
మదనపల్లె:ఇద్దరి ప్రాణం తీసిన ఊయల... పిల్లలు సేఫ్
తంబళ్లపల్లె సమీపంలోని ముదివేడు వద్ద విషాదం..
తిరునాళ్ల కావడంతో చుట్టపు చూపుగా వచ్చారు. ఊయలలో సరదాగా ఆడుకుంటున్న పిల్లలు కేకలు వేశారు. వారిని కాపాడేయత్నంలో అమ్మమ్మ, మరో యువకుడు విద్యుత్ షాక్ తో మరణించారు. 11 ఏళ్ల బాలిక గాయపడింది. ఈ సంఘటన మదనపల్లెకు సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం కురబాలకోట మండలంలోని రెడ్డివారిపల్లెలో ఆదివారం విషాదం నింపింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లాలో వేసవి కాలంలో జాతర (తిరునాళ్ల సంబరాలు) ప్రారంభం అవుతాయి. మదనపల్లెకు సమీపంలోని సీటీఎం వద్ద గత నెలలో నలవీర గంగాభవానీ జాతర జరిగింది. జిల్లాలో మొదలయ్యే జాతరలో ఇది మొదటిది. తంబళ్లపల్లె మండలం కురబాలకోట మండలంలోని ముదివేడు గంగమ్మ తిరునాళ్ల ప్రారంభమైంది. ఈ జాతరకు అనేక ప్రాంతాల తోపాటు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లిన వారు కూడా సొంతిళ్లు, బంధువుల ఇంటికి చేరుకున్నారు..
కూతురి ఇంటికి వచ్చి...
కురబలకోట మండలం రెడ్డివారిపల్లెలోని అన్ని ఇళ్లు కళకళలాడుతున్నాయి. పుంగనూరు సమీపంలోని చదళ్లపల్లెకు చెందిన పద్మావతి (50) కూడా రెడ్డివారిపల్లెలోని చిన్న కూతురు సునీత ఇంటికి వచ్చింది. చెల్లెలి ఇంటికి బెంగళూరులో ఉంటున్న అనిత, శివకుమార్ రెడ్డి దంపతులు మధుప్రియ (11), లిఖిత (9) కూతుర్లతో కలిసి వచ్చారు. బెంగళూరులో తమ ఇంటి పక్కన ఉన్న వెంకటేశును కూడా తిరునాళ్లకు తోడ్కొని వచ్చారు. అందరూ విందుభోజనాలతో సరదాగా గడుపుతున్నారు. ఈ ఇంటిలో మృత్యుదేవత పొంచి ఉందనే విషయం వారికి తెలియదు.
కరెంటు రూపంలో మృత్యువు...
రెడ్డివారిపల్లెలోని సునీత ఇంటిని రేకులతో నిర్మించుకున్నారు. ఆ ఇంటిలోనే ఆదివారం ఉదయం సునీత తో పాటు తల్లి, అక్కాబావ వారిపిల్లలతో సందడిగా ఉంది. సునీత అక్క కూతుర్లు మధుప్రియ, లిఖిత ఊయలలో ఊగుతూ అల్లరి చేస్తున్నారు. ఒక్కసారిగా వారి నోటి నుంచి కేకలు వినిపించడంతో ఉలిక్కిపడిన అమ్మమ్మ పద్మావతి పరుగున వెళ్లి ఊయల పట్టుకున్నదే ఆలస్యం కుప్పకూలింది. బెంగళూరు నుంచి అనిత దంపతులుతో కలిసి వచ్చిన వెంకటేసుకు ఏమి జరిగిందో అర్థం కాని స్థితిలో పరుగున వెళ్లి ఊయలను నిలపడానికి పట్టకుకోవబ ఆలస్యం కింద పడిపోయాడు. వారిద్దరికీ విద్యుత్ షాక్ తలడంతో ప్రాణాలు వదిలారని సమాచారం. నేలపై నిలబడి విద్యుత్ విద్యుత్ ప్రవహిస్తున్న విషయం తెలియక గొలుసు పట్టుకోవడంతో షాక్ తగిలి మరణించారని వారి కుటుంబీకుల ద్వారా తెలిసింది.
ఊయలలో కూర్చొన్న లిఖిత కింద పడిపోవడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. ఆ పాప అక్క మధుప్రియ (11) మాత్రం స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. పద్మావతి, వెంకటేసు మృతదేహాలను మదనపల్లె మార్చురీకి తరలించారు. గాయపడిని మధుప్రియకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

