
టిటిడి కల్యాణ మండపాల నిర్వహణకు హెల్ప్ లైన్
భక్తుల నుంచి శ్రీవారి సేవకులతో అభిప్రాయసేకరణ.
టిటిడి కల్యాణ మండపాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు వీలుగా దృష్టి సారించారు. దీనికోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో శనివారం ఆయన టిటిడి చీఫ్ ఇంజనీర్ టి.వి.సత్యనారాయణ, ఎఫ్ ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ తోపాటు అధికారులతో ఈఓ సింఘాల్ సమీక్షించారు.
"దేశంలోని కల్యాణ మండపాల నిర్వహణపై యాత్రికుల నుంచి అభిప్రాయాల సేకరణకు హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయండి" అని ఈఓ సింఘాల్ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని శ్రీవారి సేవకుల ద్వారా కూడా ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయాల్సి అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల కల్యాణ మండపాల నిర్వహణ, వాటిల్లో ఎలాంటి సదుపాయలు కల్పించాలనే విషయం తెలుస్తుందన్నారు. ఆ తరువాత ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ ఓ అనిల్ కుమార్ అధికారులకు సూచించారు.
ఎఫ్ఎంఎస్ పరిధిలోకి...
దేశంలోని కళ్యాణ మండపాల నిర్వహణ ఎఫ్ఎంఎస్ పరిధిలోకి తీసుకువస్తే పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని అధికారుల సమీక్షలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సూచన చేశారు.
దేశంలోని 37 ప్రాంతాల్లో టీటీడీ కళ్యాణ మండపాలు నిర్మించింది. వాటిలో 166 కల్యాణ మండపాల నిర్వహణ బాధ్యతను టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. 29 కళ్యాణ మండపాలను దేవాదాయ శాఖలోని ఆలయాలకు లీజుకు ఇచ్చింది. వీటి ద్వారా టీటీడీకి సంవత్సరానికి 4.28 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
రాష్ట్రంలో 184, తెలంగాణలో 65, ఒడిశాలో ఒకటి, కర్ణాటకలో మూడు, కేరళలో ఒకటి, తమిళనాడులో రెండు కల్యాణ మండపాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
2029లో వాటిన్నింటినీ అధునీకరించారు. దేశంలోని కళ్యాణ మండపాలను మూడు గ్రేడ్లుగా విభజించి, నిర్వహణ చేస్తున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అంటే జాతీయ రహదారులు సమీపంలో నిర్మించిన కళ్యాణ మండపాల నిర్వహణ భారం పెరిగింది. సుమారు 20 ఏళ్ల నుంచి కళ్యాణ మండపాలను టెండర్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు.
కల్యాణ మండపాలపై ఇటీవల ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అంతర్గత సమీక్ష చేశారు.
"దేశంలో టీటీడీ కల్యాణ మండపాలు ఎన్ని ఆదరణలో ఉన్నాయి. ఆదరణ తక్కువగా ఉన్నవి ఎన్ని, ఆధునీకరించిన మండపాల వివరాలు, వాటి స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించండి" అని ఈఓ అనిల్ కుమార్ సింగల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటిపై నివేదిక తయారు చేయడం ద్వారా కళ్యాణాలు నిర్వహించుకునేందుకు వీలుగా సమగ్ర విధానం సిద్ధం చేయాలని, ఆ నివేదిక ఈ నెలలో జరగబోయే టీటీడీ పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈవో వీరబ్రహ్మంను ఆదేశించిన విషయం తెలిసిందే.
రంగంలోకి శ్రీవారి సేవకులు
టిటిడి కళ్యాణ మండపాల స్థితిగతులు, నిర్వహణపై కూడా శ్రీవారి సేవకుల నుంచి సమాచారం సేకరించడానికి ఈఓ సింఘాల్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన ఏమన్నారంటే..
"కల్యాణ మండపాలకు కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు, కళ్యాణ వేదిక, అలంకరణ, వివాహ వేడుక నిర్వహణకు అనువుగా ఉన్నాయా, పార్కింగ్ సౌకర్యం, వర్షాకాలంలో లీకేజీలు ఉన్నాయా, కల్యాణ మండపాలలో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయా, సెక్యూరిటీ తదితర అంశాలపై అభిప్రాయాలు" సేకరిస్తామని సింఘాల్ తెలిపారు. ఈ వివరాల ఆధారంగామరింత మెరుగైన సౌకర్యాల ఏర్పాటుకు సులువు అవుతుందని ఆయన అధికారులకు సూచించారు.
Next Story

