
శ్రీనివాసా ఏమిటి ఈ ఘోరం.. లారీని ఢీకొన్న కారు..
పలమనేరు వద్ద ప్రమాదం. ఐదుగురు బెంగళూరు యాత్రికుల మృతి.
తిరుమల శ్రీవారి దర్శనానికి కారులో బయలుదేరిన కర్ణాటక యాత్రికులు ఐదుగురు మరణించారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. కారు లారీ కిందికి దూసుకుని పోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
బెంగళూరు నగరం రాజాజీనగర్ కు చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి మంగళవారం ఉదయం కారులో బయలుదేరింది. ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ ఆ బృందం ఉన్న కారు జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. ఆంధ్ర సరిహద్దులోకి ప్రవేశించిన తర్వాత గంగవరం మండలం కూడలి వద్ద రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొంది. లారీకి వెనుక వైపు బోనెట్ దూసుకుపోయింది. వేకువజామున బయలుదేరడం వల్ల కారు నడుపుతున్న వ్యక్తి కునుకుపాటు వల్ల జరిగిన ఏమరపాటు వల్ల ప్రమాదానికి గురైనట్లు తెలిసింది.
విలవిలలాడిన ప్రాణాలు..
మృతులంతా ఓకే కుటుంబం
ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించినట్లు గుర్తించారు. వారిని బయటకు తీసిన తర్వాత మరణించిన వారిలో మోహన్ దాస్ (71), నాగరాజరావు (61), కుసుమ (61), జయంతి (59), పూజ (33) ఉన్నట్లు గుర్తించారు.

