తిరుపతిలో పట్టాభిషేకం.. పురంలో పట్టాభిరాముడి కల్యాణోత్సవం..
x
తిరుపతిలో శ్రీకోదండరాముడికి కిరీటధారణ చేస్తున్న టీటీడీ వేదపండితులు

తిరుపతిలో పట్టాభిషేకం.. పురంలో పట్టాభిరాముడి కల్యాణోత్సవం..

వాల్మీకిపురంలో సోమవారం ఉదయం రథోత్సవానికి టీటీడీ ఏర్పాట్లు.


చిత్తూరు జిల్లాలో శ్రీరామనవమి వార్షిక ఉత్సవాలు కనువిందుగా సాగుతున్నాయి. తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి పట్టాభిషేకం వైభవంగా సాగింది. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామాలయంలో వేద మంత్రాల మధ్య సీతారాముల వారి కల్యాణఘట్టం టీటీడీ వేదపండితులు వేడుకగా నిర్వహించారు. అనంతరం జగదభిరాముడిగా గరుడవాహనంపై విహరిస్తూ దర్శనం ఇచ్చారు. వాల్మీకిపురంలో ఈ నెల 30వ తేదీ రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజాధిరాజ.. రాజమార్తాండ..


తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో ఆదివారం రాత్రి టీటీడీ వేదపండితులు శ్రీరామపట్టాభిషేకం రాజదర్బార్ ను తలపించే రీతిలో నిర్వహించారు. రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం కనువిందుగా సాగింది. సీతారాములు, లక్షణుడి విగ్రహాలను ఆశీనులను చేశారు. శ్రీరాముడి వైభవాన్ని వివరిస్తూ, వేదపండితులు మంత్రోచ్ఛారణ చేశారు. రామయణ ఘట్టాలను ఆలపించారు. యాత్రికుల జయజయధ్వానాల మధ్య కిరీటాన్ని రాములవారి శిరస్సున ధరింప చేసే సమయంలో జయజయధ్వానాలు ప్రతిధ్వనించాయి.

శ్రీకోదండరామాలయంలో ఆదివారం ఉదయం స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్‌ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహతీర్థం నుంచి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.

రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

వాల్మీకిపురం పట్టాభిరాముడి కల్యాణోత్సవం...

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనువిందుగా సాగుతున్నాయి. రాముల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఈ దివ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయాన్ని 1997 ఫిబ్రవరి రెండో తేదీ స్వాధీనం చేసుకున్న నాటి నుంచి టీటీడీ ఇక్కడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

సంక్షిప్తంగా చరిత్ర


వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్రమూర్తి దివ్యదర్శనం కలిగించిన పవిత్ర స్థలమే వాల్మీకిపురం. శ్రీ సీతమ్మవారితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతునితో ఉన్న శ్రీ పట్టాభిరామ స్వామివారి విగ్రహాలను పరమభక్తుడు జాంబవంతుడు ప్రతిష్టించినట్లు పురాణాల కథనం. వల్మీకం (పుట్ట) నుంచిశ్రీరామచంద్రమూర్తి వెలిసిన ప్రదేశంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంతం వాల్మీకిపురం అనే పేరు సంపాదించుకుంది.

ఈ ఆలయ విమానం సుదర్శన విమానంగా ప్రసిద్ధి చెందింది. చోళరాజుల శిల్పశైలిలో విమానం నిర్మించగా, మండపాలు, ద్వార గోపురాలు విజయనగర శైలిలో నిర్మించారు. శ్రీపట్టాభిరామ స్వామివారి దక్షిణ భాగంలో శ్రీ సీతమ్మవా ప్రతిష్ఠించారు. చైత్రమాసంలో అమ్మవారి జన్మ నక్షత్రమైన ఆశ్లేషా నక్షత్రం రోజున శ్రీ పట్టాభిరామ స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీపట్టాభిరామునిపై 20కు పైగా కీర్తనలు రచించినట్లు ఆధారాలు ఉన్నాయి.

కనువిందుగా కల్యాణోత్సవం..
వాల్మికిపురంలోని శ్రీపట్టాభిరామస్వామివారి కల్యాణోత్సవం కనువిందుగా సాగింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామివారు మరియు అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాంగళ్యధారణ, ఉపయుక్త హోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, మాలమార్పిడి, హారతులు, చతుర్వేద పారాయణం, యజమానులకు వేదాశీర్వచనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది.
వాల్మీకిపురంలో శ్రీపట్టాభిరామస్వామివారికి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం తదితరాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, కంకణ భట్టర్ కృష్ణప్రసాద్ భట్టర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, కృష్ణమూర్తి అధికారులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

30న రథోత్సవం

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు సమీప ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీ పట్టాభిరామస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 9.10 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం 11.30 గంటలకు చక్రస్నానం, ఏప్రిల్ రెండో తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టీటీడీ వేదపండితులు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
Read More
Next Story