
పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ (ఫైల్)
108 ఏళ్ల వయసులో.. సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే రాజన్ కన్నుమూత
ఎమ్మెల్యేలకు పింఛన్ బిల్లు వ్యతిరేకించిన నేత. సమరయోధుడిగా పింఛన్ కూడా అందకోకుండానే..
తొలితరం స్వాతంత్ర సమరయోధుడు, శతాధిక వృద్ధుడైన చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే తానేదార్ చిన్నరాజన్ (టిసి రాజన్ ) ( 108 ) శుక్రవారం ఉదయం తుదిశ్వస విడిచారు. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం రాయలపేట గౌదమాకులపల్లిలో 1918 సెప్టెంబర్ 11వ తేదీ జన్మించిన టిసి రాజన్ హాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ పిలుపు మేరకు టీసీ రాజన్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.
రాజాజీ స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు అసెంబ్లీ స్థానం నంచి టీసీ రాజన్ 1967లో తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన కేవలం రూ 2500 ఖర్చు చేసినట్టు జీవించి ఉన్న కాలంలో అనేకసార్లు రాజన్ తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. అప్పటి ఎస్పీ సుబ్బరాయం ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తంతి తపాలా వైర్లను తెంచిన సంఘటనలో మూడు నెలలు జైలు జీవితం గడిపారు.
పెన్షన్ ఎందుకన్న రాజన్
పలమనేరు అసెంబ్లీ స్థానం నుంచి 1967 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్ అసెంబ్లీలో చేసిన ప్రతిపాదన కలకలం రేపింది. ఎమ్మెల్యేల పెన్షన్ బిల్లును ఆయన వ్యతిరేకించారు.
"ఎమ్మెల్యేలు ప్రజలకు సేవకులు. పదవీ విరమణ తరువాత పింఛన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి నేను వ్యతిరేకం" అని టీసీ రాజన్ పింఛన్ బిల్లును వ్యతిరేకించారు. మిగతా సభ్యుల ఆమోదించడం వల్ల ఆ బిల్లు పాస్ అయిందని, చివరి దశలో నాకు రూ. 15 వేలు వచ్చేదని ఆయన జీవించి ఉన్నప్పుడు చెప్పిన మాటలు.
లంచం ఇవ్వలేదని..
పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ముందు ఆయన స్వాతంత్ర్య పోరాటంలో తన సేవలు అందించారు. ఆ తరువాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన, రాజన్ కు మాత్రం పింఛన్ మంజూరు కాలేదు.
"నా ఫైల్ ఢిల్లీకి వెళ్లింది. అక్కడ లంచం ఇవ్వనిదే పింఛన్ మంజూరు చేయలేమంటు కొర్రీలు పెట్టారు. అలాంటి పింఛన్ నాకు అవసరం లేదు" అని తిరస్కరించినట్లు కూడా పలు ఇంటర్వ్యూల్లో రాజన్ ప్రస్తావించారు. ఆయన స్థితిపై మీడియాలో అనేక కథనాలు వెలువడినా, జీవిత చివరి అంకంలో రాజన్ కుమాత్రం సమర యోధుల పింఛన్ మంజూరు కాలేదు.
ఓ వీధికి రాజన్ పేరు..
పలమనేరులో కాకుండా చిత్తూరు జిల్లాలో రాజన్ పేరు తెలయని వారు లేరు. ఆయన సేవలకు గుర్తింపుగా రాజన్ జీవించి ఉండగానే పలమనేరు పట్టణంలో ఓ వీధికి ఆయన పేరు పెట్టడం ద్వారా మున్సిపల్ అధికారులు తగిన గౌరవం ఇచ్చారు. పలమనేరులోని ఓ అద్దె ఇంటిలో నాలుగు జతల దుస్తులతోనే ఆదర్శంగా జీవనం సాగించారని అక్కడి మీడియా ప్రతినిధులు కూడా చెప్పారు.
Next Story

