ఒంటిమిట్ట:శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాలకు సమీపించిన ఘడియలు..
x

ఒంటిమిట్ట:శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాలకు సమీపించిన ఘడియలు..

హరిద్రా ఘటనంతో కల్యాణోత్సవానికి ఈ రోజు శ్రీకారం..


కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండగ నిర్వహణకు టీటీడీ ( TTD ) అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు (25వ తేదీ) శ్రీసీతారాముల వారికల్యాణ మహోత్సవాలు 'హరిధ్రా ఘటనం' (Turmeric Pounding Ceremony ) లాంఛనంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

హరిధ్రా ఘటనం' పసుపుకొమ్ములు దంచడం ద్వారా పసుపు పొడి సిద్ధం చేస్తారు. ఈ పసుపును ఉత్సవమూర్తలకు ఏప్రిల్ ఒకటో తేదీ నిర్వహించే కల్యాణోత్సవంలో తలంబ్రాల్లో పసుపు కలపడం ఆనవాయితీగా మార్చారు. ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత కొత్తగా టీటీడీ 2024 ఉత్సవాల నుంచి హరిద్రా ఘటనం కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఒంటిమిట్ట వద్ద ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయంగా హరిద్రా ఘటనం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

శ్రీరామనవమి ఉత్సవాలు ఇలా...

ఒంటిమిట్ట ఆలయం వద్ద ఈ నెల 16వ తేదీ బ్రహ్మోత్సవాలకు టీటీడీ వేదపండితులు, స్థానిక ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. 27వ తేదీ ఉదయం 9.30గంటల నుంచి 10.15 గంట‌ల మధ్య వృష‌భ‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం నాలుగు గంటల నుంచి బమ్మెర పోతన జయంతి, కవి సమ్మేళనం నిర్వహణకు టీటీడీ కార్యక్రమాలు ఖరారు చేసింది.
27వ తేదీ రాత్రి సీతారాములవారు శేషవాహనంపై విహరిస్తూ, యాత్రికులకు దర్శనం ఇస్తారు.
28వ తేదీ : ఉదయం వేణుగాన అలంకారం
రాత్రి హంసవాహనం
29వ తేదీ : ఉదయం– వటపత్రశాయి అలంకాంరం
రాత్రి – సింహ వాహనం
230వ తేదీ : ఉదయం – నవనీత కృష్ణాలంకారం
రాత్రి – హనుమంత వాహనం
31వ తేదీ : ఉదయం – మోహినీ అలంకారం
రాత్రి – గరుడసేవ
ఏప్రిల్ ఒకటో తేదీ : ఉదయం – శివధనుర్భాణ అలంకరణ
మధ్యాహ్నం 3.15 గంటలకు కాంతకోరిక, ఎదుర్కోలు ఉత్సవం
సాయంత్రం 6.30 గంటల నుంచి 08.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం
రాత్రి – గజవాహనం
ఏప్రిల్ రెండో తేదీ : ఉదయం – రథోత్సవం
ఏప్రిల్ మూడో తేదీ : ఉదయం – కాళీయమర్ధనాలంకారం
రాత్రి – అశ్వవాహనం
ఏప్రిల్ నాల్గ తేదీ : ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణంతో శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఐదో తేదీ ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు.

చరిత్రలో వెనక్కి వెళితే..

ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగేవి. శ్రీరాములవారి పట్టాభిషేకం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం, ముత్యాలు అందించడం ఆనవాయితీ. రాష్ట్ర విభజన తరువాత కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని ఆంధ్రా భద్రాద్రిగా ప్రకటించారు. ఏకశిలా నగరంగా ఒంటిమిట్టకు చరిత్రలో స్థానం ఉంది. ఇక్కడి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కొలువైన సీత, రామ, లక్ష్మణులు ఒకే శిలపై కొలువై ఉంటారు.

నేపథ్యం..

కడప నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో చెన్నై జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి ఆలయాన్ని 16వ శతాబ్దంలో చోళ, విజయనగర రాజుల కాలంలో నిర్మించారు. ఒంటిమిట్టలో నివసించిన బమ్మెర పోతన మహా భాగవతాన్ని తెలుగు భాషలో రచించి రాములవారికి అంకితం ఇచ్చారు. "ఆంధ్ర వాల్మీకి అని పిలవబడే వావిలికొలను సుబ్బారావు ఈ రాముడిని పూజిస్తూ కాలం సాగించారు. ఆయన వాల్మీకి రామాయణాన్ని (రాముని కథను వివరించే హిందూ ఇతిహాసం) తెలుగులోకి అనువదించారు. అందుకే ఆయనను ఆంధ్ర వాల్మీకి అని పిలుస్తారు.
ఒంటిమిట్ట రామాలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అద్భుతమైన శిలా సంపదకు నిలయం. రామలక్ష్మణుల శిల్పాలు స్తంభాలపై ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఆలయానికి ప్రతి మూల ఉన్న స్తంభాలపై అప్సరసలు, దేవతల చిత్రాలతో చెక్కిన శిల్పాలు కనువిందు చేస్తాయి.

హరిద్రా ఘటనం అంటే..

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం దాదాపు 11 ఏళ్ల కిందట 2015 ఏప్రిల్ 30వ తేదీ టిటిడి పరిధిలోకి చేరింది. ఈ ఆలయంలో కళ్యాణోత్సవానికి టీటీడీ ఓ కొత్త కార్యక్రమానికి నాంది పలికింది. కళ్యాణోత్సవం నిర్వహించడానికి ముందు హరిద్రా ఘటనతో బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హరిద్రా ఘటనం అంటే... హరిద్ర అంటే పసుపు. ఘటనం అంటే నూర్పిడి. ఈ కార్యక్రమంలో మూడు కిలోల పసుపు వేర్లు దంచడం.
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉద‌యం గర్భాలయంలోల పసుపు కొమ్ములు, రోళ్ళు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. అనంత‌రం పెద్ద సంఖ్య‌లో మహిళా భక్తులు పసుపు కొమ్ములను పోసి సాంప్రదాయ బద్దంగా రోలులో దంచ‌నున్నారు. ఈ కార్యక్రమంద్వారా శ్రీసీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభ‌మ‌వుతాయి.

తిరుమంజనం

ఒంటిమిట్ట కోదండరామాలయం వద్ద ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవాల ప్రారంభానికి ముందు మంగళవారం టీటీడీ అధికారులు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. గర్భాలయం, శ్రీఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ప్రశాంతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story