ఒంటిమిట్టలో మోగనున్న శ్రీసీతారాముల కల్యాణవీణ...
x

ఒంటిమిట్టలో మోగనున్న శ్రీసీతారాముల కల్యాణవీణ...

మత్యాలు, కంకణాలు, తలంబ్రాలతో 1.60 లక్షల పాకెట్లు సిద్ధం చేసిన శ్రీవారి సేవకులు.


శ్రీరామనవమి వేడుక నేపథ్యంలో శుక్రవారం ఒంటిమిట్ట కోదండరామాలయం యాత్రికులతో కిటకిటలాడుతోంది. ఏప్రిల్ ఒకటో తేదీ సీతారాములవారి కల్యాణ వేడుక ఘనంగా నిర్వహించడానికి టీటీడీ యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 25 వ తేదీ హరిద్రా ఘటనంతో దంచిన పసుపు శ్రీకోదండరాముడి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. కల్యాణ ఘట్టానికి అవసరమైన అక్షింతలు ( Sacred Rice) శుక్రవారం సిద్ధం చేశారు.

ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోనే ఓ విశాలమైన గదిలో సుమారు రెండు వందల మంది
శ్రీవారి సేవకులను
టీటీడీ సమాచార విభాగం అధికారులు సిద్ధం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లోగో, శ్రీవారి చిత్రంతో తయారు చేసిన కవర్లలో అక్షింతలు, పసుపుదారం కంకణాలు నింపడంలో శ్రీవారి సేవకులు ఉత్సాహంగా పనిచేశారు.
'ఏప్రిల్ ఒకటో తేదీ నిర్వహించే సీతారాములవారి కల్యాణోత్సవం అనంతరం యాత్రికులకు పంపిణీ చేయడానికి 1.60 లక్షల అక్షింతలు, కంకణాల పాకెట్లు సిద్ధం చేస్తున్నాం" అని టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర చెప్పారు.

ఏప్రిల్ ఒకటో తేదీ సీతారాముల కల్యాణానికి హాజరయ్యే యాత్రికులకు ఈ అక్షింతల, కంకణాల కవర్లు అందించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ ఈఓ ఏ. ప్రశాంతి తెలిపారు.
సీతారాముల కల్యాణోత్సవంలో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను శ్రీవారి సేవకులు సిద్ధం చేశారు. ముందుగా శ్రీకోదండరామాలయంలో ముత్యాలు, కంకణాలు, అక్షింతలకు పూజలు చేశారు. ఊరేగింపుగా కల్యాణ వేదికకు సమీపంలో పీఏసీ వద్దకు తీసుకుని వచ్చారు. ఈ ప్యాకెట్లలో ఓ ముత్యం, కంకణం తోపాటు అక్షింతలు కూడా ఉంచడం ద్వారా ప్యాకింగ్ చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా యాత్రికులకు సేవల కోసం అందించడానికి 600 మంది శ్రీవారి సేవకులను ఒంటిమిట్టలో అందుబాటులో ఉంచారు. భారీ పాత్రలో ప్లాస్టిక్ కవరు పరిచారు. అందులో వేసిన బియ్యంలో పసుపు కలపడం ద్వారా అక్షింతలు సిద్ధం చేయడానికి శ్రీవారి సేవకులు పోటీ పడ్డారు.

"ఒంటిమిట్టలో కల్యాణోత్సవం అనంతరం యాత్రికులకు అక్షింతలు ప్రసాదంగా అందించడానికి ఏర్పాట్లు చేశాం. 500 శ్రీవారిసేవకులు సిద్ధంగా ఉంచాం" అని టీటీడీ చీఫ్ పీఆర్ఓ తలారి రవి చెప్పారు. శ్రీరామనవమితో పాటు బ్రహ్మోత్సవాల్లో సేవలు అందించడానికి 600 మంది శ్రీవారి సేవకులు ఒంటిమిట్టకు చేరుకున్నారని వారిని పీఆర్ఓ కుమారి నీలిమ, ఏపీఆర్ఓ వెంకటరత్నం సమన్వయం చేస్తున్నారు.

విస్తృతంగా అన్నప్రసాదాల పంపిణీ..

శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాలను తిరుమల శ్రీవారికి ఏమాత్రం తీసిపోకుండా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీ ఒంటిమిట్ట వద్ద సుమారు మూడుపూటలా అన్నప్రసాదాలు వడ్డించడానికి ఏర్పాట్లు చేశారు.

"తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాల వితరణ సేవలు ఒంటిమిట్టకు విస్తరించాం. ఆలయం వెయ్యి మందికి రోజూ అన్నప్రసాదాలు వడ్డించే ఏర్పాట్లు చేశాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీకోదండరాముడి ఆలయం యాత్రికులతో రద్దీగా మారింది.

తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ప్రత్యేకంగా బారికేడింగ్ ఏర్పాటు చేసింది. వేసవికాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేయించారు.
ఒంటిమిట్ట కోదండరాముడి దర్శనానికి వచ్చిన యాత్రికులకు టీటీడీ అధికారులు శుక్రవారం కూడా అన్నప్రసాదాలు వడ్డించారు. దాదాపు వందమంది శ్రీవారి సేవకులు యాత్రికులకు అన్నం, పచ్చడి, వేపుడు, సాంబారు, రసంతో పాటు మంచినీరు, మజ్జిగ నిరంతరాయంగా వడ్డించారు.


Read More
Next Story