
TTD Laddu
శ్రీవారి లడ్డు: చంద్రబాబు సర్కార్ ను సిట్ ఇరుకున పెట్టినట్టేనా?
"హిందూ మనో భావాలను దెబ్బతీసేలా ప్రచారం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి" అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారం మరోసారి రాష్ట్రంలో మంటలు రేపుతోంది. సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన చార్జ్‌షీట్ చంద్రబాబు నాయకత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ను ఇరుకున పెట్టినట్టయింది. 2019 నుంచి 2024 వరకు టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో గొడ్డు కొవ్వు (బీఫ్ టాలో) లేదా పంది కొవ్వు (లార్డ్) వంటి ఏ జంతు కొవ్వు లేదని సిట్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్‌తో కల్తీ చేసి, రసాయనిక ఎస్టర్లు, సింథటిక్ మెటీరియల్స్ ఉపయోగించి నకిలీ నెయ్యిని తయారు చేశారని దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఈ మేరకు ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు చార్జ్‌షీట్ సమర్పించారు.
ఈ నివేదికతో టీడీపీ వైసీపీ మధ్య మరోసారి మంటలు రాజుకున్నాయి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటి నాయకులు చేసిన 'జంతు కొవ్వు కలిపారు' అని ఆరోపించారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు దూకుడుగా రంగంలోకి దిగారు. "హిందూ మనో భావాలను దెబ్బతీసేలా ప్రచారం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి" అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మండల స్థాయి నుంచి రాజధాని వరకు ప్రెస్ మీట్లు, ర్యాలీలు, పోస్టర్లు వేసి ప్రచారం చేయాలని పార్టీ క్యాడర్‌కు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో వైసీపీకి 'క్లీన్ చిట్' అని ప్రచారం మొదలైంది.
సిట్ నివేదిక ప్రకారం, 2021 నుంచి 2024 వరకు సుమారు 68 లక్షల కిలోల (లేదా 5,971 టన్నులు) నకిలీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు. దీని విలువ సుమారు రూ.250 కోట్లు. ఈకేసులో 36 మందిపై అభియోగాలు మోపారు. 9 మంది టీటీడీ అధికారులు, 5 మంది డెయిరీ నిపుణులు, సరఫరాదారులు ఉన్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా డెయిరీ, ఇతర కంపెనీలు బ్రిబరీ, నకిలీ డెయిరీ సెటప్‌లతో ఈ స్కామ్ చేశాయని సిట్ ఆరోపణ. నెయ్యి నాణ్యత లోపించిందని, రీచర్ట్-మీసల్ వాల్యూస్‌ను మానిప్యులేటర్ చేసి టెస్టులు దాటేశారని సిట్ తేల్చింది.
సిట్ నిర్ధారించిన విషయం ఏమిటంటే- "Since, the level of Butyric acid is below the limit of quantification and Cholesterol is not detected in the samples of Ghee from TTD, it is concluded that quantity of Ghee in these samples is very less. The absence of Cholesterol in the samples also suggests that the chances for presence of Tallow, Lard and Fish oil are very low. Appearance of two unusual peaks in GC chromatograms of triglycerides from Ghee samples of TTD indicates mixing of some compounds to adjust the RM for complying FSSAI specification. Further, based on the Fatty acid profile and presence of beta sitosterol in Ghee samples from TTD, it is concluded that these samples are primarily a mixture of Palm oil and/or Palm stearin with Palm kernel oil.”
టీడీపీ స్పందన ఏమిటంటే...
పూర్తి నివేదిక అధ్యయనం చేసిన తర్వాతే స్పందించాలి, అప్పటి వరకు మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులకు సలహా ఇచ్చినట్టు సమాచారం. "కల్తీ జరిగిందనేది రుజువైంది, అది మునుపటి వైఎస్‌ఆర్‌సీపీ పాలనలోనే ఇది జరిగింది" అని టీడీపీ నాయకులు వాదిస్తున్నారు. అయితే, జంతు కొవ్వు లేదనే విషయం టీడీపీ ఆరోపణలను బలహీనపరిచింది. దీంతో సర్కార్ ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తోంది. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
మరోవైపు, పవన్ కల్యాణ్ ఈ వివాదంపై ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో, తిరుపతి లడ్డూ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, నిజాలు బయటపడాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఈ స్కామ్ వెనుక ఉన్న అవకతవకలపై పూర్తి దర్యాప్తు జరిగి, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
Next Story

