Courtesy AI
x

మదనపల్లె మున్సిపాలిటీ: వైసీపీ ముందస్తు వ్యూహం. కూటమిలో పీటముడి!

విధేయతకు పెద్దపీట వేస్తూ.. జింకా చలపతికి చైర్మన్ పీఠం. పెద్దిరెడ్డి మార్కు రాజకీయం.


స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంలో వైసీపీ జోరు ప్రదర్శిస్తోంది. టీడీపీ కూటమిలో మూడు పార్టీల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఈ స్థితిలో తమ అభ్యర్థులను రంగంలోకి దించడంలో మాత్రం వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి సవాల్ గానే మారుతున్నాయి.

రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో (అన్నమయ్య) మున్సిపాలిటీలో మదనపల్లె కూడా కీలకమైందే. ఇక్కడ విధేయత, సీనియారిటీలో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైచేయి సాధించారు. విధేయత, సీనియారిటీకి పెద్దపీట వేస్తూ వైసీపీ మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జింకా వెంకట చలపతి పేరు ఖరారు చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు నగర పాలక సంస్థలు, శ్రీకాళహస్తి, మదనపల్లె ఏ గ్రేడ్ మున్సిపాలిటీలు కీలకమైనవి. ఇక్కడ కాపు సామాజికవర్గం నేతలు, ఓటర్ల సంఖ్య పరంగా ఎక్కువ.
మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీకి ఎంపిక చేసిన జింకా వెంకట చలపతి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన జింకా చలపతి కమ్మ సామాజికవర్గంలో కూడా మంచి ఆదరణ ఉంది. ఆయన భార్య కమ్మ సామాజికవర్గం కావడం వల్ల ఇది ఆయనకు కలిసివచ్చే అంశం.
వివాదరహితుడిగా పేరు ఉన్న జింకా చలపతి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విధేయుడు. ఆయన గతంలో డీసీసీ అధికార ప్రతినిధిగా అవకాశం దక్కింది. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మదనపల్లె మున్సిపల్ కౌన్సిలర్ గా విజయం సాధించారు.
2012 స్థానిక సంస్థల ఎన్నికల్లో జింకా వెంకట చలపతి తోపాటు ఆయన భార్య రాణి కూడా కౌన్సిలర్ గా విజయం సాధించారు. మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ గా రాణికి అవకాశం కల్పించడంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన పాత్ర.
దాదాపు 20 ఏళ్లకు పైగానే పెద్దిరెడ్డితో ఉన్న అనుబంధం, విధేయతకు పెద్దపీట వేస్తూ, జింకా చలపతికి అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది.

మదనపల్లె ఓటర్లు

మదనపల్లె పట్టణం చల్లదనంతో పాటు రాజకీయంగా ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. ఈ పట్టణంలో 1,16,958 మంది ఓటర్లు ఉంటే, అందులో పురుషులు 56,862 మంది, మహిళలు 60,083 ఉన్నట్లు అంచనా. స్థానిక జనాభా, సర్వే అంచనాల ప్రకారం పట్టణంలో బీసీ ఓటర్ల సంఖ్య 67,254 మంది వరకు ఉన్నట్లు సమాచారం.ఈ ఇక్కడ బలిజ సామాజికవర్గం కీలకమైంది. పట్టణంలో 19 వేల నుంచి 20 వేల మంది వరకు ఉంటారనేది ఓ అంచనా. ముస్లింలోది రెండో పెద్ద సామాజికవర్గం. పట్టణంలో 25 వేల నుంచి 30 వేల మంది వరకు ఉంటారు. రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, ఇతర అగ్రవర్ణ ఓటర్ల సంఖ్య దాదాపు 20 వేలకు పైబడి ఉంటుంది.

కూటమి అభ్యర్థి ఎంపికలో అనిశ్చితి?

మదనపల్లె నుంచి టీడీపీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ జనసేన ప్రభావం ఎక్కువే. బీజేపీ నుంచి కూడా ప్రభావితం చేసే నేతలు ఉన్నారు. ఇక్కడ మూడు పార్టీల నేతల మధ్య సఖ్యత అనేది చాలా తక్కువ. దీంతో బీసీ సామాజికవర్గం నేతను పోటీ చేయించాలా? ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇవ్వాలా? కాపు సామాజికవర్గం నుంచి ఎంపిక చేయాలనేది తేల్చుకోలేని స్థితిలో మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి ప్రధానంగా టీడీపీ, జనసేన నేతల మధ్య రెండు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ వైరుధ్యమే.
మదనపల్లెలో బీజేపీ కూడా చైర్మన్, వైస్ చైర్మన్ తోపాటు కౌన్సిలర్ల సీట్ల కోసం పట్టుబడుతోంది. జనసేన తామూ తక్కువ కాదనే స్థితిలో భీష్మిస్తున్నారు. దీంతో కూటమి అభ్యర్థిని నిర్ణయించడంలో పీటముడి పడినట్లు సమాచారం. ఇదే అదునుగా రాజకీయ పరిస్థితిని అంచనా వేసిన వైసీపీ ముందస్తుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడం ద్వారా సవాల్ విసిరిట్లు కనిపిస్తోంది. టీడీపీ నుంచి ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నేత, బీసీ సామాజికవర్గం నుంచి ఓ మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మదనపల్లె నియోజకవర్గం, పట్టణం సామాజికంగా, రాజకీయంగా కూడా కీలకమైందే. తాజా రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ కూటమి నుంచి ఎవరు చైర్మన్ పోటీకి దించుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story