
అమ్మా.. మేము ఏమి పాపం చేశాం? మాకెందుకీ శిక్ష...!
విద్యార్థితో కలిసి వివాహిత ఆత్మహత్య. ఇద్దరు పిల్లలను చేరదీసిన ప్రొద్దుటూరు పోలీసులు.
సహజీవనం చేస్తున్న విద్యార్థితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొద్దుటూరు పట్టణంలో శనివారం జరిగిన ఈ సంఘటనతో వివాహిత ఏడు, 11 ఏళ్ల వయసున్న కొడుకులు అనాథలుగా మిగిలారు. జరిగింది ఏమిటో అర్థం కాలేదు. తమను కాదని వెళ్లిపోయిన కూతురి మృతదేహాన్ని తీసుకునేందుకు తల్లిదండ్రలు ముందుకు రాలేదు. మూడు రోజులుగా మార్చురీలోనే ఉంది. ఆమె ఇద్దరు కొడుకులు దిక్కు తెలియని స్థితిలో తల్లడిల్లుతున్నారు. వారిని ప్రొద్దుటూరు పోలీసులు అక్కున చేర్చుకుని, ఓదార్చారు. కొత్త దుస్తులు కొనిచ్చిన పోలీసులు, ఆర్థికసాయం కూడా అందించి, ఆదివారం సాయంత్రం ఆ పిల్లలను అనాథ శరణాయానికి తరలించారు.
"ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత సంబంధీకులు ఎవరూ రాకుంటే, నిబంధనల ప్రకారం మున్సిపల్ సిబ్బంది ద్వారా ఖననం చేయిస్తాం" అని ప్రొద్దుటూరు సీఐ నాగభూషణం చెప్పారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఓ కాలనీలో మూడు రోజులుగా వేదనకు గురి చేసిన సంఘటన ఇది.
విద్యార్థితో సహజీవనం
కర్నూలు జిల్లా కౌతలం మండలం ఊరుకుందకు చెందిన ప్రమీల (23)కు పెళ్లయింది. ఈమెకు మృత్యుంజయ (ముత్తు) (12), ప్రకాష్ (7) కొడుకులు. అదే మండలం అల్లాడుదిన్నెకు చెందిన రంగస్వామి (21) ప్రొద్దుటూరు పట్టణంలో బీపీటీ చదువుతున్నాడు. వారికి ఎక్కడ పరిచయం అయిందో తెలియదు. కానీ, సొంతఊరి నుంచి ప్రమీల కొడుకులను తీసుకుని నెల కిందటే ప్రొద్దుటూరుకు చేరుకుంది. లింగాపురం ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని రంగస్వామితో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు. వారంతా కొత్తగా రావడం వల్ల స్థానికులతో కూడా పెద్దగా పరిచయాలు లేవని తెలిసింది.
జంటగానే చీరకు ఉరి..
ప్రొద్దుటూరు పట్టణం తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలోని లింగాపురం కాలనీలో జీవనం ప్రారంభించిన ప్రమీల, రంవస్వామి మధ్య ఏమి జరిగిందో ఎవరికీ తెలియడం లేదు. గురువారం ఉదయం వారిద్దరూ అద్దె ఇంటిలోనే ఒకే చీరకు ఉరివేసుకుని, చనిపోయారు. గమనించిన పిల్లలు కేకలు వేశారో? ఏడుస్తున్నారో? తెలియదు. సమీపంలోని నివాసితులు వచ్చే సరికి వారిద్దరూ శవాలై వేలాడుతు కనిపించారు. ఈ సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు పట్టణ సీఐ నాగభూషణం, ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉరితాడుగా వాడిన చీర నుంచి సునీత, రంగస్వామి మృతదేహాలను కిందికి దించారు. ఆ తరువాత ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. వారిద్దరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడారనేది తెలియలేదు. విద్యార్థి రంగస్వామి వద్ద లభించిన ఆధారాలతో అతని కుటుంబీకులకు సమాచారం అందించారు.
"శవపరీక్ష అనంతరం రంగస్వామి మృతదేహాన్ని అతని కుటుంబీకులు తీసుకుని వెళ్లారు" అని ప్రొద్దుటూరు తాలూకా ఎస్ఐ శ్రీకాంత్ చెప్పారు.
"ఆత్మహత్యకు పాల్పడిన ఇంటి నుంచి దొరికిన అడ్రస్ ఆధారంగా సునీత కుటుంబీకులకు సమాచారం అందించాం. ఆమె భర్త ఐజాక్, తల్లిదండ్రుల నుంచి స్పందన లేదు. ఎవరూ ముందుకు రాలేదు" సీఐ నాగభూషణం తెలిపారు.
అమ్మకోసం ఆరాటం..
ఊరుకాని ఊరికి ఇద్దరు కొడుకులతో వచ్చిన సునీత ప్రియుడితో కలిసి శనివారం ఉదయం అర్ధంతరంగా ప్రాణాలు తీసుకుంది. ఆమె ఇద్దరు కొడుకులు అనాథలుగా మిగిలారు. శవాలు మార్చురీలో ఉంటే ఆ పిల్లలు ఇద్దరు తల్లడిల్లిపోయారు. తల్లి కోసం ఏడేళ్ల కొడుకు ప్రకాష్ రోదిస్తున్నాడు. కాలనీ వాళ్లు సముదాయించారు. ఈ దృశ్యాలు చూస్తున్న పోలీసులు కూడా చలించిపోయారు. బంధువులు, భర్త నుంచి స్పందన లేకపోవడంతో సునీత మృతదేహం మూడు రోజులుగా ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉండిపోయింది. పిల్లలను తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ నాగభూషణం, ఎస్ఐ శ్రీకాంత్ చేరదీశారు.
"కాలనీలో ఉన్న వారితో మాట్లాడి, రెండు రోజులు పొరుగు ఇళ్లలో సంరక్షణ చేయడానికి ఏర్పాట్లు చేశాం " సీఐ నాగభూషణం చెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, ఆదివారం ఆ ఇద్దరు బాలురన రక్షణ, భద్రత, పునరావాసం కల్పించడానికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి అప్పగించాం" అని సీఐ నాగభూషణం వివరించారు. పిల్లలకు కొత్త దుస్తులు కొనిచ్చిన ప్రొద్దుటూరు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ శ్రీకాంత్ కొంత ఆర్థికసాయం అందించారు. పిల్లలకు ధైర్యం చెప్పిన వారిద్దరు, భవిష్యత్తులో కూడా సాయం చేస్తామని బుజ్జగించి, కడప నగరంలోని అమ్మఒడి అనాథ శరణాలయానికి తరలించారు. ప్రభుత్వం ద్వారా ఆ పిల్లల సంరక్షణకు శ్రద్ధ తీసుకుంటున్నామని పోలీస్ అధికారులు చెప్పారు.
Next Story

