
ఫ్యాక్షన్ హత్య కేసు:12 మందికి జీవిత ఖైదు...
నంద్యాల కోర్టు సంచలన తీర్పు.
నంద్యాల జిల్లా కోర్టు సోమవారం సంచలనం తీర్పు వెలువరించింది. ఫ్యాక్షన్ హత్యకు గురైన వైసీపీ నేతతో పాటు మరో ముగ్గురి కేసులో 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ, నంద్యాల జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో ఫ్యాక్షన్ పోరు వల్ల ఇంజేడు కృష్ణారెడ్డి, ఆయన భార్య, కొడుకు, అనుచరుడిని 2012 ఫిబ్రవరి 22వ తేదీ హత్య చేశారు. ఈ కేసులో 19 మంది నిందితులు ఉన్నారు. సుదీర్ఘంగా 14 సంవత్సరాల పాటు విచారణ జరింగింది. కేసు విచారణలో ఉండగానే నిందితుల్లో ఏడుగురు మరణించారు. మిగతా 12 మందిపై నేరారోపణ నిరూపణ కావడంతో జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.
ఈ కేసుకు సంబంధిచిన వివరాల్లోకి వెళితే..
ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఇంజేడు కృష్ణారెడ్డి వైసీపీ మద్దతుదారుడు. ప్రత్యర్థి వర్గంతో ఆయనకు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయనేది సమాచారం. 2012 ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి ప్రత్యర్థులు ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారనేది ఆరోపణ. విద్యుత్ వైర్లు కట్ చేసిన ప్రత్యర్థులు, ఓ వాహనంతో గేటును ఢీకొట్టి ఇంటిలోకి చొరబడ్డారు. వేటకొడవళ్లతో ఇంజేడు కృష్ణారెడ్డి తోపాటు ఆయన కొడుకు, భార్య, అనుచరుడిని నరికి చంపారు.
సంచలనం రేకెత్తించిన హత్యలు
రాయలసీమ జిల్లాల్లో చాలా వరకు ఫ్యాక్షన్ భూతం కనుమరుగైనా, ఆళ్లగడ్డలో మాత్రం ప్రత్యర్థుల మధ్య కక్ష్యలు రగులుతూనే ఉన్నాయి. ఆ కోవలోనే 2012లో చింతకుంట గ్రామంలో ఇంజేడు కృష్ణారెడ్డి, ఆయన కుటుంబీకుల హత్య ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గినట్లు కనిపిస్తున్న వాతావరణంలో కృష్ణారెడ్డి, కుటుంబీకుల హత్య ఘటన కలకలం రేపింది. మళ్లీ, పాత పగలు తెరపైకి వస్తున్నాయనే ఆందోళన కనిపించింది. ఆ తరువాత వాతావరణం ప్రశాంతంగానే ఉంది. చదుకునే వారు ఎక్కువ కావడం, ఉపాధి అవకాశాలు పెరగడం, వ్యవసాయ పనుల కారణంగా నాయకులకు అనుచరులుగా ఉన్న పాత పగలకు సామాన్యులు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో 12 మందికి యావజ్జీవశిక్ష పడడం కూడా ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Next Story

