ఆంధ్రా భద్రాద్రి:ఏప్రిల్ 1న సీఎం పట్టువస్త్రాల సమర్పణ
x

ఆంధ్రా భద్రాద్రి:ఏప్రిల్ 1న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద ముమ్మర ఏర్పాట్లు.


ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి కల్యాణోత్సవం ఏప్రిల్ ఒకటో తేదీ నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీ సీతారాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 26వ తేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒంటిమిట్టలో గత ఏడాది తరహాలోనే ఉత్సవాలు విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్

ఒంటిమిట్టలో శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయడానికి కడప జిల్లా యంత్రాంగంతో కలిసి టీటీడీ అధికారులు పనిచేస్తున్నారు. ఒంటిమిట్ట టిటిడి అతిథి గృహంలో టిటిడి జేఈఓ వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, కడప జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, టిటిడి చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, ఎస్ ఈలు మనోహరం, వేంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓలు రాజేంద్రకుమార్, సెల్వం, శివప్రసాద్, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శ్రీ జి ఎల్ ఎన్ శాస్త్రి, అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్ష అనంతరం కడప కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు.
"మార్చి 26వ తేదీ ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ, మార్చి 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఏప్రిల్ ఒకటిన జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారు" అని చెప్పారు.

యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు

మాట్లాడుతున్న టీటీడీ జేీఈఒ వి. వీరబ్రహ్మం

రాష్ట్ర విభజన తరువాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత టీటీడీ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యాత్రికులకు తిరుమల తరహాలో నిత్యాన్ననదాన పథకం విస్తరించడంతో పాటు కల్యాణమండపం, అతిథి గృహాలను కూడా ఏర్పాటు చేసింది.
ఒంటిమిట్టలో శ్రీరామనవమిని అత్యతం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం తెలిపారు. యాత్రికుల రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, గ్యాలరీలు, పార్కింగ్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్ల ఏర్పాటు తోపాటు టీటీడీ ద్వారా తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, వైద్య సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆలయ గ్యాలరీల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం తోపాటు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, తిరుమల ఆలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా పుష్పాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఒంటిమిట్టలో ఏప్రిల్ ఒకటో తేదీ శ్రీసీతారాముల కల్యాణోత్సవం తరువాత యాత్రికులకు తలంబ్రాలు పంపిణీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గత నెలలో నిర్వహించిన సమావేశంలో టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం అధికారులకు సూచనలు చేశారు. అన్న‌ప్ర‌సాదాల పంపిణీకి 17 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ప్రవేశ, నిష్క్రమణ గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read More
Next Story