
పనితీరుతో ఉద్యోగుల పదోన్నతికి వెయిటేజీ..
పనిచేయని వారికి 'శిక్ష'ణ తప్పదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నాలుగు కేటగిరీలుగా అధికారుల వర్గీకరణ.
పరిపాలన వ్యవహారాలు అమలు చేసే ఏపీ ఉద్యోగులు ( AP NGOs ), అధికారుల పనితీరుకు గ్రేడింగ్ నిర్ణయించారు. శాస్త్రీయంగా వివరాలను క్రోడీకరించిన ప్రభుత్వం నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. సీనియారిటీ మాత్రమే పరిమితం కాకుండా, చక్కగా పనిచేసిన అధికారులు, ఉద్యోగుల పదోన్నతికి వెయిటేజీ ( Weightage for Employee Promotions ) ఇస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు.
"అత్యుత్తమ పనితీరు చూపించిన సూపర్ అచీవర్స్ (Super Achievers) అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రిని నేరుగా అభినందన లేఖలు అందుతాయి. ప్రమోషన్లలో ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
"జిల్లా స్థాయిలో పరిపాలనను పర్యవేక్షించే అధికారులను నాలుగు కేటగిరీలుగా విభజిస్తాం. అచీవర్స్, సూపర్ అచీవర్స్, పెర్ఫామర్స్, లెర్నర్స్ గా గుర్తించాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనంతపురం జిల్లా యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సభలో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని తొలగించడానికి ప్రయత్నం చేస్తూనే వారి పనితీరుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఓ కొలమానం విధించారు.
"బాగా పని చేసే వారిని ప్రోత్సహిస్తా. తప్పించుకునే వారికి దండన తప్పదు" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సుతి మెత్తగానే హెచ్చరికలు జారీ చేశారు.
గతానికి భిన్నంగా..
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలా ఓ నియోజకవర్గం పర్యటించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కార్యాచరణ అమలు చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత పరిపాలన వ్యవహారాలపై దృష్టి సారించిన ఆయన శాస్త్రీయ నివేదికలు బహిరంగ సభలో ప్రకటిస్తున్నారు. బాధ్యతలు గుర్తు చేస్తున్నారు. ప్రగతి నివేదికలను వివరించడం ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అదే సమయంలో అధికారుల పనితీరును వివరిస్తున్నారు. తద్వారా జిల్లా స్థాయిలో అధికారులు మరింత బాధ్యతగా పనిచేయవలసిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
అనంతలో విద్య ఇంత దారుణమా..?
అనంతపురం జిల్లాలో కాలేజీ ఎడ్యుకేషన్ విధానం బాగా లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో పనితీరు మెరుగుపరుచుకోవాలని కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ వెంకటరమణ నాయక్ ను హెచ్చరించారు.
"రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ ప్రగతి 60 శాతం ఉంటే, అనంతపురం జిల్లాలో 62 శాతం, ప్రత్యేకంగా తాడిపత్రి నియోజకవర్గంలో జిల్లాకు ఏ మాత్రం తీసుకొని విధంగా 62 శాతం ప్రగతి సాధించడం అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయానికి నిదర్శనం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రశంసించారు. గృహ నిర్మాణ శాఖ అనంతపురం జిల్లా మేనేజర్, తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డిని అభినందించారు. మున్సిపల్ పరిపాలన కూడా అద్భుతంగా ఉందని అధికారులను ఆయన ప్రశంసించారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం, అనంతపురం జిల్లాలో 70 శాతం, తాడిపత్రి కూడా ఏమాత్రం తగ్గని విధంగా 73% ప్రగతి సాధించడం సమన్వయానికి నిదర్శనం అని జిల్లా కలెక్టర్ ఓ ఆనందం పాటు అధికారులను అభినందించారు.
మీకు కావాల్సింది చేస్తాం...
