శ్రీరామనవమి ఉత్సవాలకు కడప జిల్లా ఒంటిమిట్ట సిద్ధమైంది. శ్రీవారి ఆలయాన్ని తలపించే రీతిలో ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని టీటీడీ అధికారులు అలంకరణతో తీర్చిదిద్దారు. ఆయోధ్య బాలరాముడి ఆలయాన్ని పోలిన కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. దీంతో ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాల కళ ఉట్టిపడుతోంది.
ఒంటిమిట్ట ఆలయం, పరిసరాల్లో రామాయణ ఘట్టాలను కళ్లముందు ఆవిష్కరించారు. విద్యుద్దీపాలతో తయారు చేసిన ఈ కటౌట్లు సిద్ధం చేయడంలో టీటీడీ విద్యుత్ విభాగం సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రామాయణంలోని పర్వాలు చదవని వారికి ఇక్కడ ఏర్పాటు చేసిన దేవతామూర్తుల కటౌట్ల ద్వారా సీతా, రామ, లక్షణుల రామాయణ చరిత్ర, కల్యాణం, వనవాసం చరిత్రను కళ్లముందు ఉంచారు.
తిరుమల శ్రీవారి క్షేత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా శ్రీకోదండరామాలయాన్ని టీటీడీ అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కడప నుంచి తిరుపతికి వచ్చే మార్గంలో జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఒంటిమిట్ట చారిత్రక ఆలయాన్ని టీటీడీ అధికారులు దేదీప్యమానంగా మార్చారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతికి పెద్దపండగ లాంటిది. ఒంటిమిట్లలో కూడా అదే పరిస్థితి కల్పించారు. ఆలయాన్ని విద్యుద్దీపాల అలంకరణలో ధగధగమెరిసిపోతోంది. దేవాతామూర్తుల కటౌట్లను టీటీడీ ఎలక్ట్రికల్ విభాగం అధికారులు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తలిపించే రీతిలోనే శ్రీకొదండరాముడి ఆలయాన్ని కూడా ముస్తాబు చేయడానికి టీటీడీ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. టీటీడీ ఉద్యానవన శాఖ, విద్యుత్ విభాగం తోపాటు మిగలిన శాఖలు కూడా ఒంటిమిట్టపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి.
ఒంటిమిట్ట ఆలయం వద్ద మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో భాగంగా పరిసరాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో టీటీడీ తిరుపతి జేఈఓ వి. వీరబ్రహ్మం గత పది రోజుల నుంచి ఇక్కడ ప్రధానంగా దృష్టి సారించారు. ఆ తరువాత టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఆ తరువాత అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, జిల్లా అధికారులతో వరుసగా సమీక్షలు సాగించారు.
"శ్రీకోదండరాముడి కల్యాణోత్సవానికి వచ్చే యాత్రికులకు రూ. 50 లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఈపాటికే చెప్పారు. భారీగా వచ్చే యాత్రికులు స్వామివారి కల్యాణోత్సవం చూసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.
శ్రీరామనవమి నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఆయోధ్యలోని బాలరాముడి నమూనా ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఒంటిమిట్టకు బ్రహ్మోత్సవ కళ..
శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం (27వ తేదీ) ధ్వజారోహణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయాన్ని దాదాపు పది టన్నులకు పైగానే పుష్పాలు, పత్రాలతో సుందరంగా అలంకరించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని దేవతా మూర్తుల కటౌట్లతో తీర్చిదిద్దారు. సీతారామలక్షణుల రంగురంగుల విద్యుద్దీపాలతో కర్నూలు, తిరుపతి జాతీయ రహదారి, ఒంటిమిట్ట కళకళలాడుతోంది.
గోవుల మధ్య రాధాకృష్ణుల ఆనందకేళీ..
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వద్ద ఉత్సవాలను ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ శ్రీరాముడి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
రామాయణ ఘట్టాలు...
ఒంటిమిట్ట రామాలయం వద్ద రామాయణ ఘట్టాలు చరిత్రను వివరిస్తున్నాయి. సీతా,రామ, లక్షణులు వనవాసం వెళ్లిన దృశ్యాలు కళ్లముందు కదలేడాలే ఇక్కడి అలంకరణలు ఆకట్టకుంటున్నాయి. రాముడుకి శబరి పండ్లు ఇచ్చే సన్నివేశం కూడా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఒంటిమిట్టకు వస్తే, రామాయణ ఘట్టాలు చదివినంత సులువుగా ఉంటుందని ఈ చిత్రరువులు ఏర్పాటు చేసిన టీటీడీ విద్యుత్ విభాగం సిబ్బంది, అధికారులు చెబుతున్నారు.