ఆధ్యాత్మిక అనుభూతి కల్పించేలా సేవలు..
x
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న ముద్దాడ రవిచంద్ర

ఆధ్యాత్మిక అనుభూతి కల్పించేలా సేవలు..

టీటీడీ ఈఓగా పూర్తి బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర


తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఆధ్యాత్మిక అనుభూతి కల్పించేలా ఏర్పాట్లతో సేవలు అందిస్తానని టీటీడీ ఈఓగా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర చెప్పారు.

"యాత్రికుల నుంచి ఇప్పటికే అందిన అనేక సూచనలు పరిశీలించాను. వాటన్నింటిని నేనే స్వయంగా పరిశీలించి, యాత్రికుల్లో ఒకరిగా సేవలు అందిస్తానని" టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వ్యాఖ్యానించారు.శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వకరించారు. తరువాత ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, నెల వ్యవధిలో అనేక విషయాలపై అవగాహన ఏర్పడిందని చెప్పారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంలో దర్యాప్తు చేసిన సీబీఐ సారధ్యంలోని సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో..
"నెయ్యి కొనుగోలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్న సమయంలో ప్రేక్షకపాత్ర వహించిన ఈఓలుగా పనిచేసిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి" అని సీబీఐ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

నెల తరువాత పూర్తి బాధ్యతలు


టీటీడీలో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1996 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈఓగా ఫిబ్రవరి ఆరో తేదీ నియమించింది. ఆయన ఇటీవల టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించడంతో పాటు అధికారులు, సిబ్బంది, యాత్రికులతో కూడా అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా పరిపాలనా వ్యవహారాలకు శ్రీకారం చుట్టారు. సరిగ్గా నెల తరువాత ముద్దాడ రవిచంద్రను పూర్తి స్థాయిలో టీటీడీ ఈఓగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో రంగనాయకులు మండపంలో ముద్దాడ రవిచంద్రతో అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం బాధ్యతలు అప్పగించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న రవిచంద్ర దంపతులకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు.

చిత్తూరుతో అనుబంధం..

చిత్తూరు జిల్లాలో ముద్దాడ రవిచంద్ర డీపీఏపీ పీడిగా పని చేశారు. ఆ తర్వాత నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. టీటీడీకి ఈఓగా వచ్చిన రవిచంద్ర కు తిరుపతి జిల్లా పైన ప్రధానంగా టిటిడి కి సంబంధించిన వ్యవహారాలపై అవగాహన ఉంది. గతంలో పనిచేసిన జిల్లాల్లో కూడా సమర్థవంతమైన సేవల తో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. టిటిడి వ్యవహారాలు అందుకో భిన్నంగా ఉంటాయనే విషయంలో కూడా ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆలయ నిర్వహణ, యాత్రికులకు వసతులు కల్పించడం అనేది ఇబ్బంది లేకున్నా, తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను ఈఓ రవిచంద్ర అధిగమంచడంలో సమయస్ఫూర్తితో వ్యవహారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.

చాలా విషయాలు గమనించా..


తిరుమలలో బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక విషయాలపై అవగాహన కలిగిందని టీటీడీ ఈఓ ఎం. రవిచంద్ర ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. శ్రీవారి యాత్రికుల నుంచి అందిన అనేక సూచనలు, సలహాలను కూడా గమనించానని ఆయన తెలిపారు. వాటిని స్వయంగా పరిశీలించడం తోపాటు యాత్రికులకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులను సమన్వయం చేస్తానని చెప్పారు.

Read More
Next Story