శ్రీవారి ట్రస్టులకు 1.70 కోట్ల రూపాయల విరాళాలు...
x

శ్రీవారి ట్రస్టులకు 1.70 కోట్ల రూపాయల విరాళాలు...

ఎస్వీప్రాణదాన ట్రస్టుకు చెన్నై వ్యాపారి కోటి రూపాయల విరాళం.


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే యాత్రికుల నుంచి హుండీకి అందుతున్న కానుకలకు కొదవలేదు. టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు కూడా దాతలు విరాళాలు అందిస్తున్నారు. గురువారం తిరుమలలో దాతలు 1. 70 కోట్ల రూపాయల వరకు విరాళాలు అందించారు. ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత కోటి రూపాయలు అందించారు. మరో ముగ్గురు దాతలు రూ. 70 లక్షల రూపాయలు వేర్వేరుగా టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, టీటీడఅ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి వారి క్యాపు కార్యాలయాల్లో దాతలు చెక్కులు అందించారు.

టీటీడీ పరిపాలనా వ్యవహారాలతో పాటు ధార్మిక కార్యక్రమాలు, విద్య, వైద్యం, అన్నదాన పథకాలను కూడా అమలు చేస్తోంది. వాటిలో దాతల విరాళాలతో నిర్వహించడానికి తొమ్మిది ట్రస్టులు ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టుల ద్వారా ఉచిత అన్నదాన పథకంతో పాటు పేద రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడానికి టీటీడీ తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విద్యా విజ్ణన సంస్థ (స్విమ్స్) ఆస్పత్రి ఏర్పాటు చేసింది. ఈ ఆస్పత్రిలో పేదరోగులకు ఉచిత వైద్య సేవల కోసం శ్రీవేంకటేశ్వర ప్రాణ దాన ట్రస్టు కూడా ఏర్పాటు చేసింది.

చెన్నై వ్యాపారి కోటి విరాళం..


తిరుపతిలో టీటీడీ ఏర్పాటు చేసిన స్విమ్స్ ఆస్పత్రి ద్వారా పేదరోగులకు మెరుగైన సేవలు అందించాలని ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి కోరారు. తన వంతు సాయంగా ఆయన కోటి రూపాయలు శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు విరాళం చెక్కు తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుకు గురువారం అందించారు. పేద రోగులకు సాయంగా కోటి రూపాయలు అందించిన ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డిని టీటీడీ చైర్మన్ నాయుడు అభినందించారు. అంతకుముందు ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.

అన్నదాన ట్రస్టుకు రూ. 60 లక్షలు

శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం తిరుమలలో టీటీడీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంట నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తోంది. రోజూ సగటున ఇక్కడ 75 నుంచి 80 వేల మంది యాత్రికులకు టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలు వడ్డిస్తోంది. ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగడానికి టీటీడీ శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదాన ట్రస్టును కూడా నిర్వహిస్తోెంది. తిరుమలలో గురువారం ముగ్గురు దాతలు రూ. 60 లక్షలు అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందించారు.

తిరుమల క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి చెన్నై నగరానికి చెందిన రేవతి, విశ్వనాథ్ దంపతులు తిరుమలలోని అన్నదానట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందించారు.

హైదరాబాద్ కు చెందిన వి.శ్రీభవేశ్ చౌదరి రూ.10,07,777 విరాళంగా అందించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పొనకల నాగేంద్ర రావు రూ.10 లక్షలు విరాళం అందించారు.

టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ద్వారా హైదరాబాద్ కు చెందిన లియాన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత కంది ఆశోక్ కుమార్ టీటీడీ నిర్వహిస్తున్న అన్నదాన ట్రస్టుకు 10 లక్షలు విరాళం చెక్కు అందించారు. దాతలను టీటీడీ అధికారులు అభినందించారు.
Read More
Next Story