తిరుమల శ్రీవారికి ఇచ్చినట్లే శ్రీకోదండరాముడికి అటవీశాఖ దర్భ, చాప సమర్పించింది. రామయ్య కల్యాణోెత్సవానికి అలంబ్రాలు కూడా శుక్రవారం సిద్ధం చేశారు.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో శుక్రవారం రాష్ట్ర పండుగకు టీటీడీ వేదపండితులు నాంది పలికారు. శ్రీరామనవమి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. శ్రీరామనవమి వేడుక శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు సీతారామ, లక్షణుల మూలమూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను కంకణ భట్టర్ రాజేష్ తోపాటు, వేదపండితులు తిరుమల ఆలయ తరహాలోనే శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ చేశారు.
ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ఆంజనేయుడి చిత్రం వేసిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగుర వేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ డిప్యూటీ ఈఓ ఏ. ప్రశాంతి, ఏఈఓ బాలరాజు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆ తరువాత ఆలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు పోతన జయంతి కార్యక్రమం, కవి సమ్మేళనం జరుగనుంది. రాత్రి ఏడు నుంచి 9 గంటల వరకు శేషవాహనంపై అధిరోహించే సీతారామ, లక్ష్మణులు యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు.
తిరుమల తరహాలోనే ...
తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడంలో టీటీడీతో పాటు ఒకో ప్రభుత్వ శాఖ ఒకో బాధ్యత నిర్వహిస్తుంది. అందులో అటవీశాఖకు ప్రత్యేక ప్రాధాన్యతి ఉంది. ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఎగురవేయడానికి తాడుతో పాటు దర్బచాపలు శ్రీవారికి కానుకగా సమర్పించడం ఆనవాయితీ. అదే పద్ధతిలో..
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయానికి కూడా టీటీడీ అటవీవిభాగం అధికారులు, సిబ్బంది తిరుమల తరహా ఆచారాన్ని పాటించారు. పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన దర్భ మత్తు, తాడు బుధవారం మేళతాళాల మధ్య తీసుకుని వెళ్లి, ఆలయ అధికారులకు సమర్పించారు. టీటీడీ అటవీశాఖ అధికారులు ఈ పవిత్ర దర్భను ఆలయ అధికారులకు అందజేశారు.
విష్ణు దర్భ ప్రాధాన్యం
టీటీడీ అటవీశాఖ సిబ్బంది ప్రత్యేకంగా తయారు చేసిన సుమారు 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు కలిగిన దర్భ మత్తు (సుమారు 60 కిలోల బరువు)తో పాటు 225 మీటర్ల పొడవు గల దర్భ తాడును ప్రతి సంవత్సరం ధ్వజారోహణ కార్యక్రమంలో వినియోగిస్తారు. ఈ పవిత్ర విష్ణు దర్భను శుద్ధి చేసి ఎండబెట్టి ధ్వజస్తంభానికి చుడతారు. ఈ తాడుతో గరుడ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని సూచిస్తారు. ఈ పవిత్ర గడ్డి శుద్ధి లక్షణాలతో పాటు సూక్ష్మజీవులను నిరోధించే గుణాలు కలిగి ఉందని విశ్వసిస్తారు.
తయారీ విధానం
టీటీడీ అటవీశాఖ సిబ్బంది ఏర్పేడు సమీపంలోని చెల్లూరు గ్రామ పరిసర ప్రాంతాల నుంచి ఈ దర్భను సేకరిస్తారు. అనంతరం వారం రోజుల పాటు ఎండబెట్టి, సుమారు నెలరోజుల పాటు భక్తి శ్రద్ధలతో దర్భ మత్తు, తాడును తయారు చేశారు. మూడు రోజుల కిందట సమర్పించిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ డాక్టర్ ఏవిఎన్. శివకుమార్, డీఎఫ్‌ఓ శ్రీ విజయ్‌కుమార్, డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
హరిద్రా ఘటనంతో శ్రీకారం.. అక్షింతలు సిద్ధం..
ఇదే సమయంలో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవ వేడుకలకు హరిద్రా ఘటనం (పసుపు దంచే కార్యక్రమం) తో మూడు రోజుల కిందటే శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ ఒకటో తేదీ సీతారాములవారి కల్యాణం వేడుకగా నిర్వహించడానికి అవసరమైన తలంబ్రాలు కూడా శుక్రవారం సిద్ధం చేశారు. చేతితో వలిచిన వడ్లగింజల్లో పసుపు కలిపడం ద్వారా అక్షింతలు తయారు చేయడానికి శ్రీవవారిసేవకులు, టీటీడి అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.