CM In Tirumala | ఆలయాలు అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండాలి..
x
తిరుమలలో టీటీడీ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

CM In Tirumala | ఆలయాలు అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండాలి..

టీటీడీ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు


తిరుమలకు వచ్చే యాత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. టిటిడి ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన పద్ధతులు అమలు చేయాలని కూడా ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు.

తిరుమలలో మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు శ్రీవారి ఆశీస్సుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం రాత్రి చేరుకున్నారు. భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, మనవడు నారా దేవాన్ష్ తో కలిసి శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు.

టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వేంకటేశ్వర్, టీటీడీ సీవీ అండ్ ఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ అన్నదానం, క్యూ కాంప్లెక్స్ పర్యవేక్షించే డిప్యూటీ ఈఓల తో పాటు నిత్యాన్నదాన సత్రం డిప్యూటీ ఈఓ, అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.
"తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా గుర్తించి, వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయండి. భక్తులు క్యూలోకి ప్రవేశించిన సమయం నుంచి శ్రీవారి దర్శనం పూర్తి చేసి తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించండి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేకంగా సూచించారు.

తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇప్పటికే ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు అధికారులు ఆయనకు వివరించారు.

తిరుమలలో భవిష్యత్తులో కాలుష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, మరిన్ని ఆలయాల నిర్మాణం ద్వారా భక్తి భావాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం పేర్కొన్నారు. అన్నదానం, ప్రాణదానం పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, ప్రాణదానం సేవలను విస్తరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు.
తిరుమలలో యాత్రికులకు కల్పిస్తున్న సదుపాయాలు ప్రధానంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో వడ్డిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతలో రాజీ పడొద్దు అని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఆహార వస్తువుల కొనుగోళ్లలో ఏమాత్రం విమర్శలకు ఆస్కారం లేకుండా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించినట్టు అధికార వర్గాల తెలిసిన సమాచారం.
క్యూలో యాత్రికులపై..

తిరుమల ఆలయం తోపాటు శ్రీవారి దర్శనానికి ఆలయం వెలుపల క్యూలో యాత్రికులు ఉన్న దృశ్యాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిశీలించారు. టీటీడీ అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ఇంటిగ్రేడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా యాత్రికుల రద్దీని అంచనా వేయడానికి టీటీడీ అనుసరిస్తున్న పద్ధతులను ఈఓ ముద్దాడి రవిచంద్ర, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ మురళీ కృష్ణ పద్మావతీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు దృశ్యాలు చూసే ఏర్పాటు చేశారు.

కమాండ్ కంట్రోెల్ పనితీరుపై..

తిరుమలలో శిలాతోరణం నుంచి శ్రీవారి ఆలయం వరకు క్యూలో ఉన్న యాత్రికులతో పాటు ఆలయంలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆసాంతం పరిశీలించారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా తీసుకుంటున్న చర్యలపై టీటీడీ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారని తెలిసింది.
"సామాన్య యాత్రికులకు శ్రీవారి మంచి దర్శనం కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. అసహనానికి గురి చేయకుండా జాగ్రత్తలు పాటించండి" అని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారని తెలిసింది. సాంకేతికతను సమర్ధవంతంగా వినియోగించుకుని మరింత మెరుగైన సేవలు అందించాలని కూడా సూచించిట్లు సమాచారం.

శ్రీవారి సేవపై

శ్రీవారి సేవలో పాల్గొనే సేవకులకు వారి నైపుణ్యానికి తగ్గట్లుగా శిక్షణ ఇచ్చి, వారి సేవలను టిటిడి పరిధిలోని అన్ని ఆలయాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. టిటిడిలో అమలు చేస్తున్న విధానాలు, దేశంలోని ఇతర ఆలయాలకు మరింత మార్గదర్శకాలుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా క్యూలైన్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్

అంతకుముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి, వనరులను సమర్థవంతంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. లడ్డూల తయారీ, విక్రయాలు, నిల్వ వంటి అంశాలను కూడా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నామని టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబకు వివరించారు. ఎన్ ఆర్ ఐ దాతల సహకారంతో కార్యా ఫౌండేషన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను అమెరికాలోని దాత శ్రీ వేజేండ్ల జయప్రసాద్ వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు.

Read More
Next Story