
సిఫారసు లేకున్నా... సామాన్యులకూ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు..
జూన్ నెల కోటా రేపు విడుదల
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య యాత్రికులకు ఆర్జీత సేవా టికెట్లు కూడా టీటీడీ అందుబాటులో ఉంచుతోంది. సిఫారసు లేకున్నా, ఆన్ లైన్ ద్వారా మూడు నెలలకు ఒకసారి టీటీడీ విడుదల చేస్తోంది. ఈ ఏడాది జూన్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా ఈ నెల 18వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు. ఆర్జిత సేవా టికెట్ల తోపాటు వసతి గదుల కోటా కూడా విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.
తిరుమల శ్రీవారికి దర్శన శ్రీవారి ఆర్జిత సేవల్లో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కోటా విడుదల చేస్తారని ఈఓ రవిచంద్ర చెప్పారు.
టికెట్లు ఎలా తీసుకోవాలంటే..
శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి సిఫారసు లేఖలు ఉంటేనే ఆర్జిత సేవాటికెట్లు అందుబాటులో ఉంటాయి. సామాన్యులకు సిఫారసు లేఖలు దొరకడం కష్టం. అందుకే తిరుమలలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేయకున్నా, ఆన్ లైన్ ద్వారా ఆర్జిత సేవా టికెట్ల తోపాటు వసతి గది కూడా కేటాయిస్తోంది.
1. ఈ నెల 18వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేసే ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
2. ఈ టికెట్లు తీసుకున్న వారు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఆన్ లైన్ లో నగదు చెల్లించాలి. సకాలంలో నగదు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవ: వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటా ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
అంగ ప్రదక్షిణ:తిరుమల శ్రీవారి ఆలయంలో మూలమూర్తి సన్నిధి వెలుపల అంగప్రదక్షిణ చేయడానికి కూడా యాత్రికులు టికెట్లకు డిమాండ్ ఉంది. దీంతో ఈ టికెట్లను కూడా ఆన్ లైన్ లో 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
ప్రత్యేక టికెట్లు: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
గదులు: తిరుమల తోపాటు తిరుపతిలో కూడా తక్కువ ధరకే యాత్రికులకు టీటీడీ గదులు కేటాయించడానికి వసతి సముదాయాలు అందుబాటులో ఉంచింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుల చేస్తారు.
Next Story

