ఈఓ బదిలీ ఎఫెక్ట్: టీటీడీ బోర్డు మీటింగ్ వాయిదా..
x
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

ఈఓ బదిలీ ఎఫెక్ట్: టీటీడీ బోర్డు మీటింగ్ వాయిదా..

కొత్త ఈఓ బాధ్యతలు స్వీకరించాకే తిరుమలలో సమావేశం.


తిరుమల తిరుపతి దేవస్థానం (TTD ) ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక బదిలీ నేపథ్యంలో పాలక మండలి సమావేశం వాయిదా పడింది. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఫిబ్రవరి నెల టీటీడీ బోర్డు మీటింగ్ రెండో తేదీ (మంగళవారం) నిర్వహించాలి. టీటీడీ ఈఓగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముద్దాడ రవిచంద్ర ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఆయన తిరుపతికి ఎప్పుడు వస్తారనేది కూడా ఇంకా సమాచారం లేదని టీటీడీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారి లేకుండా పాలక మండలి సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడం వల్ల వాయిదా వేసినట్లు ఓ అధికారి చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గం తరహాలోనే టీటీడీ పాలక మండలి పాత్ర కూడా ఉంటుంది.
టీటీడీ చిన్న రాష్ట్రాన్ని తలపించే విదంగా 5,400 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ తో నిర్వహించే కార్యకలాపాలకు ప్రతి నెలా ఒకసారి టీటీడీ పాలక మండలి ( TTD Governing Body ) సమావేశంలో విధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో ప్రధానంగా ఆలయ నిర్వహణలో అవసరమైన చర్యలపై నిర్ణయాలు తీసుకోవడం, విద్య, వైద్య రంగాలతో పాటు యాత్రికుల అవసరాలకు తగినట్లు పరిస్థితులకు అనుగుణంగా టీటీడీ పాలక మండలిలో నిర్ణయాలు ఉంటాయి. ఇంజినీరింగ్ విభాగంలో చేపట్టే పనులపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ముందస్తుగా తయారు చేసే అజెండాతో పాటు, టేబుల్ అజెండాలో కూడా టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని సభ్యులు చర్చిస్తారు. ఈ నిర్ణయాలపై ఈఓ పర్యవేక్షణ ఉంటుంది.
టీటీడీ ఈఓ సింఘాల్ ఆకస్మిక బదిలీ కావడం, కొత్త ఈఓ రవిచంద్ర ఇంకా బాధ్యతలు తీసుకోని కారణంగా పాలక మండలి భేటీ వాయిదా పడడం అనివార్యమైంది. కొత్త ఈఓ ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకారం తరువాత, బోర్డు మీటింగ్ తేదీ ఖరారు చేస్తారని సీనియర్ అధికారి చెప్పారు.
Read More
Next Story