
మీడియాకు నగలు చూపిస్తున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు
కళ్లలో కారం కొట్టి నగలు దోచి.. పోలీసు వలలో చిక్కిన టక్కరి
చెన్నైలో నిందితుడు అరెస్టు. రూ.14 లక్షల నగలు స్వాధీనం.
బంగారు అభరణాలు కొనడానికి ఓ వ్యక్తి వచ్చాడు. షాపు యజమాని ఏమరపాటుగా ఉండడం గమనించి కళ్ళలో కారం పొడి చల్లాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 12 బంగారు గొలుసులతో ఉడాయించాడు. ఈ ఏడాది మార్చి 14వ తేదీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట జ్యువెలరీ షాపులో పట్టపగలు జరిగిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. రంగంలోకి దిగిన పోలీసులు తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట దొంగను అరెస్టు చేశారు.
ఆంధ్రా, తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నిందితుడుగా ఉన్న చెన్నై నగరానికి చెందిన వేల్మురగన్ అలియాస్ పల్సర్ బాబును తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
"రూ. 14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న తమిళనాడులోని తొండియార్ పేట కు చెందిన వేల్మురగన్ అలియాస్ పల్సర్ బాబును అరెస్టు చేశాం" అని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు శనివారం చెప్పారు. సూళ్లూరుపేట సీఐ ఎం .మురళిక్రిష్ణ, క్రైం పోలీస్ స్టేషన్ సీఐ శివకుమారరెడ్డి, సైబర్ క్రైమ్ సీఐ వినోద్ కుమార్, కమాండ్ అండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్, సూళ్లూరుపేట, తడ ఎస్సైలు జీ. అజయ్ కుమార్, కే. కొండప్పనాయుడుతో కలిసి ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు శనివారం ఆ వివరాలు వెల్లడించారు.
ఇదీ సంఘటన
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం లోని శ్రీవేంకటేశ్వరా జ్యువెల్లర్స్ షాపులో గత నెల 14వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఒక వ్యక్తి బంగారు చైన్లు కొనడానికి వచ్చాడు. నగలు పరిశీలిస్తూ, యజమాని కళ్లలో కారం పొడి చల్లి 12 బంగారు గొలుసులను ఎత్తుకుని పారిపోయాడు. ఈ సంఘటనపై బాధిత యజమాని ఫిర్యాదులో సీఐలు, ఎస్ఐలు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు.జిల్లా క్రైం అదనపు ఎస్పీ ఏ. శ్రీనివాసులు, నాయుడుపేట డియస్పీ జి.చెంచుబాబు ఆధ్వర్యం లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
చెన్నైలో అరెస్టు..
సూళ్లూరుపేట పట్టణంలో పట్టపగలు చోరీ జరగడంపై పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సంఘటన జరిగిన తీరు, గతంలో ఇదే తరహా జరిగిన సంఘటనల నేపథ్యం ఉన్న పోలీసు రికార్డులు పరిశీలించారు. సీసీ టీవీ పుటేజీ కూడా పోలీస్ అధికారులకు ఉపయోగపడింది. వాటి ఆధారంగా నిందితుడిని పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. దర్యాప్తు బృందాలు చెన్నై నగరంలోని తొండియార్ పేట్ ప్రాంతానికి చెందిన వేల్మురుగన్ బాబు (35) (పల్సర్ బాబు, బాబు)ను అరెస్టు చేసినట్లు ఎస్పీ సుబ్బారాయుడు వివరించారు.
"నిందితుడు వేల్మురుగన్ బాబు నుంచి రూ. 14 లక్షల విలువైన 112 గ్రాముల బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితుడు వాడిన స్కూటీని కూడా మా సిబ్బంది పట్టుకున్నారు" అని ఎస్పీ సుబ్బారాయుడు వివరించారు.
సూళ్లూరుపేట జ్యెవెలరీ షాపులో చోరీకి పాల్పడిన వేల్మురుగన్ బాబుకు ఆంధ్ర, తమిళనాడులోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. 24 చోరీ కేసుల్లో వేల్మురుగన్ బాబు నిందితుడని, తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తిలో కూడా కేసులు ఉన్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. కొన్ని కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్న నిందితుడు వేల్మురుగన్ కోసం తమిళనాడు పోలీసులు కూడా గాలిస్తున్నారు. అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్టు చేసిన అధికారులు, పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించారు.
Next Story

