
తిరుపతి వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి
నిర్మలమ్మ బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణకు ఓ అద్దం..
గ్రామీణ భారతంపై సీతకన్న వేశారన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి
ఇంటిని చక్కదిద్దనట్టే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అభినందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఎంఎన్‌ఆర్‌ఈజీఏ, జల్ జీవన్ మిషన్, ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలకు కేటాయింపులు గణనీయంగా తగ్గడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంటులో 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి స్పందించారు.
"ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీకి ఆర్థిక లోటును 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించి, 2026–27లో దాన్ని 4.3 శాతానికి పరిమితం చేయాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయం" అని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అభినందించారు.
"మూలధన వ్యయానికి 2026–27లో రూ.12.21 లక్షల కోట్లను కేటాయించడం అభివృద్ధికి దోహదపడే చర్యగా భావిస్తున్నాను. ఖర్చులు పెంచినా ఆర్థిక లోటుపై నియంత్రణ కొనసాగించడం అభినందనీయం" అని ఎంపీ గురుమూర్తి అన్నారు.
ఆందోళ కరం..
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లోగ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అంశాలకు నిధులు తగ్గించడం ఆందోళన కలిగించే విధంగా ఉందని ఎంపీ గురుమూర్తి అన్నారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ, జల్ జీవన్ మిషన్, ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలకు కేటాయింపులు గణనీయంగా తగ్గడం గ్రామీణ ప్రాంత ప్రజలకు కష్టాలు తప్పేలా వేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏకు 2025–26లో ఖర్చవుతుందని అంచనా వేసిన రూ.88 వేల కోట్లను 2026–27లో కేవలం రూ.30 వేల కోట్లకు తగ్గించడం ద్వారా రాష్ట్రాలపై భారాన్ని మోపినట్టు ఉందిన ఆయన అభిప్రాయపడ్డారు. జల్ జీవన్ మిషన్‌కు 2025–26లో బడ్జెట్ చేసిన రూ.67 వేల కోట్లలో వాస్తవంగా ఖర్చయ్యే అంచనా రూ.17 వేల కోట్లకే పరిమితం కావడం, పీఎంజీఎస్‌వై కేటాయింపులు కూడా తగ్గడం వల్ల గ్రామీణ ఉపాధి, మౌలిక వసతులు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన విశ్లేషించారు.
పోలవరంపై భారమే..
పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి 41.15 మీటర్ల ఎంఢిడిఎల్ వరకు పూర్తి చేయడానికి 2026–27లో రూ.3,320.39 కోట్లను కేటాయించారని ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు. మొత్తం సవరించిన వ్యయం రూ.30,436.95 కోట్లు ఉండగా కేంద్ర గ్రాంటును రూ.12,157.53 కోట్లకే పరిమితం చేయడం రాష్ట్రంపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అప్పు–జీడీపీ నిష్పత్తిని 2030–31 నాటికి 50 శాతానికి తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అభినందనీయం అని ఆయన సమర్థించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పాలనలో అప్పులు విపరీతంగా పెరిగి తరతరాలపై భారంగా మారుతున్నాయన్నారు. ఏపీఎండీసీ, ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా జరుగుతున్న ఆఫ్ బడ్జెట్ అప్పులు కాగ్ అభిప్రాయాలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర అప్పు పరిమితులు తగ్గకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై కఠినంగా పర్యవేక్షణ చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అధిక అప్పుల కారణంగా రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాలు మళ్లీ పునరావృతం కాకుండా స్పష్టమైన, దృఢమైన చర్యలు అవసరం అని ఆయన సూచించారు.
Next Story

