీ ఉద‌యం – సర్వభూపాల వాహనం , రాత్రి – అశ్వ వాహనం కార్య
27వతేదీ ఉద‌యం – వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రోజూ ఆలయం వద్ద టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భ‌క్తి సంగీత‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాలు చేసినట్లు టీటీ డీజేఈఓ వీరబ్రంహ్మం వివరించారు.
Read More
Next Story