శ్రీవారి సన్నిధిలో ఈరోజు రాత్రి శ్రీరామపట్టాభిషేకం
x
తిరుమలలో శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులకు స్నపన తిరుమంజనం చేస్తున్న టీటీడీ వేదపండితులు

శ్రీవారి సన్నిధిలో ఈరోజు రాత్రి శ్రీరామపట్టాభిషేకం

తిరుమలలో శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులకు వైభవంగా స్నపన తిరుమంజనం .


తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముందే బంగారు వాకిలి వద్ద ఆస్థానం జరుగుతుంది. ఈ కార్యక్రమాల నేపథ్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు శుక్రవారం ఉదయం స్న‌ప‌న తిరుమంజ‌నం వైభ‌వంగా నిర్వహించారు.


శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం తొమ్మది గంటల నుంచి 11 గంటల వరకు శ్రీసీతారామ, లక్ష్మణ సమేత హనుమంతుడి ఉత్సవర్తలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను టీటీడీ పెదజీయర్ స్వామి పర్యవేక్షణలో వేదపండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ పేష్కార్, అధికారులు ఈ కార్యక్రానికి హాజరయ్యారు.


తిరుమల శ్రీవారి రంగనాయకుల మండపంలో నిర్వహించిన స్నపన తిరుమంజనంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవర్లకు వేదమంత్రాల మధ్య అభిషేకం నిర్వహించారు. ఈ సమయంలో వేదపండితులు ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేకం చేసే సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు.


శ్రీరామనవమి ఆస్థానం

శ్రీరామనవమి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు హనుమంతుడి సేవ నిర్వహిస్తారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి గంట పాటు ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకు బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారు.
ఉభయదేవేరులతో కలిసి మలయప్ప స్వామి వారితో పాటు విష్వక్సేనుల వారిని వేంచేపు చేసి, గరుడాళ్వారుకు ఎదురుగా ఆశీనులను చేయడం ద్వారా శ్రీవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులకు సమర్పించడానికి పెదజీయర్ మఠం నుంచి తీసుకుని వచ్చే ఆరు కొత్త పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Read More
Next Story