ఏపీ మరో రామరాజ్యం...  దేవతల రాజధానిగా అమరావతి..
x
kadapa: ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

ఏపీ మరో రామరాజ్యం... దేవతల రాజధానిగా అమరావతి..

ఒంటిమిట్ట కల్యాణోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు


రాష్ట్రంలో పేదలకు మంచిపాలన అందించడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. తిరుమల శ్రీవారి అనుగ్రహం, ఒంటిమిట్ట కోదండరాముడి ఆశీస్సులతో రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తామని ముఖ్యమంత్రి జైరాం నినాదాల మధ్య బుధవారం రాత్రి ప్రకటించారు.

కడపజిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీసీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రసంగించారు.

"శ్రీరాముడు, శ్రీవారి అనుగ్రహంతో ప్రజారాజధానిగా అమరావతి ఏర్పాటు కాబోతోంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకుముందు శ్రీకోందరాముడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, మనవడు నారా దేవాన్ష్ తో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తరువాత కల్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. వారితో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు పలువరు మంత్రులు. ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతుల వెంట ఉన్నారు.

జైశ్రీరాం నినాదాలతో..
ఒంటిమిట్ట జానకీదేవి, జగదభిరాముడి కల్యాణోత్సవం క్రతువు సాగిన రెండు గంటల పాటు భార్య నారా భువనేశ్వరి, మనవడు నారా దేవాన్ష్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వేదికపై కూర్చొన్నారు. ఉత్సవాన్ని ఆసాంతం తన్వయత్వంతో ఆస్వాదించారు. ముహూర్త సమయానికి వేదపండితులు శ్రీకోదండరాముడు కల్యాణోత్సవ వేడుకను పూర్తి చేశారు. ఆ వేదిక నుంచి జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
"ఒంటిమిట్ట శ్రీరాముడు, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన జరుగుతుంది. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలోని ప్రాచీన శ్రీ కోదండరామాలయాన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది. ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

దేవతల రాజధానిగా...

అమరావతి రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. పార్లమెంట్‌లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు.
"దేవేంద్రుడు పాలించిన దేవతల రాజధాని అమరావతి స్ఫూర్తితో ప్రజల రాజధానిని అభివృద్ధి చేయాలి" అనే సంకల్పం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రీరాముడు, శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. కళ్యాణ వేదిక వద్ద భారీగా తరలివచ్చిన భక్తజన సమూహం మధ్య జై శ్రీరామ్ నినాదాలు మార్మోగగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Read More
Next Story