31న బంగారు రథంపై కనువిందు చేయనున్న మలయప్ప
x
తిరుమలలో బంగారు రథం ఊరేగింపు (ఫైల్)

31న బంగారు రథంపై కనువిందు చేయనున్న మలయప్ప

తిరుమలలో 30వ తేదీ నుంచి మూడు రోజులు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. ఆర్జిత సేవలు రద్దు.



తిరుమల శ్రీవారికి ఏడాది పొడవునా నిత్య కార్యక్రమాలకు కొదవలేదు. ఈ నెల 30వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. వసంతోత్సవాల్లో రెండో రోజు మార్చి 31వ తేదీ బంగారురథాన్ని అధిరోహించే శ్రీమలయప్పస్వామివారు తిరుమాడవీధుల్లో విహరించనున్నారు. ఈ మూడు రోజులు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు చెప్పారు.
తిరుమలలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో చైత్రశుద్ధి పౌర్ణమికి ముగింపుగా మూడు రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందువల్ల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
వసంత ఋతువులో శ్రీమలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. చైత్ర పూర్ణిమ గురువారం కలిసి రావడం వల్ల పుణ్యంగా భావిస్తారు. తిరుమలలో వసంతోత్సవాలు 1360 సంవత్సరం నుంచి నిర్వహిచస్తున్నట్లు టీటీడీ పండితులు చెబుతున్నారు.

వసంతోత్సవాలు ఇలా...

తిరుమలలో ఏటా వసంతోత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. మార్చి 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
మార్చి 31వ తేదీ రెండవరోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహిస్తారు. తిరుమల ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ గ్యాలరీల్లోని యాత్రికులకు దర్శనం ఇస్తారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
చివరి రోజు ఏప్రిల్ 01న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
వసంతోత్సవాల్లో చివరి మూడో రోజు శ్రీమలయప్పస్వామి వారితో సహా సీతారామలక్ష్మణ, హనుమంతులు, రుక్మిణి సమేత భగవానుడు కూడా వసంతోత్సవంలో పాల్గొంటారనేది చారిత్రక నేపథ్యం ప్రతీతి. ప్రత్యేక బంగారు పీఠాలపై ఆశీనులను చేసి, విడివిడిగానే వైవేద్యాలు సమర్పిస్తారు. త్రేతాయుగం నాటి రాముడు, ద్వారప యుగంలో కృష్ణుడు నేను అనేది శ్రీవేంకటేశ్వరస్వామి ఇచ్చే సందేశంగా వసంతోత్సవాల నిర్వహణ వెనుక కథనంగా చెబుతున్నారు. సుప్రభాతంలోని మొదటి రెండు శ్లోకాలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయనే విషయాన్ని కూడా పండితులు స్ఫష్టం చేశారు.
ఉత్సవాలు నిర్వహించే మూడు రోజులూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మలయప్పస్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
Read More
Next Story