రాష్ట్రంలో ఉద్యోగుల బకాయిల చెల్లించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నదని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం లో ఉద్యోగుల పిఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఇతర పథకాలకు మళ్లించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితి చక్కదిద్దడానికి ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు 10,848 కోట్లు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు. ఎల్ఐసి కింద 4793 మందికి 76 కోట్లు చెల్లించారు. గ్రాట్యుటీ బకాయిల కింద 341 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీస్ శాఖలో సిబ్బంది బిల్లులు విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. తద్వారా ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామనే సంకేతం అందించారు.
పని తీరు మారాలి..
రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందించే విధంగా అధికారులు ఉద్యోగులు పనితీరు మార్చుకోవాలని ఈ ఏడాది జనవరి నుంచి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేకంగా హితవు పలుకుతున్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించడానికి ఈ నెలలోనే ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతామని ఈపాటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
జిల్లాలు, మండలాలే కాకుండా గ్రామాల వారీగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంది. ఏ పథకం ఏ స్థాయిలో అమలు చేశారు? లబ్ధిదారుల అభిప్రాయాలు ఏమిటి? అనే ప్రగతి నివేదికను శాస్త్రీయంగా సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజా వేదిక నుంచి వెల్లడించారు.
"రాష్ట్రంలో ప్రజలకు మరింత సుపరిపాలన అందించే విధంగా ఇకపై ప్రభుత్వ పనితీరు ఉండబోతుంది" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. దీనికోసం నాలుగు గ్రీటింగులు సిద్ధం చేశామని ఆయన స్పష్టం చేశారు.
పనిచేసే వారికి ప్రోత్సాహం.. లేదంటే శిక్షణ
ప్రతి ఉద్యోగికి స్పష్టమైన ఫెర్ఫామెన్స్ ఇండికేటర్స్ (ki performance indicators KP I) కేటాయిస్తారు. ఎవరి పనితీరు ఏమిటనేది డేటా ఆధారంగా స్పష్టంగా విశ్లేషిస్తారు.
1. సూపర్ అచీవర్స్: అత్యుత్తమ పనితీరు చూపించిన అధికారులు సిబ్బందికి ముఖ్యమంత్రిని నేరుగా అభినందన లేఖలు అందుతాయి. ప్రమోషన్లలో ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది.
2. అచీవర్స్: ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేసేవారు వీరికి కూడా తగిన ప్రోత్సాహకాలు అందించడానికి కార్యక్రమం సిద్ధం చేశారు.
3. పెర్ఫార్మర్స్: ఉద్యోగాలకు వచ్చాం. పనిచేశాం. వెళ్లిపోయాం అనే విధంగా సాధారణంగా విధులకు మాత్రమే హాజరయ్యే వారిని పెర్ఫామర్సుగా పరిగణిస్తారు. వారి పనితీరు మెరుగుపరుచుకునే విధంగా ఆలోచన శక్తిని స్థాయిని పెంచడానికి అవసరమైన శిక్షణ ఇస్తారు.
4. లెర్నర్స్ : ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడం, సేవలు అందించడంలో నిర్లిప్తంగా వ్యవహరించే వారిని గుర్తిస్తారు. వారి పనితీరులో మెరుగుదల కోసం అమరావతి లోని రాష్ట్రస్థాయి కేంద్రం లేదంటే జోనల్ కేంద్రాల్లో శిక్షణకు పంపించడం ద్వారా విధుల్లో మరింత చురుకుగా పనిచేసే విధంగా ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి పాఠాలు బోధిస్తారు.
ఈ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏమంటారంటే..
"వృత్తిపరమైన ఎదుగుదల కేవలం సీనియారిటీ ప్రాతిపదికనే కాకుండా పనితీరు ఆధారంగా కూడా గుర్తింపు ఉండాలనేవి నా కోరిక. ప్రభుత్వ యంత్రాంగం వేగంగా పనిచేయాలి. అలా పని చేసే వారిని తల మీద పెట్టుకుంటారు పనిచేయని వారికి నేర్చుకునే అవకాశం కల్పిస్తాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు.
Next Story

