
కళ్ల ముందు తండ్రి హత్య.. అడవిలో ఐదేళ్ల కొడుకు జాగారం..
చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద అమానుష ఘటన
అడవిలో మద్యం తాగడానికి కొందరు తమిళనాడులోని గుడియాత్తం ప్రాంతానికి చెందిన గాంధీని తీసుకుని వెళ్లారు. వారిని ఐదేళ్ల కొడుకు అనుసరించాడు. దూరంగా ఉండి, చూస్తుండగానే తండ్రిని చంపడం ఆ బాలుడు చూస్తున్నాడు. వారంతా వెళ్లిపోయాక దిక్కుతోచని స్థితిలో రాత్రంతా అడవిలోనే తండ్రి శవంతో జాగారం చేశారు. తెల్లవారిన తర్వాత సుమారు రెండు కిలోమీటర్లు అడవి నుంచి నడుచుకుని వచ్చిన ఆ బాలుడు పక్షిరాజపురంలోని ఓ అంగన్వాడి టీచర్ కు చెప్పాడు. దీంతో ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది.
మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం బోయకొండ అటవీ ప్రాంతంలో జరిగిన అమానుష సంఘటన సోమవారం బాహ్య ప్రపంచానికి తెలిసింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చు అని పోలీసులు సందేహిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్, ఎస్సై చిన్న రెడ్డెప్ప పరిశీలించారు.
తమిళనాడు రాష్ట్రం గుడియత్తం ప్రాంతానికి చెందిన గాంధీ అనే వ్యక్తి భార్య రాసాతి, ఐదేళ్ల కొడుకుతో పుంగనూరు ప్రాంతంలో అమలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం కొందరు స్నేహితులతో కలిసి గాంధీ మద్యం సేవించడానికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. వారిని గాంధీ ఐదేళ్ల కొడుకు కూడా అనుసరిస్తూ, వెళ్లి, దూరంగా ఉన్నాడు.
మద్యం తాగుతూ..
బోయకొండ అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత గాంధీతోపాటు ఇంకొందరు మద్యం సేవిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో మూకుమ్మడిగా గాంధీపై దాడి చేసి హత్య చేశారు. వారంతా వెళ్లిపోయిన తర్వాత దూరంగా భయం భయంగా దాక్కుని ఉన్న ఐదేళ్ల కొడుకు ఈ సంఘటన మొత్తం కళ్ళారా చూశాడు. వారంతా వెళ్లిపోయిన తరువాత బిక్కుబిక్కుమంటూ ఆ ఐదేళ్ల కొడుకు తండ్రి గాంధీ శవం దగ్గరికి వెళ్లాడు. ఎంతపిలిచినా ఉలుకు పలుకు లేదు. దీంతో ఏమి చేయాలో దిక్కుతెలియని స్థితిలో ఆదివారం రాత్రంతా తండ్రి శవం దగ్గరే ఉండిపోయాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని క్షణం యొక్క యుగంలా ఆ బాలుడు గడిపాడంటే ఎంతటి భయానక వాతావరణన్ని అనుభవించాడనేది అర్థం చేసుకోవచ్చు.
అడవి నుంచి బయటికి...
తండ్రిని హత్య చేయడం కళ్ళారా చూసిన ఆ ఐదేళ్ల బాలుడు ఎలా తల్లడిల్లడనేది ఆ దేవుడికే తెలియాలి. సోమవారం తెల్లవారగానే సుమారు రెండు కిలోమీటర్లు అడవి నుంచి బయటికి నడుచుకుని వచ్చాడు. పక్షిరాజపురం గ్రామంలోని ఓ అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లిన ఆ ఐదేళ్ల బాలుడు జరిగిన సంఘటన చెప్పాడు. ఆ బాలుడి తోపాటు అడవిలోకి వెళ్లిన అంగన్వాడీ టీచర్ కూడా శవమై పడి ఉన్న గాంధీని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాలుడితో కలిసి అడవిలోకి..
దారుణ ఘటన సమాచారం అందగానే పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్, ఎస్సై చిన్నరెడ్డన్న బోయకొండ అటవీ ప్రాంతంలోకి బయలుదేరారు. వారి వెంట గాంధీ ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అడవిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆ బాలుడి పేరు, తల్లి పేరు ఏమిటని తెలుగులోనే ప్రశ్నించి, వివరాలు సేకరించారు. దీంతో గాంధీ హత్యకు గురయ్యారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఈ సంఘటన తరువాత మృతుడు గాంధీ భార్య రాసాతి పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ హత్య వెనక వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పుంగనూరు రూరల్ సీఐ సాయిప్రసాద్ అభిప్రాయపడ్డారు. తండ్రి గాంధీ హత్యను కళ్ళారా చూసిన మృతుడు ఐదేళ్ల కొడుకు చెబుతున్న మాటలు విని, పోలీసులు కూడా వేదనకు గురయ్యారు. ఇదిలాఉండగా, ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
"ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని సీఐ సాయి ప్రసాద్ చెప్పారు.
Next Story

