ఏప్రిల్1 సీతారాముల కల్యాణం. 85 వేల లడ్డూల పంపిణీ..
x

ఏప్రిల్1 సీతారాముల కల్యాణం. 85 వేల లడ్డూల పంపిణీ..

ఒంటిమిట్ట కోదండరామాలయానికి తిరుమల నుంచి తరలించిన టీటీడీ అధికారులు.


ఒంటిమిట్ట శ్రీసీతారాముల‌ కల్యాణానికి తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలు సిద్ధం

ప్యాకింగ్‌లో పాల్గొన్న 300 మంది శ్రీవారి సేవకులు

యాత్రికులకు ముత్యం, అక్షింతలు, కంకణం కవర్లు సిద్ధం

కడప జిల్లా ఒంటిమిట్ట ఏకశిలానగరం ( The City of the Monolith ) ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం శ్రీకోదండరాముడి కల్యాణోత్సవానికి టీటీడీ యంత్రాంతం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు లక్ష మంది ఈ ఉత్సవానికి హాజరవుతారని టీటీడీ అంచనా వేస్తోంది.

కల్యాణోత్సవం తరువాత 85 వేలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు. తిరుమల నుంచి ఆ లడ్డూ ప్రసాదాలను ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్దకు ప్రత్యేక వాహనాల్లో చేర్చారు.
"తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ - 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ను ఆదివారం టీటీడీ ఒక బృహత్కార్యక్రమంగా నిర్వహించింది" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమల లడ్డులూ ప్యాకింగ్ చేయడానికి 300 మంది శ్రీవారి సేవకులు ఆదివారం సేవలు అందించారని సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు.

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద శ్రీరామనవమి నుంచి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకున్న తరువాత తిరుమలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆలయ అలంకరణ, వాహన సేవల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ రాములోరి కల్యాణోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే యాత్రికులకు రూ.50 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అందిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ..

"తిరుమలలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు 300 శ్రీవారి సేవకులు లడ్డూలు ప్యాకింగ్ చేయడంలో విస్తృతంగా సేవలు అందించారు" అని తిరుమల ఎస్టేట్స్ అధికారి, డిప్యూటీ ఈవో (పరకామణి ఇన్‌ఛార్జ్) వెంకటేశ్వర్లు చెప్పారు.
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ ఎం. రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు సుమారు 200 మంది మహిళా సేవకులు, 100 మంది పురుష సేవకులు కలిసి ఐదు గంటలపాటు అంకితభావంతో సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీవారి సేవా సదన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. లడ్డూల ప్యాకింగ్, లోడింగ్ చయడంతో పాటు ప్రత్యేక వాహనాలను ఒంటిమిట్టకు తరలించామని వెంకటేశ్వర్లు వివరించారు.

కల్యాణోత్సవ వేళ...


తిరుమల తరహాలోనే టీటీడీ యంత్రాంగం వాహనసేవలు ఉదయం, రాత్రి నిర్వహిస్తోంది. ఒంటిమిట్టలో సీతారాముల వారి కల్యాణోత్సవం నిర్వహించడానికి అంగరంగ వైభవంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. కల్యాణోత్సవం తరువాత 85 వేల మందికి రూ. 50 విలువైన తిరుమల శ్రీవారి చిన్న లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేయడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

కోదండరాముడి కల్యాణోత్సవానికి హాజరయ్యే యాత్రికులకు కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ ముత్యం, అక్షింతలు, కంకణం (పసుపు దారం) ఉన్న కవర్ అందించడానికి కూడా టీటీడీ సిద్ధం చేసింది. రెండు రోజుల కిందట 500 మంది శ్రీవారి సేవకులు అక్షింతలు తయారు చేయడం, కవర్ లో నింపే కార్యక్రమాలను పూర్తి చేశారు.

ఒంటిమిట్టపై ఫోకస్


ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద కడప జిల్లా అధికారులను సమన్వయం చేసుకున్న టీటీడీ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం ఒంటిమిట్టలో నిర్వహించే సీతా సమేత కోదండరాముడి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీనికి తగినట్లుగా కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, రాజంపేట సబ్ కలెక్టర్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ సేవలు...

ఒంటిమిట్ట ఆలయం వద్ద టీటీడీ అధికారులు యాత్రికుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 14వ తేదీ తిరుమల తరహాలోనే నిత్యాన్నదాన పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.
"రోజూ మూడు పూటలా అన్నప్రసాదాలు నిరంతరాయంగా అందించడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ యాత్రికులకు రోజూ వెయ్యి నుంచి 1,500 మందికి అన్నం, పప్పు, పచ్చడి, సాంబారు, రసం, మజ్జిగ అందిస్తున్నారు.
శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాత్రికుల సంఖ్య గణనీయంగా ఉందని ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈఓ ఏ. ప్రశాంతి తెలిపారు. అన్నదానం, శ్రీవారి యాత్రికుల ద్వారా కొరత లేకుండా అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు ప్రశాంతి తెలిపారు.
Read More
Next Story