ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
x
కడప జిల్లా ఒంటిమిట్టలోని సీతా సమేత శ్రీకోదండరామస్వామి, లక్షణుల ఉత్సవ విగ్రహాలు

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మార్చి 27న ధ్వజారోహణం


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే కడప జిల్లా ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి అంకురార్పణ జరిగింది. ఒంటిమిట్ట అర్చకులతో కలిసి టీటీడీ వేద పండితులు శ్రీవారి ఆలయం తరహాలోనే శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు.


పురాతన చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ ఆలయంలో ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య మూర్తులు వెలసి ఉండటంతో ఒంటిమిట్టను “ఏకశిలానగరం”గా కూడా పిలుస్తారు. ఈ పవిత్రక్షేత్రంలో మార్చి 26 నుంచి ఏప్రిల్ ఐదోవ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో ముస్తాబైంది.

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో గురువారం ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలను శాస్త్రోక్తంగా చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి అర్చకుల వేదమంత్రాల నడుమ అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ ఈఓ ఏ. ప్రశాంతి, ఏఈఓ బాలరాజు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ప్రత్యేక పూజలు

అంతకుముందు ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ వంటి శాస్త్రోక్త కర్మలను నిర్వహించారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.


మార్చి 27న ధ్వజారోహణం

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత టీటీడీ అధికారులే ఇక్కడ పూజలు, విశేష పర్వదినాలను కూడా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఒంటిమిట్టలో శ్రీారామనవమి వేడుకల్లో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. దీంతో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు పోతన జయంతి కార్యక్రమం, కవి సమ్మేళనం జరుగనుంది. రాత్రి ఏడు నుంచి 9 గంటల వరకు శేషవాహనంపై అధిరోహించే సీతారామ, లక్ష్మణులు యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు.
Read More
Next Story